
జమ్మూ: జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో వక్ఫ్ (సవరణ) బిల్లు-2025(Waqf (Amendment) Bill)పై చర్చ రసాభాసకు దారితీసింది. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ అబ్దుల్ రహీం రాథర్ సోమవారం రెండుసార్లు సభను వాయిదా వేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) ఎమ్మెల్యేలు వక్ఫ్ (సవరణ) బిల్లు-2025పై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ, సభలో గందరగోళం సృష్టించారు. అయితే ఈ అంశం న్యాయస్థానం విచారణలో ఉందని స్పీకర్ సమాధానమిచ్చారు.
12 రోజుల విరామం తర్వాత సోమవారం ఉదయం సభా కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే ఎన్‌సీ శాసనసభ్యులు వక్ఫ్ (సవరణ) బిల్లు-2025పై చర్చ జరపాలని కోరుతూ లేచి నిలుచున్నారు. గతంలో జీఎస్టీ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చినప్పుడు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ(Jammu and Kashmir Assembly)లో చర్చ జరిగిందని, ఇప్పుడు ముస్లిం మెజారిటీ ఉన్న జమ్ము కశ్మీర్‌లో వక్ఫ్ బిల్లుపై చర్చ ఎందుకు జరగకూడదని వారు ప్రశ్నించారు. దీనికి స్పందించిన స్పీకర్ ఈ అంశం దేశంలోని అత్యున్నత న్యాయస్థానం విచారణలో ఉన్నందున చర్చకు అభ్యంతరం తెలిపారు.
ఈ నేపధ్యంలో ఎన్‌సీ ఎమ్మెల్యేలు సభలోని వెల్‌లోకి వచ్చి, నిరసనలు వ్యక్తం చేస్తూ, కాగితాలను చించి, నల్లటి బ్యాడ్జ్‌లను గాలిలో ఊపారు. దీంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి సభా కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు కూడా ఎన్‌సీ ఎమ్మెల్యేలు బీజేపీ వ్యతిరేక నినాదాలు కొనసాగించారు. తరువాత వారు పోడియంవైపు వచ్చేందుకు ప్రయత్నించగా వారినిమార్షల్స్ అడ్డుకున్నారు.

ఇదే సమయంలో బీజేపీ శాసనసభ్యులు దేశ విద్రోహుల ఎజెండా ఇక్కడ నడవదంటూ నినాదాలు చేశారు. నిరసన చేస్తున్న ఎన్‌సీ ఎమ్మెల్యేలను శాంతించేందుకు స్పీకర్ ప్రయత్నిస్తూ, వారిని తిరిగి వారి సీట్లలో కూర్చోమని కోరారు. ఇంతలో.. తాము వక్ఫ్ బిల్లుపై మాత్రమే చర్చను కోరుకుంటున్నామని, ఇది మా మతంపై జరుగుతున్న దాడి అని ఎన్‌సీ ఎమ్మెల్యే నజీర్ గురేజీ వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, విపక్ష శాసనసభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తుండటంతో, స్పీకర్ సభను 20 నిమిషాల పాటు వాయిదా వేశారు.
ఇది కూడా చదవండి: మూఢాచారాలతో ప్రసవానికి యత్నం.. గర్భిణి మృతి