ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్‌లోని రాష్ట్ర అసెంబ్లీలో యూనిఫాం సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ 2024 బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సమయంలో రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ‘వందేమాతరం, జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ సమావేశాల రెండో రోజైన మంగళవారం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి యూసీసీ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విపక్ష ఎమ్మెల్యేలు రచ్చ చేశారు. దీనిపై పలు ప్రశ్నలు సంధించారు.
యూనిఫాం సివిల్ కోడ్‌పై చర్చించేందుకు సభను మధ్యాహ్నం 2:00 గంటలకు వాయిదా వేశారు. అంతకుముందు అసెంబ్లీ స్పీకర్ రీతూ ఖండూరి భూషణ్ అధ్యక్షతన జరిగిన వ్యాపార సలహా సమావేశంలో సభలో ప్రశ్నోత్తరాల సమయం ఉండదని నిర్ణయించారు. యూసీసీపై చర్చతోపాటు రాష్ట్ర ఆందోళనకారులకు రిజర్వేషన్లపై సెలెక్ట్ కమిటీ నివేదికను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దీంతో ఆగ్రహం చెందిన ప్రతిపక్ష నేత యశ్‌పాల్ ఆర్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రీతమ్ సింగ్ వ్యాపార సలహా కమిటీకి రాజీనామా చేశారు. యూసీసీపై చర్చకు సమయం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత యశ్‌పాల్ ఆర్య మాట్లాడుతూ తాము యూసీసీ బిల్లును వ్యతిరేకించడం లేదని అన్నారు. అయితే రాజ్యాంగ ప్రక్రియ, నిబంధనల ప్రకారం సభ పనిచేయాలని కోరుకుంటున్నామన్నారు. కాగా అసెంబ్లీ సమావేశాల తొలి రోజైన సోమవారం ఆరుగురు ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేల మృతికి సభలో నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment