Double Bedroom Housing Scheme
-
ఇందిరమ్మ ఇంటికి ఇక్కట్లు!
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులు ఎలాంటి వాటా చెల్లించాల్సిన అవసరం లేదన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట.. పట్టణ ప్రాంతాల్లో అంతస్తులుగా నిర్మించే పేదల ఇంటికి లబ్ధిదారు వాటా ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వ స్పష్టీకరణ.. కేంద్రం పెట్టే నిబంధనలు పాటిస్తేనే.. పేదల ఇళ్ల కోసం ఢిల్లీ నుంచి ఆర్థిక సాయం అందుతుంది. అంటే.. పట్టణ ప్రాంతాల్లో నిర్మించబోయే గృహ సముదాయాలకు లబ్ధిదారులు వాటా చెల్లించాలి. లేదా ఆ వాటా నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. అప్పుడే కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి నిధులు అందుతాయి. నిరుపేదలకు సొంతింటి వసతి కల్పించే ప్రభుత్వ పథకాల విషయంలో లబ్ధిదారుల వాటా అంశాన్ని కేంద్రం తాజాగా తెరపైకి తెచ్చింది. అయి తే వ్యక్తిగత (ఇండిపెండెంట్) ఇళ్లకు లబ్ధిదారుల వాటా లేకున్నా.. అంతస్తుల వారీగా నిర్మించే గృహ సముదాయాల విషయంలో లబ్ధిదారుల వాటా ఉండాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో చేపట్టే పథకాలకు ఇది వర్తించకున్నా.. కేంద్ర ప్రభుత్వ చేయూతతో అమలు చేసే పథకాల్లో మాత్రం ఈ నిబంధనను అమలు చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ నగరంలో పేదలు వ్యక్తిగత ఇళ్లను నిర్మించుకునేందుకు సొంత జాగా ఉండటం కష్టమే. అందుకే అపార్ట్మెంట్ల తరహాలో ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇస్తోంది. గతంలో వాంబే పథకం, ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్లు, ఇటీవల డబుల్ బెడ్రూం ఇళ్లు అదే తరహాలో నిర్మితమయ్యాయి. కాంగ్రెస్ సర్కారు ఇందిరమ్మ పథకం కింద కూడా ఇళ్ల సముదాయాలనే నిర్మించి ఇవ్వనుంది. ఈ తరహా ఇళ్లకు లబ్ధిదారుల వాటా చూపాలని కేంద్రం అడుగుతోంది. పైసా అవసరం లేదన్న రాష్ట్ర సర్కారు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులు నయాపైసా చెల్లించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. కానీ కేంద్ర నిబంధన ప్రకారం.. యూనిట్ కాస్ట్ కింద రాష్ట్ర ప్రభుత్వం భరించే రూ.5 లక్షలకుతోడు లబ్ధిదారుల వాటాను కూడా చూపించాల్సి వస్తుంది. ఆ మొత్తాన్ని లబ్ధిదారులు చెల్లించడంగానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వమే భరించడంగానీ తప్పదని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇక ఎక్కువ అంతస్తులుగా నిర్మించే ఇళ్లకు వ్యయం ఎక్కువగా ఉంటోంది. హైదరాబాద్‌లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.ఏడు లక్షల నుంచి రూ.8 లక్షల చొప్పున ఖర్చయ్యాయి. ఈ క్రమంలో యూనిట్ కాస్ట్‌కు అదనంగా అయ్యే మొత్తాన్ని లబ్ధిదారు వాటాగా చూపే చాన్స్ ఉండనుంది. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల ప్రణాళిక ఏంటి? తొలుత ఇందిరమ్మ ఇళ్లను సొంత జాగా ఉన్నవారికే మంజూరు చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. అయితే హైదరాబాద్, ఇతర ప్రధాన పట్టణాల్లో సొంత జాగా ఉన్న పేదల సంఖ్య నామమాత్రమే. అలాంటప్పుడు పేదలకు ఇళ్లు ఎలాగనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ దిశగా ప్రభుత్వ ప్రణాళిక ఏమిటనే చర్చ జరుగుతోంది. -
నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ కలెక్టరేట్లో గోషామహల్ నియోజవర్గానికి చెందిన లబ్ధి దారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. కులాలు, మతా లు, ప్రాంతాలు, పార్టీల వంటి తేడా లేకుండా అర్హులైన పేదవారందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.ఎలాంటి భేష జాలకు పోకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల సిన వాటాలు, నిధులు అడిగి తీసుకుంటామన్నా రు. గత ప్రభుత్వం పేదవాడి గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ప్రతిపక్షాలు కాళ్లలో కట్టెలు పెడుతూ అడ్డుకోవాలని ప్రయత్నించినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆపేది లేదని స్పష్టం చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయ లేనిది, తమ ప్రభుత్వం 10 నెలల్లో చేసి చూపిస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఓర్వలేకపోతోంది..మూసీ పరీవాహక ప్రాంత వాసులకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం వారికి ఇండ్లు, ఉద్యోగం, ఉపాధి, కల్పిస్తుంటే బీ ఆర్ఎస్ ఓర్చుకోలేకపోతోందని మంత్రి పొంగులేని విమర్శించారు. ప్రభుత్వం ఏదో తప్పు చేస్తున్నట్లు గా ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు తమ జీవిత కాల మంతా అదే మురికికుప్పలో బతకాలని బీఆర్ఎస్ కోరుకుంటోందా? అని మంత్రి ప్రశ్నించారు. హైద రాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.మూసీ పునరుజ్జీవంపై అనేక అభాండాలు వేస్తున్నా రని, అక్కడున్న పేదవారిని అక్కడే వదిలేస్తారా అని ప్రశ్నించారు. మూసీ రివర్‌ఫ్రంట్ ఏర్పాటు చేసింది మీరు కాదా? అని నిలదీశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజా సింగ్, శ్రీ గణేశ్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, రహమత్ బేగ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలకు నిలయంగా మారిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
-
Hydra: కూల్చివేతలకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: మూసీ పరీవాహకం పరిధిలోని నివాసాల కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. మూసీ ప్రక్షాళనలో భాగంగా నదీగర్భం, బఫర్ జోన్లో గుర్తించిన నివాసాలకు పునరావాసం, పరిహారం అంశాలు తేల్చాకే కట్టడాల తొలగింపునకు ముందడుగు వేయాలని సర్కారు పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు అందడటంతో రెవెన్యూ యంత్రాంగం వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నదీ గర్భంలో సైతం రెడ్ మార్కింగ్ నిలిచిపోగా, నివాసాలు ఖాళీ చేసి డబుల్ బెడ్ రూమ్‌లకు తరలిన కుటుంబాల ఇళ్లను సైతం కొన్నింటిని మాత్రమే కూలీలతో కూల్చివేశారు. మిగతా కూల్చివేత పెండింగ్‌లో పడింది. కొన్ని ఉమ్మడి కుటుంబాలు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించినా..వెళ్లని పరిస్థితి నెలకొంది. ఇళ్ల కూల్చివేతలపై మూసీ పరీవాహకం పరిధిలోని నివాసితుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుండడంతో అధికారులు ముందుకు వెళ్లేందుకు సాహసించడం లేదు. సర్కారు మాత్రం మూసీ ప్రక్షాళన తప్పనిసరి అని పేర్కొంటున్నా...నివాసితులకు పునరావాసం, పరిహారం ప్రధాన సమస్యగా తయారైంది. ఆదిలోనే హంసపాదు మూసీ ప్రక్షాళనకు ఆదిలోనే హంసపాదు ఎదురైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నదీ పరీవాహకం పరిధిలో సర్వే ద్వారా గుర్తించిన నివాసాలపై రెడ్మార్కింగ్ వేసేందుకు అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నం బెడిసి కొట్టినట్లయింది. నివాసితుల నుంచి త్రీవ వ్యతిరేకత ఎదురుకాగా, సగం ఇళ్లకు మాత్రమే రెడ్ మార్క్ వేసి వెనుకకు తగ్గక తప్పలేదు. మరోవైపు నివాసితులకు ప్రతిపక్ష పారీ్టల మద్దతు పెరగడంతో వారు సైతం ఆందోళనలను ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో నదీగర్భంలో రెడ్‌మార్క్ వేసిన గృహాల జోలికి సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వాస్తవంగా పరీవాహక పరిధిలో 12,184 పైగా అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిని రెండుగా వర్గీకరించి నదీగర్భం, బఫర్ జోన్లుగా విభజించారు. నదీగర్భంలో 2,166 నిర్మాణాలు ఉండగా, అందులో 288 భారీ నిర్మాణాలున్నాయి. నదీ సరిహద్దు నుంచి రెండు వైపులా 50 మీటర్లు వరకు గల బఫర్‌జోన్ పరిధిలో 7,851 ఆక్రమణలు, ఇందులో 1032 బడా నిర్మా ణాలున్నట్లు అ«ధికారులు గుర్తించారు. మిగతా పరిధిలో 3004 అక్రమ కట్టడాలున్నట్లు బయటపడింది. పునరావాసంపై అయోమయం మూసీ నదీ గర్భంలోని నివాసితులు పునరావాసం సమస్యగా తయారైంది. అధికార లెక్కల ప్రకారం 2166 డబుల్ బెడ్రూమ్లు అవసరం ఉంటుంది. అందులో హైదరాబాద్ జిల్లా పరిధిలో 1595, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో 239, రంగారెడ్డి జిల్లా పరిధిలో 332 కుటుంబాలను పునరావాసం కల్పించాల్సిన ఉంటుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 14 డబుల్ బెడ్రూమ్ సముదాయాల్లో మొత్తం మీద ఖాళీగా ఉన్న గహాలు 500కు పైగా కూడా లేనట్లు తెలుస్తోంది. నివాసాలు ఖాళీ చేసిన సుమారు 10 శాతం కుటుంబాలకు పునరావాసం కల్పించగలిగారు. సైదాబాద్, హిమాయత్‌నగర్,æ నాంపల్లి మండలాల్లోని వివిధ బస్తీలు, కాలనీలకు చెందిన 193 మందిని మలక్‌పేటలోని పిల్లిగుడిసెలు, జియా గూడ, ప్రతాపసింగారం, జంగంమెట్‌లోని రెండు పడకల గృహసముదాయానికి తరలించారు. మిగతా వారికి పునరావాసంపై ఎలా అన్న ప్రశ్న తలెత్తుతోంది. -
Operation Musi: మూసీ టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: మూసీ పరీవాహకంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆపరేషన్ మూసీకి వ్యతిరేకంగా నిరసన గళం తీవ్రమవుతోంది. మూసీ ప్రక్షాళనలో భాగంగా నివాసాల కూల్చివేత కోసం మార్కింగ్ చేసేందుకు వచ్చిన అధికారుల బృందాలకు రెండోరోజు శుక్రవారం తీవ్ర నిరసన ఎదురైంది. బాధితులు అడుగడుగునా అధికారులను అడ్డుకున్నారు. వాగ్వివాదానికి దిగారు. రోడ్లపై బైటాయించి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినదించారు. ఇళ్లకు మార్కింగ్ వేయకుండా అధికారులను వెనక్కి పంపించారు. నిర్వాసితులకు కాంగ్రెసేతర పక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. చైతన్యపురిలో బాధితుల ఆందోళనలకు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంఘీభావం ప్రకటించారు. కొత్తపేట మారుతినగర్లో ఒక యువకుడు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి దిగాడు. తన భార్య 9 నెలల గర్భిణి అని, తన ఇల్లు ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య.. మూసీ పరీవాహక ప్రాంతం పరిధిలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య సర్వే బృందాలు మార్కింగ్ కొనసాగిస్తున్నాయి. మొదటి విడతగా మూసీ నదీగర్భం (రివర్ బెడ్) పరిధిలోని నిర్మాణాల కూల్చివేత కోసం మార్కింగ్ చేసే ప్రక్రియ గత రెండు రోజులుగా కొనసాగుతోంది. అయితే తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న కుటుంబాలు పునరావాసం కింద డబుల్ బెడ్రూమ్ అందిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నప్పటికి, పక్కా గృహాలు నిరి్మంచుకున్న వారు మాత్రం కూల్చివేతలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆందోళనకు దిగుతున్నారు. దీంతో మార్కింగ్‌కు ఆటంకాలు తప్పడం లేదు. పునరావాసంపై అయోమయం మూసీ నిర్వాసితులకు పునరావాసంపై అయోమయం నెలకొంది. అర్హులైన నిర్వాసితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంటింటి సర్వే నిర్వహించి అర్హులను గుర్తిస్తామని స్పష్టం చేసినప్పటికీ గతంలో జీఐఎస్ సర్వే ద్వారా గుర్తించిన గృహాలపైనే మార్కింగ్ వేస్తూ ఆ కుటుంబాల వివరాలు మాత్రమే సేకరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. వాటిలో పక్కాగృహాలకు మార్కింగ్ వేయకపోవడం, ఆ కుటుంబాల వివరాలు సేకరించడం పోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. అధికారులు సైతం స్పష్టత ఇవ్వలేక పోతున్నారు. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఆరు నెలల క్రితం మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ నదికి రెండువైపులా 2 కి.మీ. పరిధిలో డ్రోన్లను ఉపయోగించి ఎక్కడెక్కడ భవనాలు, ఇతర నిర్మా ణాలున్నాయో గుర్తించింది. వాటిని జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఐఎస్)తో అనుసంధానం చేసింది. ప్రస్తుతం దాని ప్రకారమే రెడ్ మార్కింగ్ వేస్తూ పునరావాసం కోసం వివరాలు సేకరించి ప్రత్యేక యాప్‌లో పొందుపర్చుతున్నారు.అన్ని గృహాలపై ఆపరేషన్ మూసీ ప్రక్షాళనలో భాగంగా మొదటి విడతగా నదీ గర్భంలోని నివాసాలపై ఆపరేషన్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే కూల్చివేత బాధ్యతలను హైడ్రాకు అప్పగించింది. దీంతో నదీగర్భం పరిధిలోని గల ఆర్బీ–ఎక్స్(రివర్ బెడ్) మార్కింగ్ పడిన గృహాలతో పాటు దాని వెంట ఉన్న గృహాలు సైతం కూలి్చవేయక తప్పని పరిస్థితి ఖాయంగా కనిపిస్తోంది.నిర్వాసితుల తరలింపు మూసీ నిర్వాసితులైన 20 కుటుంబాలను డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయానికి తరలించి పునరావాసం కలి్పంచినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శుక్రవారం హిమాయత్‌నగర్ మండలంలోని శంకర్‌నగర్ కాలనీకి చెందిన 6 కుటుంబాలు, వినాయక వీధిలోని మూడు కుటుంబాలను మలక్‌పేట పిల్లిగుడిసెల సముదాయానికి, నాంపల్లిలోని 11 కుటుంబాలను ఆసిఫ్‌నగర్ జియాగూడ సముదాయానికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. వేల సంఖ్యలో నివాసాలు.. మూసీ పరీవాహక పరి«ధి పొడువునా..నదీ గర్భంలో వేల సంఖ్యలో గృహాలు ఉన్నప్పటికీ వందల సంఖ్యలో మాత్రమే డ్రోన్ సర్వేలో గుర్తించినట్లు తెలుస్తోంది. సర్వే ఆధారంగా ప్రభుత్వం నదీ గర్భంలో సుమారు 2166 నివాసాలు మాత్రమే ఉన్నట్లు పేర్కొంటుంది. అందులో సుమారు 288 భారీ కట్టడాలు ఉన్నాయి. వాస్తవానికి ఒక్కో మండలంలోని పలు ప్రాంతాల్లో వందలాది గృహలు నదీ గర్భంలో ఉన్నప్పటికీ జీఐఎస్ డేటా ప్రకారమే గృహాలపై రెడ్ మార్కింగ్ వేస్తూ పునరావాసం కోసం వివరాలు సేకరించడం విస్మయానికి గురిచేస్తోంది. -
మా జోలికి రావొద్దు.. మేం ఖాళీచేయం
జనగామ, సాక్షి: పాలకుర్తి మండలం తొర్రూరు(జే) గ్రామంలో బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అక్రమంగా చొరబడి ఉంటున్న కొన్ని కుటుంబాలను ఖాళీ చేయించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే.. వాళ్లు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. తమను ఖాళీ చేయించొద్దని పాలకుర్తి రెవెన్యూ సిబ్బందిని వాళ్లు వేడుకున్నారు. అయినా అధికారులు బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. దీంతో.. పెట్రోల్ బాటిల్‌తో ఆత్మహత్యాయత్నం చేస్తామని బెదిరింపులకు దిగారు. తమలోనూ అర్హులైన వాళ్లం ఉన్నామని, తక్షణమే గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని కొందరు మహిళలు డిమాండ్ చేస్తున్నారు. అయినా అధికారులు పోలీసుల సాయంతో వాళ్లను అడ్డుకుని ఖాళీ చేయించాలని యత్నిస్తున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ 20 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించినట్లు తెలుస్తోంది. -
‘మూసీ’ నిర్వాసితులకు ‘డబుల్’ ఇళ్లు!
సాక్షి, హైదరాబాద్: మూసీ పరీవాహక ప్రాంతంతోపాటు హైదరాబాద్‌లోని చెరువులు, నాలాల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నివసిస్తున్న అర్హులైన పేదలెవరూ నిరాశ్రయులు కావడానికి వీల్లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. జల వనరుల పరిరక్షణలో పేదలు రోడ్డున పడవద్దని, అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని ఆదేశించారు. నీటి వనరుల పరిరక్షణకు వారు సహకరించేలా ఒప్పించడంతోపాటు అర్హులైన పేదలకు భరోసా కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు అర్హులైన పేదల వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటల పరిరక్షణను బాధ్యతగా చేపట్టాలని.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుపెట్టుకోవాలని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ మంగళవారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మూసీ రివర్ ఫ్రంట్, మెట్రో రైలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఇకపై చెరువులు, నాలాలు ఆక్రమణకు గురికాకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. నగరంలోని అన్ని చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు తేల్చండి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు అన్నింటినీ గుర్తించి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలని.. ఆక్రమణల వివరాలన్నీ సేకరించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. దీనిపై పూర్తి స్థాయి నివేదికను రూపొందించాలని సూచించారు. అదే సమయంలో నిజమైన, అర్హులైన పేదలకు నష్టం జరగకుండా ప్రభుత్వం చేపట్టే చర్యలు ఉండాలని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గం ఏర్పాటు చేయాలని, దీనిపై పూర్తిస్థాయి నివేదికను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. పాతబస్తీ మెట్రో విస్తరణ పనులను వేగంగా చేపట్టాలన్నారు. మెట్రో మార్గాలకు సంబంధించిన భూసేకరణ, ఇతర అడ్డంకులపై ప్రత్యేకంగా దృష్టి సారించి, పరిష్కరించాలని సూచించారు. దసరాలోపు మెట్రో విస్తరణపై పూర్తిస్థాయి డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించాలన్నారు. నేటి నుంచే ‘మూసీ’ పునరావాస ప్రక్రియ! మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ రివర్ బెడ్ (నదీ గర్భం), బఫర్ జోన్లలో నివాసమున్న వారికి పునరావాసం కల్పించేందుకు వీటిని ఉపయోగిస్తారు. మూసీ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన నేపథ్యంలో.. పునరావాస ప్రక్రియను బుధవారం ప్రారంభించనున్నారు. 10,200 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. బుధవారం నుంచి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు.. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారో వివరించనున్నారు. తొలుత రివర్ బెడ్లోని 1,600 ఇళ్లను తొలగిస్తారు. వారిలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తారు. ఇక మూసీ బఫర్‌జోన్‌లో నివసించే వ్యక్తులు, నిర్మాణాలకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే సదరు నిర్మాణ ఖర్చుతోపాటు పట్టా ఉన్న భూమి విలువను పరిహారంగా చెల్లిస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇంటిని కూడా కేటాయిస్తారు. -
మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు.. ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టులో నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తూ ఈ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.కాగా మూసీ నదిని ప్రక్షాళన చేసి.. దానిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మూసీ పరిసరాల్లో నివసిస్తున్న కుటుంబాలను తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16 వేల డబుల్ బెడ్ రూం గృహాలను ఇవ్వనుంది ప్రభుత్వం.చదవండి: ఓటుకు నోటు కేసు.. విచారణకు రావాలని సీఎం రేవంత్‌కు కోర్టు ఆదేశంమూసీలో మొత్తం 10,200 మందిని నిర్వాసితులుగా ప్రభుత్వం గుర్తించింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మూడు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు రేపు ఇంటింటికి వెళ్లి అక్కడున్న ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించారో తెలియజేయనున్నారు.మరోవైపు రివర్ బెడ్లో ఆక్రమణలో ఉన్న 1600 ఇళ్లను తొలగించి.. అక్కడ ఉన్న వారిని తరలించనుంది ప్రభుత్వం. మూసీ బఫర్ జోన్లో నివసించే వ్యక్తులు, నిర్మాణాలకు RFCTLARR చట్టం ప్రకారం పరిహారం చెల్లించనుంది. నిర్మాణ ఖర్చుతో పాటు, పట్టా ఉంటే భూమి విలువను పరిహారంగా చెల్లించనుంది. వీటితోపాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కూడా కేటాయించనుంది. -
‘డబుల్’ ఇళ్లకు కావాల్సింది రూ. 4వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలంటే...దాదాపు రూ. 4 వేల కోట్లు కావాలి. అయితే కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే నిధులు రూ.400 కోట్లు మాత్రమే. ఇటీవల రాష్టŠట్ర ప్రభుత్వం డబుల్ ఇళ్లను పూర్తిచేసి లబి్ధదారులకు వీలైనంత త్వరలో అందజేస్తామని శాసనసభలో ప్రకటించింది. కానీ బడ్జెట్లో ఇళ్ల నిర్మాణానికి కేటాయించిన నిధులు ఇందిరమ్మ పథకానికే సరిపోయే పరిస్థితి. దీంతో డబుల్ బెడ్రూం ఇళ్లకు నిధులు ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి. లబ్ధిదారుల జాబితా అందజేసినా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన డబుల్ బెడ్రూం పథకంలో కొన్ని ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉండిపోయాయి. గత సర్కారు 2.90 లక్షల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించి టెండర్లు పిలిచింది. 2.28 లక్షల ఇళ్లకు కాంట్రాక్టర్లతో ఒప్పందాలు జరిగాయి. అందులో 1.53 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మిగతావి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇంకా ఒప్పందం జరగని ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టాల్సి ఉంది.డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రూ.2 వేల కోట్లు మంజూరు చేసింది. అందులో తొలి విడతగా అప్పట్లోనే రూ.1,100 కోట్లు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం..లబ్దిదారుల జాబితాను అందించాకే రెండో విడత నిధులు విడుదలవుతాయి. కానీ అప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం లబి్ధదారుల ఎంపిక చేపట్టలేదు. దీంతో నిధులు ఆగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా సరిపోక ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది. ఆ ఇళ్లను పూర్తి చేస్తామన్న కాంగ్రెస్ సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చింది. దీనికోసం కేంద్రం నుంచి నిధుల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. 69వేల మంది లబ్ధిదారుల జాబితాను కేంద్రానికి అందించగా.. మలి విడతగా రూ.500 కోట్లు ఇటీవల విడుదల అయ్యాయి. దీంతో ఇప్పటివరకు రూ.1,600 కోట్లు అందగా, మరో రూ.400 కోట్లు మాత్రమే రావాల్సి ఉంది. కానీ డబుల్ ఇళ్లన్నీ పూర్తి చేయాలంటే రూ.4 వేల కోట్లు కావాలని లెక్కలు వేశారు. ఈ నిధుల సర్దుబాటు ఎలాగన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్నే హడ్కోవంటి సంస్థల నుంచి రుణం పొంది ప్రారంభించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రూ.3 వేల కోట్ల రుణం మంజూరైంది. దీనికితోడు బడ్జెట్లో రూ.ఏడున్నరవేల కోట్లు ఇళ్లకు కేటాయించారు. ఇవన్నీ కూడా ఇందిరమ్మ పథకానికే సరిపోవని.. డబుల్ ఇళ్ల పూర్తి ఎలాగన్నది తేలడం లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
గూడు రాక.. గోస తీరక..
సాక్షి, పెద్దపల్లి: పేద, మధ్యతరగతి ప్రజలను ఊరిస్తున్న సొంతింటి కల తీరడం లేదు. సొంతిల్లు లేక అద్దె ఇంట్లో ఉంటూ సామాన్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా అమలు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు నెలలు గడుస్తున్నా హక్కుపత్రాలు అందడంలేదు. దీంతో వారు ప్రత్యక్ష ఆందో ళనకు దిగుతున్నారు. కళ్లెదుటే ఇళ్లు కనిపిస్తున్నా.. వాటిని కేటాయించకుండా తాత్సారం చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.డబుల్బెడ్రూమ్ ఇళ్ల వద్ద మౌలిక వసతుల కల్పన పూర్తికాలేదని, అందుకే కేటాయించడం లేదని అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పిన అధికారులు.. ఇంకా కాలయాపన చేయడంతో లబ్ధిదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే తమకు ఇళ్ల కేటాయించాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వాటిని పంపిణీ చేస్తారా? లేక రద్దు చేస్తారా? అని పేద కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.డబుల్ ఇళ్లకు 2,17,925 దరఖాస్తులు..● ఇళ్లులేని, స్థలం ఉన్నా నిర్మించుకునే స్థోమతలేనివారి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం తీసుకొచ్చింది.● జిల్లాలోని ప్రతీ నియోజకవర్గానికి తొలివిడతలో మూడు వేల ఇళ్ల చొప్పున కేటాయిస్తూ అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది.● ఈక్రమంలో జిల్లాకు 8,475 ఇళ్లు కేటాయించగా, 33,816 మంది దరఖాస్తు చేసుకున్నారు.● వీటిపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికార యంత్రాంగం.. అందులో 25,040 మందిని అర్హులుగా గుర్తించింది.● జిల్లాలోని ఒక్క మంథని నియోజకవర్గంలోని 454 మంది లబ్ధిదారులకే ఇళ్ల మంజూరుపత్రాలు అందజేసింది.● పెద్దపల్లి, రామగుండంలో ఐదుగురు చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు.● ఈక్రమంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.● కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసి, దానిస్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చింది.● దీనికింద కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారికి రూ.5లక్షల సాయం చేస్తామని హామీ ఇచ్చింది.● ఇందులో భాగంగా ఆరు రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి ‘అభయహస్తం’ పేరిట దరఖాస్తులు స్వీకరించింది.● జిల్లావ్యాప్తంగా 2,17,925 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో మెజార్టీ కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.