మాట్లాడుతున్న కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి
కడప కార్పొరేషన్: ఆరునెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాయిళాలు ప్రకటించి ప్రజలను మరోసారి మోసం చేయలేరని వైఎస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు అన్నారు. శుక్రవారం స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో కమలాపురం, రైల్వేకోడూరు, కడప ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ఎస్‌బి అంజద్‌బాషాలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు 600లకు పైగా హామీలిచ్చారని,అందులో ఒక్క హామీ నెరవేర్చలేదని, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు నిరుద్యోగ భృతి ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో ఒక కోటి 74లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, నెలకు రూ.2వేల చొప్పున 52 నెలలకు లక్షా 4వేల రూపాయలు ఒక్కో నిరుద్యోగికి ఈ ప్రభుత్వం బకాయి పడిందన్నారు.
52నెలలు పట్టించుకోకుండా రాబోయే నాలుగు నెలలు రూ.1000ల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తే హామీ నెరవేర్చినట్లు అవుతుందా అని సూటిగా ప్రశ్నించారు. రైతు రుణమాఫీ విషయంలోనూ ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిందని రాష్ట్రంలో 87,500కోట్లు రైతు రుణాలు ఉంటే కేవలం 11వేల కోట్లు ఇచ్చి మాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో లక్షా 85వేల ఉద్యోగ ఖాళీలుంటే అందులో కేవలం 20వేల బ్యాక్‌లాగ్ ఔట్‌సోర్సింగ్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఏడాది బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేశారని, టీడీపీ ప్రభుత్వం వచ్చాక 5లక్షల మంది కడుపు కొట్టి వారిని ఇంటికి సాగనంపిందన్నారు.
ఎన్నికల ముందు ఐదువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు కేవలం రూ.500కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెబుతున్నారన్నారు. ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు చేరువ అవుతూ తమ ప్రభుత్వం ఏర్పడితే ఆయా వర్గాలకు ఏమేం చేస్తుందో వివరిస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. దీంతో జగన్ పాదయాత్రకు జనం పోటెత్తుతున్నారని, దీన్ని చూసి సీఎం చంద్రబాబు బెంబెలెత్తిపోతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్‌కు భయపడే ప్రభుత్వం తూతూమంత్రంగా ఎన్నికల తాయిళాలు ప్రకటించిందని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు తమను మోసం చేశారని ప్రజలంతా ప్రగాఢంగా విశ్వసిస్తున్నారని, ఇలాంటి కంటితుడుపు చర్యలతో వారిని మరోసారి మోసం చేయలేరని హెచ్చరించారు.
సీఎం కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి తన పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు. అవి అన్నక్యాంటీన్లు కావని ఎన్నికల క్యాంటీన్లు అని, అది నిరుద్యోగ భృతి కాదు ఎన్నికల భృతి అని ఎద్దేవా చేశారు. ప్రజలు తిరస్కరిస్తారనే పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించలేదని విమర్శించారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రాజశేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment