ప్రజాప్రతినిధులకు రెట్టింపు వేతనాలు!
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పెంచాలని కేసీఆర్ యోచన
రాజకీయ అవినీతి కట్టడికి ఇదే మార్గమంటున్న సీఎం
హైదరాబాద్: మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వేతనాలను రెట్టింపు చేయాలని సీఎం కేసీఆర్ సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాజకీయ అవినీతిని కట్టడి చేయడానికి, దానికి ఆస్కారమే లేకుండా చేసేందుకు ఇదే విరుగుడు అని దృఢంగా భావిస్తున్నట్టు ఆయన వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇటీవల తరచూ తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తున్న భావనలు, మద్దతుగా వివరిస్తున్న గణాం కాలు ఇదే విషయాన్ని ధ్రువపరుస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు సరిపోవడం లేదని ఆయన భావిస్తున్నారు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రస్తు తం రూ. 95 వేల దాకా నెల వేతనం వస్తోంది. మంత్రులకు రూ. 1.50 లక్షల వేతనం వస్తోంది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఖర్చులు, జీవన ప్రమాణాలు, నియోజకవర్గాల్లో పర్యటించడానికి అవుతున్న వ్యయానికి ప్రభుత్వపరంగా ఇస్తున్న వేతనం సరిపోవడం లేదనే భావనలో కేసీఆర్ ఉన్నారు. కుటుంబ అవసరాలతో పాటు నియోజకవర్గాల్లో కార్యకర్తలకు, ప్రజలకు సేవలందించాలంటే ఇతర సంపాదన కోసమే నేతలు పక్కదారులు పడుతున్నారనే బలమైన భావన ఉంది. ఎన్నికల వ్యయ నిర్వహణ తదితరాల కోసం కాంట్రాక్టులు, పైరవీలు వంటివాటితో అదనపు సంపాదన కోసం ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కుతున్న వైనం ఈ సందర్భంగా చర్చకు వస్తోంది.
నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించడానికి చేయాల్సిన పర్యటనలకు సరిపోయే విధంగా ప్రభుత్వమే వేతనాలను ఇస్తే కొన్ని ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రజా ప్రతినిధులకు ఇప్పుడున్న వేతనాలను రెట్టింపు చేయడం వల్ల ప్రజల సమస్యల పరిష్కారానికి ఏకాగ్రతతో పనిచేయడానికి అవకాశం ఉంటుం దని, రాజకీయ అవీనితిని నియంత్రించడానికి వీలు ఉంటుందనే వాదనను ఆయన తరచూ వినిపిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు వేతనాలు పెంచినా, అవినీతి వల్ల దుర్వినియోగమయ్యే డబ్బు ముందు అది లెక్కలోకి రాదనే వాదన వినిపిస్తున్నారు. ఇది రాష్ట్ర బడ్జెట్‌పై పెద్దగా భారం కాబోదనే విశ్లేషిస్తున్నారు. ఏటా లక్ష కోట్లకు తక్కువగాకుండా రాష్ట్ర బడ్జెట్ ఉండే అవకాశాలున్నాయి. ఐదేళ్ల కాలంలో ఐదు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వేతనాలను రెట్టింపు చేస్తే నెలకు రూ. 2 లక్షల చొప్పున, మంత్రులకైతే రూ. 3 లక్షలు చెల్లించాలి. ఇప్పుడున్న సంఖ్య ప్రకారం 160(ఎమ్మెల్యేలు 120, ఎమ్మెల్సీలు 40) మందికి నెలకు రూ. 3.20 కోట్లు అవుతుంది. ఇది ఏడాదికైతే రూ. 38.40 కోట్లు అవుతుంది. ఎటు చూసినా ఐదేళ్లకు రూ. 200 కోట్లను మించదు. అంటే ఈ ఖర్చు మొత్తం రాష్ట్ర బడ్జెట్‌లో 0.04 శాతం లోపుగానే ఉంటుంది. ఇప్పుడున్న రాజకీయ అవినీతిలో ఇది చాలా తక్కువ అని సీఎం భావిస్తున్నారు. ‘సింగపూర్ పర్యటన సందర్భంగా ఈ విషయంపై చాలా చర్చ జరిగింది.
సింగపూర్‌లో అవినీతి కట్టడికి చాలా కఠినమైన పద్ధతులున్నాయి. అందుకే అక్కడి ప్రజాప్రతినిధులకు ప్రభుత్వపరంగా అందుతున్న వేతనాలు భారీగా ఉన్నాయి. అమెరికా అధ్యక్షునికి అందుతున్న వేతనం కంటే సింగపూర్ ప్రధానికి నాలుగు రెట్లు ఎక్కువ వేతనం ఉంది. ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండటానికి, విస్తృతంగా పర్యటించడానికి వేతనాలు పెంచాల్సిన అవసరముంది’ అని కేసీఆర్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు.