ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్పీకర్ తమపై అనర్హత వేటు వేయడాన్ని ప్రశ్నిస్తూ తొమ్మిదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో వేసిన కేసును కొట్టివేయాలని ఆ రాష్ట్ర సభాపతి కోరారు. ఈ మేరకు స్పీకర్ తన అభిప్రాయాన్ని హైకోర్టుకు తెలియజేశారు. సోమవారం నుంచి జరగనున్న రాజ్యసభ సమావేశాల్లో ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన అంశాన్ని లేవనెత్తాలని కాంగ్రెస్ భావిస్తున్ సంగతి తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు తమపై స్పీకర్ వేసిన అనర్హత వేటును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై అనర్హత వేటు వేయడం సబబేనని, వారి కేసును కొట్టివేయాలని హైకోర్టుకు స్పీకర్ నివేదించారు.
ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనను విధించడంపై చర్చించాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, డిప్యూటీ లీడర్ ఆనంద్ శర్మ రాజ్యసభలో నోటీసులు అందించారు. కేంద్రం విధించిన రాష్ట్రపతి పాలనను రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ఈ నెల 27 వరకు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే అదనుగా మిగతా పార్టీల మద్దతుతో కూడగట్టుకుని కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.