ఏడాదన్నర కూడా పూర్తికాకుండానే స్థానచలనం
8 మంది ఎంపీడీఓలకు బదిలీలు
మినిస్టీరియల్ సిబ్బందిలోను భారీగా మార్పులు
అర్ధరాత్రి వరకు జాబితాల రూపకల్పనలో అధికారులు బిజీబిజీ
విశాఖపట్నం: అస్మదీయులకు అందలం ఎక్కిస్తున్నారు. పరిపాలన సౌలభ్యం పేరిట కనీసం ఏడాదిన్నర కూడా సర్వీసు పూర్తి కాకుండానే స్థానచలనం కల్పిస్తున్నారు. మాట వినడం లేదని కొందర్ని, డబ్బుల కోసం మరికొందర్ని...సామాజిక సమీకరణల్లో కొంతమందిని బదిలీలు చేస్తున్నారు. బుధవారం సాయంత్రంతో బదిలీలతంతు ముగించాలని సర్కార్ ఆదేశించినా రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో అర్ధరాత్రి వరకు బదిలీల కోసం జిల్లా అధికారులు మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. మరోపక్క తమ అడుగులకు మడుగులొత్తే అధికారులకు అందలం ఎక్కిస్తున్నారు.
జోరుగా పైరవీలు
బదిలీల్లో పైరవీలు జోరందుకున్నాయి. భారీగా చేతులు మారుతున్నాయి. మూడేళ్లలోపు సర్వీసు కూడా పూర్తి కాని వారిలో దరఖాస్తు చేసుకున్న వార్ని పరిపాలన సౌలభ్యం పేరిట బదిలీలు చేస్తున్నారు. కలెక్టర్‌తో సహా జిల్లా అధికారులంతా ఫోన్లు ఎత్తేందుకు ఆసక్తి చూపడంలేదు. ఒక పక్క సిఫార్సు లేఖలు, మరో పక్కమంత్రులు, ఎమ్మెల్యేల ఆదేశాలతో అప్పటికప్పుడు జాబితాల్లో పేర్లు మారిపోతున్నాయి. అధికారిక లెక్కల ప్రకా రం జిల్లాలో 2,299 మంది బదిలీల కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటికే దాదాపు అన్ని శాఖల్లో బదిలీల తంతు పూర్తయినప్పటికీ ఆన్‌లైన్‌లో మాత్రం కేవలం 638 మంది మాత్రమే బదిలీ అయినట్టుగా చూపుతున్నారు. వీరిలో ఐటీడీఎ పరిధిలో 138 నాన్ ఐటీడీఏ పరిధిలో 500 మందిని బదిలీ చేసినట్టుగా ఆన్‌లైన్‌లో చూపిస్తున్నారు. మరో పక్క ఏళ్ల తరబడి జిల్లాలోనే తిష్టవేసి మంత్రులు, ఎమ్మెల్యేల అడుగులకు మడుగులొత్తే అధికారులకు అందలం ఎక్కిస్తున్నారు.
ఎంపీడీలకు స్థానచలనం
ఎనిమిది మంది ఎంపీడీలకు స్థానచలనం కల్పించారు. పద్మనాభం, అచ్యుతాపురం, పెందుర్తి, పాడేరు, ముంచుంగుపట్టు, చీడికాడ, దేవరాపల్లి, కోటఉరట్ల ఎంపీడీఓలకు స్థాన చలనం కల్పించారు. వీరిలో ఏ ఒక్కరి సర్వీసు ఏడాదిన్నర కూడా పూర్తికాలేదు. అయినా సరే స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిల ఒత్తిళ్ల మేరకు బదిలీలు చేసినట్టుగా చెబుతున్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు ద్వారా మాడుగుల టీడీపీ ఇన్‌చార్జి గవిరెడ్డి రామానాయుడు తన మాటవినడం లేదనే ఒకే ఒక్క కారణంతో దేవరాపల్లి, చీడికాడ ఎంపీడీఓలను బదిలీ చేయించారు. నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్‌ను సోదరుడు సన్యాసినాయుడు ఒత్తిడి మేరకు మంత్రి అయ్యన్నపాత్రుడు బదిలీ చేయించారని చెబుతున్నారు. అనకాపల్లి జోనల్ కమిషనర్‌ను కూడా స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు బదిలీ చేసినట్టు తెలుస్తోంది.
అడుగులకు మడుగులొత్తితే అందలమే..
నిన్నగాక మొన్న జెడ్పీ సీఈఓగా పనిచేస్తూ బదిలీపై వేరే జిల్లాకు వెళ్లి అనతి కాలంలోనే బీసీ స్టడీ సర్కిల్ డెరైక్టర్‌గా వచ్చిన ఎం.మహేశ్వరరెడ్డి ఏకంగా ఏపీఐఐసీ అదనపు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా అందలం ఎక్కించారు. కీలకమైన ఈ పోస్టులో మహేశ్వరరెడ్డిని కూర్చో బెట్టడంలో మంత్రి గంటా శ్రీనివాసరావు అండదండలున్నట్టుగా చెబుతున్నారు. మరో పక్క ఇటీవల వరుస పారిశ్రామిక ప్రమాదాల నేపథ్యంలో ఇక్కడ నుంచి బదిలీ చేసిన జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డి.చంద్రశేఖర వర్మను తిరిగి ఇక్కడే కొనసాగిస్తూ రీటెన్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఇక కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌గా ఎన్.సూర్యనారాయణను నియమించారు. విజయవాడలో కార్మిక శాఖ డీసీగా పనిచేస్తున్న ఈయన్ని విశాఖకు బదిలీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న ఆర్ శ్రీనివాసరావును కర్నూల్ డీసీగా బదిలీ చేశారు. సూర్యనారాయణ బదిలీ వెనుక మంత్రి కింజెరపు అచ్చన్నాయుడు సిఫార్సు మేరకే జరిగినట్టుగా చెబుతున్నారు.