దేశంలో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది. యూసీసీపై బిల్లును తీసుకురావడానికి ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ రోజు (మంగళవారం) రెండవ రోజున అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
పోర్చుగీస్ పాలనా కాలం నుండి గోవాలో యూసీసీ అమలులో ఉంది. యూసీసీ కింద వివాహం, విడాకులు, భరణం, భూమి, ఆస్తి, వారసత్వానికి సంబంధించిన చట్టాలు రాష్ట్రంలోని పౌరులందరికీ వారి మతంతో సంబంధం లేకుండా వర్తిస్తాయి. మంగళవారం సభలో ఈ బిల్లుపై చర్చ జరగనుంది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు చర్చల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కోరారు.
యూసీసీ గురించి ఇటీవల మాట్లాడిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దీనివలన అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. బిల్లుపై సభలో సానుకూలంగా చర్చించాలని ఇతర పార్టీల సభ్యులను అభ్యర్థించారు. ఆదివారం రాష్ట్ర మంత్రివర్గం యూసీసీ ముసాయిదాను ఆమోదించి, ఫిబ్రవరి 6న బిల్లుగా సభలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. నాలుగు సంపుటాలలో 740 పేజీలతో కూడిన ఈ ముసాయిదాను సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి రంజన్ ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ శుక్రవారం ముఖ్యమంత్రికి సమర్పించింది.
2022లో జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో యూసీసీపై చట్టం చేసి, రాష్ట్రంలో దానిని అమలు చేస్తామని బీజేపీ హామీనిచ్చింది. 2000లో ఏర్పడిన ఉత్తరాఖంఢ్‌లో వరుసగా రెండోసారి బీజేపీ అధికారాన్ని దక్కించుకుంది. 2022 మార్చిలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో యూసీసీ అమలుపై హామీనిచ్చింది. కాగా మంగళవారం అసెంబ్లీలో యూసీసీపై చర్చ జరగనున్న సందర్భంగా అవాంఛనీయ పరిస్థితులు చోటు చేసుకుంటే, వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment