సాక్షి, కడప : తనకు జన్మనిచ్చిన పులివెందుల ప్రజల రుణం తీర్చుకునే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వేస్తున్న అడుగులు అక్కడి ప్రజలను ఆనంద సాగరంలో ముంచెత్తుతున్నాయి. తాజాగా ఈనెల 23, 24, 25 తేదీలలో సీఎం పులివెందుల పర్యటనలో ఆ ప్రాంత ప్రగతి కోసం మరిన్ని అభివృద్ధి పనులకు పునాదిరాళ్లు వేశారు. గతేడాది ఇదే తేదీల్లో తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌గా రూ. 1329 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఆ పనులు పురోగతిలో ఉండగానే, తాజా పర్యటనలో రెండవ ఇన్‌స్టాల్‌మెంట్‌గా రూ. 5163.59 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం పులివెందుల వాసులను పులకింపజేసింది. పులివెందులకు ఎంత చేసినా రుణం తీర్చుకోలేనిదని చెబుతూ... రాజన్న బిడ్డ సొంతగడ్డ ప్రజలు మరిచిపోలేని రీతిలో ఆ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సంకల్పించడం ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. (పులివెందుల రుణం ఎప్పటికీ తీరనిది: సీఎం జగన్)
సీఎం చిత్తశుద్ధిని అక్కడి ప్రజానీకం కొనియాడుతోంది. మొత్తంగా మూడు రోజుల సీఎం పర్యటన విజయవంతమైంది. ఈనెల 23వ తేదీ తొలిరోజు మధ్యాహ్నం 4.30 గంటల ప్రాంతంలో జిల్లాలో అడుగుపెట్టిన ముఖ్యమంత్రి 5.15 గంటల ప్రాంతంలో ఇడుపులపాయ హెలిప్యాడ్‌కు చేరుకుని ప్రజాప్రతినిధులు, నేతలు, ప్రజల వినతిపత్రాలను స్వీకరించారు. ముఖ్యమంత్రి వారికి తానున్నానంటూ భరోసా ఇచ్చారు. 6.20 గంటల ప్రాంతంలో ఇడుపులపాయ అతిథి గృహానికి చేరుకుని అక్కడ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో మాట్లాడారు. ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించి ఆప్యాయత కురిపించారు. 24వ తేదీ రెండవరోజు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో దివంగత ముఖ్యమంత్రి, తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు పులివెందులకు చేరుకున్న ముఖ్యమంత్రి 2.00 గంటల ప్రాంతంలో రూ. 5163.59 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
పురోగమనంలో పులివెందుల..
ప్రధానంగా పులివెందులలో రూ. 34.20 కోట్లతో 12 ఎకరాల్లో ఆర్టీసీ బస్టాండు, డిపోలతోపాటు రూ. 83.59 కోట్లతో ఏపీ ఇమ్రా, రూ. 70 కోట్లతో అపాచీ లెదర్ పార్కుతోపాటు రూ. 3015 కోట్లతో గండికోట, చిత్రావతి, పైడిపాలెం లిఫ్ట్, పులివెందులలో రూ. 1256 కోట్లతో 1.38 లక్షల ఎకరాలు మైక్రో ఇరిగేషన్ అభివృద్ధి, రూ. 14.5 కోట్లతో గండి దేవస్థానం అభివృద్ధి, రూ. 3.26 కోట్లతో పులివెందులలో ప్రముఖ దేవస్థానాల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. దీంతోపాటు రూ. 9.24 కోట్లతో 24 నూతన ఆలయాల నిర్మాణం, 23 దేవాలయాల పునర్నిర్మాణ పనులు, రూ. 36 కోట్లతో తొండూరులో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూలు నిర్మాణం, రూ. 46.44 కోట్లతో నియోజకవర్గ వ్యాప్తంగా పాఠశాలలకు నూతన భవనాల నిర్మాణం, రూ. 184.61 కోట్లతో గ్రామాల అనుసంధానానికి 76 బీటీ రోడ్లు, రూ. 29.70 కోట్లతో 29 రోడ్ల మరమ్మతులు, రూ. 9.50 కోట్లతో కొత్తగా బీటీ రోడ్ల నిర్మాణం, రూ. 56.85 కోట్లతో దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ రోడ్లకు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు.
అలాగే రూ. 11.05 కోట్లతో కుప్పం–కల్లూరిపల్లె రోడ్డు విస్తరణ పనులు, రూ. 5 కోట్లతో సురభి–కుప్పం రోడు వెడల్పు, రూ. 8 కోట్లతో మోపూరి దేవళాలకు రోడ్ల విస్తరణ, రూ. 7 కోట్లతో చిన్నరంగాపురం–నిడివెలగల రోడ్డు విస్తరణ, రూ. 8.90 కోట్లతో మోపూరి భైరవేశ్వరస్వామి దేవస్థానంలో మౌలిక వసతుల ఏర్పాటు, రూ. 5.60 కోట్లతో చిత్రావతి జలాశయం వద్ద టూరిజం అభివృద్ధి, రూ. 5 కోట్లతో పైడిపాలెం జలాశయం వద్ద టూరిజం అభివృద్ధి, రూ. 12.26 కోట్లతో పులివెందుల శిల్పారామం అభివృద్ధి, రూ. 7 కోట్లతో చక్రాయపేట, వేముల, లింగాల మండలాల్లోని పోలీసుస్టేషన్ భవనాల స్థానాల్లో మోడల్ పోలీసుస్టేషన్ భవనాల నిర్మాణం. ఆర్కే వ్యాలీలో నూతన పోలీసు స్టేషన్ భవనాల నిర్మాణం, రూ. 4 కోట్లతో నాగులగుట్టపల్లె గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాల నిర్మాణం, రూ. 200 కోట్లతో పాడాలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, సుందరీకరణ పనులు, రూ. 2.80 కోట్లతో మైత్రి లే అవుట్, పులివెందుల డాక్టర్ వైఎస్సార్ మెమోరియల్ పార్కు అభివృద్ధి, నియోజకవర్గంలో తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సరఫరా కోసం 33/11 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణం, రూ. 6.40 కోట్లతో చక్రాయపేట, నాగులగుట్టపల్లె గ్రామాల్లో పారిశుధ్య సౌకర్యాల అభివృద్ధి పనులు, రూ. 14 కోట్లతో సింహాద్రిపురంలో పారిశుధ్య సౌకర్యాల మెరుగుకు డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. తాజాగా ముఖ్యమంత్రి రూ. 5163.59 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పులివెందుల వాసులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు.
పులివెందులలో ఇళ్ల పట్టాల పంపిణీ జరగకపోవడం బాధగా ఉంది
అనంతరం సీఎం మాట్లాడుతూ క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి పర్వదినాలు రెండూ ఒకేరోజు కలిసి రావడం శుభదినమన్నారు. ఇంత మంచిరోజున రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నా....మనసులో ఎక్కడో చిన్న బాధ ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేస్తున్నా పులివెందులలో మాత్రం కార్యక్రమం చేయలేకపోతున్నామన్నారు. ఏపీఐఐసీ భూముల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే నష్టం జరుగుతుందని కొందరు కోర్టుకు వెళ్లారని, దీంతోనే ఇక్కడ కార్యక్రమం వాయిదా పడిందన్నారు. అనంతరం కడప విమానాశ్రయం చేరుకున్నారు. ఆ తర్వాత 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి రాజమండ్రికి బయలుదేరి వెళ్లారు.
చివరిరోజు ఇలా..
25వ తేది మూడవరోజు ఉదయాన్నే పులివెందులకు చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేకును కట్ చేసి నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment