పనితీరుపై సీఎం పెదవి విరుపు
♦ ఎమ్మెల్యేలకు ప్రజాదరణ అంతంతమాత్రమే
♦ తగ్గుతున్న మంత్రి మహేందర్‌రెడ్డి హవా
♦ ప్రచారం జోరు.. క్షేత్రస్థాయిలో బేజారు
♦ ఆరు నెలల కాలంలో పరిస్థితి తారుమారు
♦ టీఆర్‌ఎస్ శాసనసభాపక్షంతో సీఎం భేటీ
♦ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే టాప్.. లాస్ట్ మంత్రి
♦ పుంజుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్‌ఆర్
♦ సర్వేపై పార్టీ శ్రేణుల్లో సర్వత్రా చర్చ
ఆరునెలల్లో ఓడలు బండ్లయ్యాయి.. బండ్లు ఓడలయ్యాయి.. కొన్ని నియోజకవర్గాల్లో విపక్షం పుంజుకుంది.. పలుచోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఆదరణ తగ్గింది. ఆరు నెలల్లోనే సిట్టింగ్‌ల పరిస్థితి తారుమారయ్యింది. కొత్త జిల్లాల్లో హవా కొనసాగిస్తోన్న మంత్రిదీ ఇదే దుస్థితి. జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై స్వయంగా సీఎం కేసీఆర్ నిర్వహించిన సర్వేలో ఇది తేలింది. ఆరు నెలల వ్యవధిలో రెండుసార్లు నిర్వహించిన ఈ ‘ప్రోగ్రెస్ రిపోర్ట్’లో పలు విషయాలు వెలుగుచూశాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పెద్దల ప్రచారం టాప్ గేర్‌లో దూసుకెళుతున్నా.. క్షేత్రస్థాయిలో కారు జోరుకు మాత్రం బ్రేకులు పడుతున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. కొన్నిచోట్ల మాత్రం పనితీరుతో సక్సెస్ రేటును సాధించినట్లు తేలింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘ప్రగతి రథచక్రం’ తిరోగమిస్తోంది. రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి గ్రాఫ్ పడిపోతోంది. తాండూరులో ఆయనకు ఎదురుగాలి వీస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అంతర్గత సర్వేలో మహేందర్‌రెడ్డి పనితీరు బాగాలేదని తేలింది. గత ఆరు నెలలతో పోలిస్తే ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ సగానికి తగ్గిపోయింది. గతేడాది ఆగస్టులో నిర్వహించిన సర్వేలో 68.50 శాతం మంది ఆయన పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేయగా.. ఈ ఏడాది జనవరిలో జరిపిన రెండో విడత సర్వేలో ఇది 38.30 శాతానికి పడిపోయింది.
ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తూ జిల్లా రాజకీయాలను ఒంటిచేత్తో శాసిస్తున్న మహేందర్‌రెడ్డికి సొంత ఇలాకాలో ప్రజాదరణ తగ్గుతుందని సర్వేలో తేలడం.. అది కూడా అధికార పార్టీ శాసనసభ్యుల్లోనే చివరి స్థానం కావడం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తారనే గుర్తింపు ఉన్నా.. ప్రజలతో మమేకం కాకపోవడం, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్మాణాత్మకంగా వ్యవహరించరనే కారణాలే ఈ పరిస్థితికి దారితీశాయని పార్టీ వర్గాలు అనుకొంటున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి సర్వేను నిజం చేసేలా ఇటీవల పురపాలక సంఘం ఎన్నికల్లోనూ మంత్రికి చేదు ఫలితాలే మిగిలాయి. ఈ ఎన్నికల్లో తాండూరు మున్సిపాలిటీని ప్రతిపక్ష కాంగ్రెస్ నాటకీయంగా కైవసం చేసుకుంది. ఈ పరిణామాలు, తాజా సర్వే ఫలితాలు మంత్రి అనుచరగణానికి మింగుడు పడటంలేదు.
