కాంగ్రెస్‌.. ఫస్ట్‌ బ్యాచ్‌ | Congress Party Released 8 MLA Candidates List In Warangal | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌.. ఫస్ట్‌ బ్యాచ్‌

Published Sat, Sep 8 2018 3:15 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Congress Party Released 8 MLA Candidates List In Warangal - Sakshi

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : ఎన్నికల సంగ్రామం ఊపందుకుంటోంది.. అధికార టీఆర్‌ఎస్‌కు దీటుగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఖరారుపై కసరత్తు చేస్తోంది. రొటీన్‌కు భిన్నంగా ఆ పార్టీ ఢిల్లీ పైరవీలను పక్కనపెట్టి గెలుపు గుర్రాల మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గడిచిన మూడు, నాలుగేళ్లుగా ప్రజలతో కలిసి ఉంటున్న వారికి టికెట్లు ఖరారు చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి తొలి జాబితాలో 8 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు  ప్రతిపాదిత జాబితాను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ తీసుకెళ్లారు. ఈ జాబితాపై ఈనెల 12న ఏఐ సీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో చర్చించనున్నట్లు తెలిసింది.

అనంతరం ఒక టి, రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్షతో కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో భారీగా దెబ్బతింది. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ స్థాయి నుంచి దిగువ శ్రేణి నాయకత్వం వరకు కాంగ్రెస్‌ కండువాను పక్కన పడేసి గులాబీ దళంతో చేరిపోయారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని నడిపించే నాయకులు లేకుండాపోయారు. ఈ నేపథ్యంలో అంపశయ్య మీదున్న పార్టీకి జీవిగంజి పోస్తూ కొంతమంది నేతలు ప్రజ ల మధ్యే ఉన్నారు. అలాంటి వారికి ఇప్పుడు టికెట్‌ దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే గతంతో పోలిస్తే జిల్లా కాంగ్రెస్‌లో గ్రూప్‌ తగాదాలు తక్కువగానే ఉండటంతో ఏకాభిప్రాయం ఉన్న నియోజ వర్గాల అభ్యర్థుల పేర్లు ఖరారు చేస్తూ తొలి జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది.

ఈ సారి దొంతికే అవకాశం..
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న ఏకైక సిట్టింగ్‌ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి టికెట్‌ ఖారారు చేసినట్లు తెలిసింది. నర్సంపేట నుంచి గత సాధారణ ఎన్నికల్లో పార్టీ నుంచి టికెట్‌ రాకపోవడంతో ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం తిరిగి కాంగ్రెస్‌ పార్టీ లో చేరారు. మొదటి నుంచి కాంగ్రెస్‌వాదిగా ఉన్న దొంతికి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ హ్యాండిచ్చి జేఏసీ నాయకుడు కత్తి వెంకటస్వామికి టికెట్‌ ఇచ్చింది. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

మాజీ ఎమ్మెల్యేలకు మరో అవకాశం..
ములుగు నియోజకవర్గం అభ్యర్థిగా టీడీపీ నుంచి రేవంత్‌ రెడ్డితోపాటు కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్కకు టికెట్‌ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కోయ సామాజిక వర్గానికి చెంది న సీతక్కకు ఈ నియోజకవర్గంపై మంచి పట్టుం ది. ఎన్నికల్లో ఓడిపోయినప్పటీకీ ఆమె మొదటి నుంచి ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఇక భూపాలపల్లి నియోజకవర్గం నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి పేరు ఖరారైనట్లే తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2014 ఎన్నికల్లో మధుసూదనాచారి చేతిలో ఓటమిపాలయ్యా రు. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌ పేరు ఖరారు చేసినట్లు తెలిసింది. ఆయన ఇదే నియోజకవర్గం నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో అరూరి రమేష్‌ చేతిలో ఓడిపోయారు.

జనగామ, స్టేషన్‌ ఘన్‌పూర్‌కు మాజీ మంత్రులు
జనగామ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేరు ఖరారు చేసినట్లు సమాచారం. తొలుత ఆయన కోడలు వైశాలి పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో పొన్నాల పేరు ఖరారు చేసినట్లు సమాచారం. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం టికెట్‌ మాజీ మంత్రి గుండె విజయరామారావుకు ఇచ్చే అవకాశం ఉంది. గతంలో సిద్ధిపేట ఎంపీగా పనిచేసిన ఆయన 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. దివంగత సీఎం వైఎస్‌ ప్రభుత్వంలో పౌర సరఫరా శాఖా మంత్రిగా పని చేశారు. 2014లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు.

ఒకరు తొలిసారి.. ఇంకొకరు మలిసారి..
పాలకుర్తి నియోజకవర్గం నుంచి జంగా రాఘవరెడ్డి తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. జంగా రాఘవరెడ్డి డీసీసీబీ చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఉన్నారు.
డోర్నకల్‌ నియోజకవర్గం నుంచి డాక్టర్‌ రామచంద్రునాయక్‌ మరోసారి ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. ఆయన సూర్యాపేటలో ఒక ప్రైవేటు నర్సింంగ్‌ హోం నిర్వహిస్తున్నారు. 2014లో టీడీపీ తరఫున ఇక్కడి నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement