సర్వే సెగ
► ప్రోగ్రెస్ రిపోర్ట్‌పై తర్జనభర్జన
► టీఆర్‌ఎస్ శ్రేణుల అంతర్మథనం
► లోపాలను దిద్దుకునే దిశగా చర్యలు
► ప్రజాభిప్రాయంపై మరోసారి ఆరా
ఎమ్మెల్యేలపై నిర్వహించిన సర్వేపై జిల్లాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అధికార పార్టీ నేతలు తమ నియోజకవర్గంలో పరిస్థితి.. ఎమ్మెల్యే పనివిధానంపై బేరీజు వేసుకుంటున్నారు. పనివిధానం తగ్గిన ప్రాంతాల్లో దానినుంచి బయట పడేందుకు కొందరు ఇప్పటికే దిద్దుబాట పట్టారు. అయితే, ఎమ్మెల్యేల పనితీరుకు.. పార్టీకి ఆదరణపై సర్వే రిపోర్టులో తేడాలుండడం అధికార పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తోంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎమ్మెల్యేల ‘ప్రోగ్రెస్ రిపోర్టు’ గులాబీశ్రేణుల్లో గుబులు రేపింది. అంచనాలకందని రీతిలో వెల్లడైన సర్వే ఫలితాలను జీర్ణించుకుంటూనే వాటిని పునఃసమీక్షించుకునే పనిలో పడ్డాయి. పనితీరు, పాలనను మదింపు చేస్తూ సర్వే నిర్వహించినట్లు అధినేత కేసీఆర్ చెబుతున్నా.. ఫలితాలు ప్రజాదరణకు అద్దంపట్టేలా లేవని పార్టీవర్గాలు అంతర్గతంగా విశ్లేషించుకుంటున్నాయి. కొందరు శాసనసభ్యులు మాత్రం సర్వే రిపోర్టు ఆధారంగా లోపాలను దిద్దుకునే దిశగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుంటున్నారు. పార్టీ శ్రేణులతో ముఖాముఖి చర్చలు జరపడం ద్వారా ప్రజాభిప్రాయం ఎలా ఉందనే అంశంపై ఆరా తీస్తున్నారు.
పార్టీ పరంగా గ్రాఫ్ బాగానే ఉన్నా.. వ్యక్తిగతంగా పలుకుబడి తగ్గుతుందని సర్వేలో తేలడం ఎమ్మెల్యేలకు కునుకు లేకుండా చేస్తోంది. మరో రెండేళ్లలో ఎన్నికలు సమీపిస్తుండడం.. విపక్ష పార్టీలకు నైతికబలం చేకూరేలా సర్వే ఫలితాలు వెల్లడికావడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన సర్వే ఫలితాలనే వెల్లడించిన సీఎం.. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై కూడా మరో నివేదిక రూపొందించారు. టీఆర్‌ఎస్ సహా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్సార్‌సీపీ, ఇతర పార్టీలకు ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో పసిగట్టారు.
ఈ రహస్య నివేదికను బహిర్గతం చేయకున్నా.. అంతర్గతంగా మాత్రం సర్వే వివరాలను క్లుప్తంగా తెలిపారు. పార్టీ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం... చాలా నియోజకవర్గాల్లో పార్టీకి పాసు మార్కులు పడ్డా.. ఎమ్మెల్యేల గ్రాఫ్ మాత్రం పడిపోవడం గులాబీ బాసును కలవరపరుస్తోంది. జిల్లామంత్రి మహేందర్‌రెడ్డి సొంత ఇలాకాలో పార్టీకి ఎదురుగాలి వీస్తున్నట్లు తేలింది. మహేందర్‌కు ప్రజాదరణ తగ్గిపోవడమేగాక.. ఆ ప్రభావం పార్టీపై కూడా చూపుతుండడం గులాబీ నాయకత్వానికి ఇబ్బందికరంగా మారింది.
ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అనూహ్యంగా బలం పుంజకున్నట్లు సర్వేలో తేలింది. కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై మెజార్టీ ప్రజలు పెదవి విరిచినా.. పార్టీపై విశ్వాసం ఏ మాత్రం చెక్కు చెదరలేదని స్పష్టమైంది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి (కాంగ్రెస్) వ్యక్తిగత ఇమేజ్ బాగానే ఉన్నా.. పార్టీపరంగా కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ప్రజాదరణ తగ్గినట్లు సర్వేలో వెల్లడికాగా.. పార్టీ ఇమేజ్ 52శాతం రావడం, మహేశ్వరంలో టీఆర్‌ఎస్‌కు 60 శాతం, కాంగ్రెస్‌కు 20 శాతం అనుకూలంగా ప్రజాభిప్రాయం వ్యక్తం కావడం గమనార్హం. అయితే, ఇలా పార్టీ, ఎమ్మెల్యేల పనితీరు పట్ల అంచనాలకందని రీతిలో సర్వే ఫలితాలు వెల్లడి కావడంతో దీని వాస్తవికతపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు సైతం ఈ సర్వే శాస్త్రీయతపై తలపట్టుకుంటున్నాయి.
నివేదికల్లో వెల్లడైన మార్కులకు ఒకదానికి ఒకటి పోలిక లేకపోవడం.. పార్టీ విజయానికి ఢోకాలేదు కానీ... ఎమ్మెల్యేలు బాగా పనిచేయడం లేదనే సంకేతాలు ఇవ్వడంపై తర్జనభర్జనలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం పలువురు శాసనసభ్యులు అంతరంగికులతో సర్వేపై మేథోమథనం చేశారు. సర్వే ఫలితాలను విశ్లేషిస్తూ... దిద్దుబాటు చర్యలపై దృష్టి సారించారు. ఒకరిద్దరు మాత్రం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే తమపై ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించడం గమనార్హం.