
కోల్ కతా: పశ్చిమ బెంగాల్‌లో 2016 నుంచి పనిచేస్తున్న సుమారు 25 వేల మంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ ఈనెల తొలి వారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వేల మంది రోడ్డున పడ్డారు. ఈ తీర్పును ఇప్పటికే ఖండించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. మరోసారి ఉద్యోగాలు కోల్పోయిన వారికి భరోసా ఇచ్చారు. ‘ మీ ఉద్యోగాలకు, మీ జీతాలకు నేను గ్యారంటీ’ అంటూ మద్దతుగా నిలిచారు. నిరసన చేపట్టిన టీచర్లను బుజ్జగించే యత్నం చేశారు. మిడ్నాపోర్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మమతా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
‘ ఎవరు నిజాయితీ పరులు, ఎవరు కాదు అనే విషయంలో మీకు ఆందోళన వద్దు. ఉద్యోగం ఉందా.. జీతాలు సరైన సమయానికి పడుతున్నాయా లేదా అనే విషయం గురించే ఆలోచించండి. టీచర్లు నియామాకాల్లో పారదర్శకత సంబంధించి జాబితాను ప్రభుత్వం. కోర్టులు పరిశీలిస్తాయి,. మీ ఉద్యోగాలకు నేను గ్యారంటీ. తిరిగి స్కూళ్లకు వెళ్లి మీ విధులు నిర్వర్తించండి. ఈ విషయం గురించి గత రాత్రి నుంచి చాలాసార్లే మాట్లాడాను. నేను మీతో ఉన్నా’ అని మమతా బెనర్జీ తెలిపారు. ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయారో వారి తరఫున రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేస్తామని, అప్పటివరకూ ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని మమత విజ్ఞప్తి చేశారు.
కాగా, వెస్ట్ బెంగాల్‌లో 2016కు సంబంధించి ఉపాధ్యాయ నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 2024లో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్(డబ్ల్యూబీఎస్‌ఎస్‌సీ)కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది.
మొత్తం 25,753 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల్లో అవకతవకలను, లోపాలను ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ..మొత్తం నియామకాలు చెల్లవని తీర్పు వెలువరించింది. మళ్లీ నియామకాలు చేపట్టాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌ల ధర్మాసనం ఆదేశించింది.