టీడీపీ జిల్లా కార్యాలయం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా టీడీపీలో అసమ్మతి సెగ రోజు రోజుకూ పెరుగుతోంది. పార్టీలో వర్గ విభేదాలు సమసిపోయేలా చేయాలని సీఎం ఎంత ప్రయత్నించినా సెగ రోజు రోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఏం చేయాలో పాలుపోక సీఎం తల పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పశ్చిమ ప్రకాశంలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఫార్ములాను అమలు చేయాలనుకున్న సీఎంకు ఇక్కట్లు తప్పడం లేదు. యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు సీఎంకు మరింత తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇక అద్దంకిలో తాజా రాజకీయ పరిణామాలు ప్రధానంగా కరణం బలరాం దూకుడుగా వ్యవహరిస్తుండడం సీఎంను మరింత ఇరుకును పెడుతోంది. పది రోజులుగా ఎమ్మెల్సీ కరణం బలరాం అద్దంకి రాజకీయాల్లో దూకుడు పెంచారు. నియోజకవర్గంలోని సంతమాగులూరు, బల్లికురవ, అద్దంకి, జే పంగులూరు మండలాల్లో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో జరిగిన సిమెంటు రోడ్లకు వరుస పెట్టి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అద్దంకి నుంచి రాబోయే ఎన్నికల్లో తామే పోటీలో ఉంటామంటూ కరణం, ఆయన తనయుడు వెంకటేష్‌లు ప్రకటనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో పాటు బలరాం తనదైన శైలిలో తాను పార్టీ మారినప్పుడు పదవికి రాజీనామా చేసి వచ్చానని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు పదవికి రాజీనామా చేయకుండా పార్టీలు మారడం సరైన సంస్కృతి కాదని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై పరోక్ష విమర్శలకు దిగుతున్నారు. కరణం, ఆయన తనయుడు వెంకటేష్‌ల దూకుడుతో సంతమాగలూరు, బల్లికురవ, అద్దంకి, జే పంగులూరు మండలాల్లో వారి అనుచరవర్గం తిరిగి బలరాం చెంతకు చేరుతోంది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరిన తర్వాత నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలు ఆయనకే అప్పగించినట్లు సీఎం ప్రకటించారు. కరణం బలరాంకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి అద్దంకి రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ పరిణామంతో బలరాం వర్గంలో చాలా మటుకు ఎమ్మెల్యే గొట్టిపాటి వైపు వెళ్లింది. ఆ తర్వాత బలరాం కుటుంబం కొద్ది రోజులు అద్దంకి రాజకీయాలకు దూరంగానే ఉంది.
ఇప్పుడు ఒక్కసారిగా బలరాం కుటుంబం అద్దంకి రాజకీయాల్లో జోక్యం పెంచి ఏకంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు దిగడం జిల్లా అధికార పార్టీతో పాటు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బలరాం స్పీడు పెంచినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు కరణం వెంకటేష్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించేందుకు బలరాం సిద్ధమయ్యారు. తాము అద్దంకి నుంచి బరిలో దిగుతామని ఇప్పటికే వారు క్యాడర్‌కు సంకేతాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే పాత వర్గాన్ని మొత్తం తిరిగి తమవైపు తెచ్చుకునేందుకు దూకుడు పెంచినట్లు తెలు స్తోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో అద్దంకి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే గొట్టిపాటి ఉంటారా..? లేక లేక కరణం వెంకటేష్ ఉంటారా..? అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. అధికార పార్టీ క్యాడర్‌లోనూ ఇదే అనుమానం నెలకొంది. బలరాం దూకుడుతో పాత వర్గాలు తిరిగి ఆయన చెంత చేరుతోంది. అద్దంకిలో బలరాం తిరిగి జోక్యాన్ని పెంచడంపై గొట్టిపాటి రవికుమార్ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్‌ల దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే బలరాం విషయంలో తెగేదాక లాగడం సరికాదని ముఖ్యమంత్రి ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇదే అదునుగా బలరాం కుటుంబం సైతం అమీ తుమీకి సిద్ధపడే పరిస్థితి కనిపిస్తోంది. అభ్యర్థి గొట్టిపాటా... లేక తామా ... అన్నది తేల్చుకునేందుకు వారు వ్యూహం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే ఎవరో ఒకరు పార్టీని వీడతారన్న ప్రచారమూ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఎటువైపు మొగ్గుతారన్నది వేచి చూడాల్సిందే.
- చీరాల నియోజకవర్గంలో అసమ్మతి చాపకింద నీరులా కమ్ముకుంది. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను మాజీ మంత్రి పాలేటి రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీత వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆమంచి అవసరం రీత్యా ముఖ్యమంత్రి ఆయనకు ఇటీవల కాలంలో మరింత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే సునీత, పాలేటి రామారావులు ఆమంచికి పూర్తి స్థాయిలో మద్దతు పలికే పరిస్థితి లేదు.
- కనిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కదిరి బాబూరావు మార్పు తధ్యమని టీడీపీలో జోరుగా ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదంటూ టీడీపీ అధిష్టానం ఇప్పటికే బాబూరావుకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నర్సింహారెడ్డికి టికెట్ ఇస్తారన్న ప్రచారం నడుస్తోంది. ఇదే జరిగితే బాబూరావు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉందన్న ప్రచారమూ ఉంది.
- నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న కందుల నారాయణరెడ్డికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం టిక్కెట్టు ఇవ్వదన్న ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో ఈ నియోజకవర్గం నుంచి మరొక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం ఉంది. ఇదే జరిగితే కందుల వర్గం పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఉందన్న ప్రచారమూ సాగుతోంది.
- యర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన డేవిడ్‌రాజు అధికార పార్టీలోకి ఫిరాయించారు. టీడీపీ నేత మన్నే రవీంద్రతో పాటు పలువురు ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ డేవిడ్‌రాజుకు టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదని అధికార పార్టీ వర్గాలే పేర్కొంటుండడం గమనార్హం. దీంతో డేవిడ్‌రాజు సంతనూతలపాడు టీడీపీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. యర్రగొండపాలెం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి కానరావడం లేదు.
- ఇక సంతనూతలపాడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన నేతలు మాజీ ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ను వ్యతిరేకిస్తున్నారు. తమ కనుసన్నల్లో విజయకుమార్ నడవడం లేదన్న అక్కసుతో సదరు నేతలు ఆయనను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆయన తనయుడు లోకేషకు సైతం ఇక్కటి నేతలు విజయ్‌కుమార్‌ను మార్చాలంటూ పలుమార్లు ఫిర్యాదులు చేశారు. ఇక్కడి పరిణామాలు చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి.
- కొండపి నియోజకవర్గంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, ఆయన సమీప బంధువులు దామచర్ల పూర్ణచంద్రరావు, సత్యతోపాటు కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు ప్రభావం ఉంది. జనార్థన్ కొండపి ఎమ్మెల్యే స్వామిని వ్యతిరేకిస్తుండగా జనార్థన్ చిన్నాన్న, సోదరుడు స్వామికి మద్దతు పలుకుతున్నారు. దీంతో జనార్థన్ స్వామికి అడ్డుకట్ట వేసేందుకు జూపూడి ప్రభాకర్‌రావును తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్టు ఇస్తారన్న దానిపై సందిగ్ధం నెలకొంది.
- కందుకూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పోతుల రామారావు ఆ తర్వాత అధికార పార్టీలోకి ఫిరాయించడంతో పోతుల, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం వర్గాల మధ్య సఖ్యత లేదు. ఇరువురు నేతలు బయటకు సఖ్యతగా ఉన్నా క్యాడర్ మధ్య విభేదాలు అలాగే ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో పోతుల టీడీపీ టిక్కెట్ ఇస్తే దివి శివరాం వర్గం మనస్ఫూర్తిగా పనిచేసే పరిస్థితి లేదు.
Comments
Please login to add a commentAdd a comment