ఎగబాకిన రామ్మోహన్
కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి (పరిగి) మాత్రం ఊహించని రీతిలో బలం పుంజుకున్నారు. ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో టీఆర్‌ఆర్‌కు మంచి మార్కులు రావడం.. అది కూడా గత సర్వేతో పోలిస్తే తాజా సర్వేలో పరిస్థితి మెరుగుపరుచుకోవడం ఆశ్చర్యపరుస్తోంది. నిత్యం ప్రజలతో కలిసిపోవడం.. ప్రతిపక్ష పాత్ర కూడా సమర్థవంతంగా పోషిస్తుండడం రామ్మోహన్ కు ప్లస్ పాయింట్ అయిందని సర్వేలో తేలింది. టీడీపీ తరుఫున ప్రాతినిథ్యం వహిస్తున్న ర్యాగ కృష్ణయ్య (ఎల్‌బీనగర్) పనితీరుపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి నెలకొంది. ఆరు నెలల క్రితం 54 శాతంప్రజాదరణ ఉండగా.. అది ప్రస్తుతం 24.40 శాతానికి పడిపోయింది. ఇక బీజేపీ ఎమ్మెల్యే ఎన్ వీఎస్‌ఎస్ ప్రభాకర్ (ఉప్పల్) ప్రతిష్ట సైతం మసకబారింది. ఆయన పనితీరుపై 39.70 శాతం ప్రజలు మాత్రమే అనుకూలంగా స్పందించారు.
గాంధీ టాప్..
అధికార పార్టీ ఎమ్మెల్యేల పరపతి రోజురోజుకు దిగజారుతోంది. ఇదే విషయం సర్వేలో స్పష్టమైంది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాత్రం ఊహించనిరీతిలో తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నారు. తొలి సర్వేలో 33.30 శాతం ఉన్న ఆయన గ్రాఫ్ జనవరి సర్వేలో 70.50 శాతానికి ఎగబాకడం సొంత పార్టీ శ్రేణులను సైతం విస్మయానికి గురిచేసింది.
ఇక మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఆయన పనితీరు సూచిక దారుణంగా పడిపోయింది. మొదటి సర్వేలో 60.40 శాతం ఉన్న ఆయన.. చివరి సర్వేలో 39.10 శాతానికి పడిపోయారు. మిగతా ఎమ్మెల్యేదీ దాదాపుగా ఇదే పరిస్థితి. మంచిరెడ్డి కిషన్ రెడ్డి, సంజీవరావు, మలిపెద్ది సుధీర్‌రెడ్డి, యాదయ్య, వివేకానందలకు నియోజకవర్గాల్లో పాసు మార్కులు పడినా.. వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు సర్వే గణాంకాలను బట్టి తెలుస్తోంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాత్రం గతంతో పోలిస్తే కొంత మేర పుంజుకొన్నట్టు తేలింది.
ఇలాగైతే కష్టమే..!
ఎమ్మెల్యేలకు స్థానికంగా వ్యతిరేక పవనాలు వీస్తుండడం ముఖ్యమంత్రిని కలవరపరుస్తోంది. ఒక్కో శాసనసభ్యుడి పనితీరును సర్వే ద్వారా మదింపుచేసిన సీఎం.. బలాలు, బలహీనతలపై కూడా నివేదిక రూపొందించినట్లు తెలిసింది. మరోవైపు త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆ పదవులపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలకు తాజా సర్వే ఇబ్బందిగా మారింది. నియోజకవర్గాల్లో తమకు ఎదురులేదని భావించిన తమను సీఎం సర్వే ఆత్మరక్షణలో పడేసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ సర్వే వాస్తవీకతపై టీఆర్‌ఎస్ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. సర్వేలో తేలిన అంకెలకు స్థానికంగా ఉన్న పరిస్థితికి భారీ తేడా ఉందని అంటున్నాయి.