ఎదురుగాలి
ఎదురుగాలి
Published Sun, Jan 29 2017 11:35 PM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
ఇరకాటంలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి
- తమను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేల కినుక
- తామెందుకు సహకరించాలని బహిరంగ వ్యాఖ్యలు
- ఫ్లెక్సీల్లో కనీసం ఫొటో కూడా వేయడం లేదని ఆగ్రహం
- స్థానిక సమావేశాలకు ఆహ్వానం లేదంటున్న పార్టీ శ్రేణులు
- చర్చనీయాంశంగా మారిన కేజే రెడ్డి తీరు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘ఆయన అప్పుడే ఎమ్మెల్సీగా గెలిచాననుకుంటున్నారా? ఫ్లెక్సీల్లో కనీసం ఎమ్మెల్యేలైన మా ఫొటోలను కూడా వేయడం లేదు. అలాంటప్పుడు ఆయనకు మేమెందుకు సహకరించాలి.’’ ఇదీ కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల నుంచి పట్టభద్ర ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న కేజే రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్న తీరు. జిల్లాలో తిరుగుతున్న సమయంలో కూడా కనీసం తమకు సమాచారం ఇవ్వడం లేదని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. స్థానిక నేతలను పట్టించుకోకపోతే తాము ఎలా సహకరిస్తామని ఎదురు ప్రశ్నిస్తున్నారు.
తమను అవమానిస్తున్నా పార్టీలోని పెద్దలు కూడా ఆయనకు చెప్పకపోవడం ఏమిటని నిలదీస్తున్నారు. పరోక్ష ఎన్నికల్లో పార్టీ గెలుపు అవకాశాలు అంతంతమాత్రమే ఉంటాయని.. కేజే రెడ్డి తీరుతో ఇది మరింత దిగజారుతుందని విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేస్తున్న పోస్టర్లలో కానీ, బ్యానర్లలో కానీ తమ ఫొటోలు లేనప్పుడు ఇక తాము ఎలా ఆయనకు మద్దతు ఇస్తామని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం నేరుగా కేజే రెడ్డికి కూడా కొందరు ఎమ్మెల్యేలు తేల్చిచెప్పినట్టు సమాచారం.
మా ప్రాంతానికి వచ్చినా సమాచారమేదీ?
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థి కేజే రెడ్డి నియోజకవర్గాలకు వెళ్తున్నారు. అయితే ఎక్కడ కూడా కనీసం స్థానికంగా ఉండే అధికార పార్టీ నేతలకు సమాచారం ఇవ్వడం లేదని ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. కనీసం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వడం లేదని.. ఇది అభ్యర్థికి ఉండాల్సిన కనీస లక్షణం కాదని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో తాము మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. కేవలం ఒకరిద్దరు నేతల పేర్లు వేసుకుని ముందుకు వెళితే.. వారితోనే ఓట్లు వేయించుకోవాలని అంటున్నారు.
అధిష్టానం ఆరా...!
తనకు సీటు అధిష్టానం ఇచ్చిందని.. తన మిత్రుడు జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి తనకు సీటు ఇప్పించారనేది కేజే రెడ్డి ధీమాగా ఉందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అందువల్లే స్థానిక నేతలను పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో తమ అసంతృప్తిని నేరుగా పార్టీ పెద్దలకు ఇప్పటికే చెప్పినట్టు పార్టీలోని కొందరు నేతలు చెబుతున్నారు. తాజా పరిస్థితులతో సదరు నేత ప్రవర్తిస్తున్న తీరు పట్ల అధిష్టానం కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. కనీసం ఎమ్మెల్యేలను కూడా కలుపుకోలేకపోతే ఎలా అని అధిష్టానం కూడా మండిపడినట్టు తెలిసింది. మొత్తం మీద అధికారపార్టీలో ఎమ్మెల్సీ అభ్యర్థి తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Advertisement
Advertisement