
నామినేషన్ పత్రాలపై సంతకం చేస్తున్న వైఎస్ జగన్
సాక్షి కడప: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 1.49 గంటలకు పులివెందుల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట వైఎస్సార్‌సీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్‌రెడ్డి, పులివెందుల వైఎస్సార్‌సీపీ నేత వైఎస్ మనోహర్‌రెడ్డి, నేతలు నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి ఉన్నారు. మధ్యాహ్నం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న వైఎస్ జగన్ నామినేషన్ పత్రాలకు సంబంధించిన ప్రక్రియను అక్కడే పూర్తి చేశారు. అనంతరం రిటర్నింగ్ అధికారి సత్యంకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. వైఎస్ జగన్‌ను ఆయన చిన్నాన్న, పులివెందుల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నేత వైఎస్ భాస్కర్‌రెడ్డి ప్రతిపాదించారు. నామినేషన్ వేయడానికి ముందు సీఎస్‌ఐ చర్చి మైదానంలో జరిగిన భారీ బహిరంగసభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు.
జగన్‌కు తల్లి విజయమ్మ ఆశీస్సులు
నామినేషన్ వేయడానికి వెళుతున్న సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి తన తల్లి వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. విజయమ్మ తన కుమారుడిని హత్తుకుని ఆశీస్సులు అందజేశారు. అనంతరం జగన్ అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఆయనకు మద్దతుగా కాన్వాయ్‌ను అనుసరించారు.
సర్వమత ప్రార్థనలు
పులివెందులలోని ఇంటిలో జరిగిన సర్వమత ప్రార్థనల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ఇంటిలో హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు సంప్రదాయ పద్ధతుల్లో ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతోపాటు జగన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డి కూడా పాల్గొన్నారు. సర్వమత ప్రార్థనలు ముగియగానే వైఎస్ జగన్ నామినేషన్ దాఖలు చేయడానికి బయలుదేరి వెళ్లారు.