
ఈ వేతనాలు.. ఎలా సరిపోతాయి? - ఎమ్మెల్యేలు
‘ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి, ఇలాంటి సందర్భంలో ఇంత తక్కువ వేతనాలు ఇస్తే కుటుంబాలు గడిచేదెట్లా?
లక్షల రూపాయల జీతాలు చాలడం లేదట
తమ వేతనాలను మరింత పెంచాలంటూ ఎమ్మెల్యేల డిమాండ్
నెలసరి ఆదాయాన్ని రూ.1.75 లక్షలకు పెంచాల్సిందిగా స్పీకర్‌కు మనవి
బెంగళూరు: ‘ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి, ఇలాంటి సందర్భంలో ఇంత తక్కువ వేతనాలు ఇస్తే కుటుంబాలు గడిచేదెట్లా? ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మా వేతనాలు తక్కువగా ఉన్నాయి, అందుకే తక్షణమే మా వేతనాలను పెంచండి’ ఇది ఏ చిరుద్యోగో తనపై అధికారికి చేసుకున్న విన్నపం కాదు, ఏకంగా లక్షల్లో వేతనాలు తీసుకుంటున్న శాసనసభ్యులు స్పీకర్‌కు చేసిన మనవి. అవును ఇప్పుడు తమకు అందుతున్న వేతనాలు ఎంతమాత్రం సరిపోవడం లేదని, తమ వేతనాలను వెంటనే పెంచాలని శాసనసభ్యులు స్పీకర్‌కు ఓ విన తి పత్రాన్ని అందజేశారు. కర్ణాటకలోని శాసనసభ్యుల వేతనాలను 2015లో 40 శాతం పెంచారు. దీంతో అప్పటి వరకు రూ.95 వేలుగా ఉన్న ఎమ్మెల్యేల వేతనం (అన్ని అలవెన్సులు కలుపుకొని) అమాంతం రూ.1.40 లక్షలకు చేరుకుంది. వేతనాలను పెంచి ఏడాది అవుతున్న నేపథ్యంలో తమ వేతనాలను 25 శాతం మేర పెంచాలంటూ ఎమ్మెల్యేలు స్పీకర్ కె.బి.కోళివాడకు వినతి పత్రాన్ని అందజేశారు. అంటే ప్రస్తుతం ఉన్న రూ.1.40 లక్షల వేతనాన్ని రూ.1.75 లక్షలకు పెంచాలన్నది ఎమ్మెల్యేల డిమాండ్. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో రూ.2.20 లక్షల వేతనాన్ని అందుకుంటుండగా, ఢిల్లీ ఎమ్మెల్యేలు రూ.2.10 లక్షల వేతనాన్ని అందుకుంటున్నారని ఎమ్మెల్యేలు తమ వినతి పత్రంలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తమ వేతనాలను కూడా రూ.1.75 లక్షలకు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలోని ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు ఈ డిమాండ్‌ను గట్టిగా వినిపిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ అంశంపై ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ...‘నియోజకవర్గ పరిధిలోని ప్రజలంతా తమ ఎమ్మెల్యే చాలా ధనవంతుడని భావిస్తుంటారు.
వారికి ఏ ఆర్థిక పరమైన సమస్య వచ్చినా ముందుగా ఎమ్మెల్యే ఇంటి తలుపు తడతాడు. ఇక పెళ్లిళ్లు, అంత్యక్రియల పేరిట ప్రతి నెలా ఇచ్చే మొత్తానికి లెక్కలే ఉండవు. ఇలాంటి ఖర్చులను భరించడం ఎమ్మెల్యేలకు చాలా కష్టం, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఇది తలకు మించిన భారం, అందువల్ల వేతనాలను పెంచితే ఇలాంటి సమస్యల నుండి కాస్తంత బయటపడేందుకు ఆస్కారం ఉంటుంది’ అని అభిప్రాయపడ్డారు.
వేతనాలను పెంచాలని కోరలేదు....
అయితే ఈ అంశంపై అరసికెరె ఎమ్మెల్యే కె.ఎం.శివలింగేగౌడ మాట్లాడుతూ....‘ఇతర రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల జీత భత్యాలు ఎలా ఉన్నాయో తెలియజేయాలంటూ మేం స్పీకర్‌కు లేఖ రాశాము, తద్వారా ఎమ్మెల్యేల జీత, భత్యాల చెల్లింపులో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక ఏ స్థానంలో ఉందో తెలుసుకోవడమే మా ఉద్దేశం అంతేకానీ, జీతాల పెంపును మేము డిమాండ్ చేయలేదు’ అని పేర్కొన్నారు.