● అయితే, ఇళ్ల హక్కు పత్రాలు ఎప్పుడు కేటాయిస్తారో, తాము ఆ ఇళ్లలోకి ఎప్పుడు వెళ్తామోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.ఇవి పెద్దపల్లి సమీప కూనారం రోడ్డు, చందపల్లి ప్రాంతాల్లో నిర్మించిన 484 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు. 2023 మార్చి 15న అధికా రులు డ్రా పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేశారు. నెలలు గడుస్తున్నా నివాసయోగ్యానికి అవసరమైన ప్రొసీడింగ్ కాపీలు ఇంతవరకు లబ్ధిదారులకు ఇవ్వలేదు.హక్కుపత్రాలు ఇవ్వాలని లబ్ధిదారులు ఇటీవల కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో తామేమీ చేయలేమని అప్పటి కలెక్టర్ వారికి నచ్చజెప్పి వెనక్కి పంపించివేశారు. కోడ్ ఎత్తివేశాక పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఇటీవల డబుల్బెడ్రూమ్ ఇళ్లు పరిశీలించారు. లబ్ధిదారులకు ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న వీరు డబుల్బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు. గోదావరిఖని ఫైవింక్లయిన్ ఏరియా, మాల్కాపూర్ శివారులో నిర్మించిన 660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రిజర్వేషన్ ప్రాతిపదికన గత ప్రభుత్వం 2023 మార్చి 16న డ్రా పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఎవరికీ హక్కుపత్రాలు ఇవ్వలేదు. దీంతో సోమవారం వారు ప్రజావాణికి హాజరై కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. -
‘గృహలక్ష్మి’ దరఖాస్తులు పరిశీలించొద్దు!
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వం చివరలో ప్రారంభించిన గృహలక్ష్మి పథకం కోసం సేకరించిన 15 లక్షల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని పూర్తిగా పక్కన పెట్టి కొత్తగా దరఖాస్తులు తీసుకోవాలని భావిస్తోంది. మంజూరు చేసే వేళ ముంచుకొచ్చిన ఎన్నికలు గత ప్రభుత్వం తొలుత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. భారీ యూనిట్ కాస్ట్‌తో, దేశంలో ఎక్కడా లేనట్టుగా ఉచితంగా రెండు పడక గదులతో కూడిన ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. కానీ వాటి యూనిట్ కాస్ట్ సరిపోవటం లేదంటూ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటం, సాంకేతికంగా కొన్ని లోపాలు చూపి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నిధులు నిలిపేయటం, కొన్ని అంతర్గత లోపాలు.. వెరసి ఆ పథకం అంత వేగంగా ముందుకు సాగలేదు. దీంతో ఏడాది క్రితం.. దాని స్థానంలో గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. సొంత జాగా ఉండి ఇల్లు లేని పేదలకు రూ.3 లక్షలను అందించి వారే ఇళ్లను నిర్మించుకునేలా దీన్ని రూపొందించారు. ఇంచుమించు ఇందిరమ్మ పథకం తరహాలోనే డిజైన్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుని దరఖాస్తులు ఆహ్వానించింది. 15 లక్షల దరఖాస్తులు వచ్చి పడ్డాయి. వాటిల్లో 12 లక్షలు అర్హమైనవిగా గుర్తించారు. వాటిల్లో నుంచి 4 లక్షల దరఖాస్తులు ఎంపిక చేసే వేళ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. చివరి తేదీ రాత్రి వరకు దాదాపు2 లక్షల దరఖాస్తులకు సంబంధించి జాబితాను సిద్ధం చేశారు. వారికి నిధులు ఇచ్చేందుకు వీలుగా ఎన్నికల సంఘం నుంచి అనుమతి కూడా వచ్చింది. కానీ, అప్పటికే ప్రచారం తారస్థాయికి చేరుకోవటంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తమ దరఖాస్తులను రిజెక్టు చేస్తుందేమోనన్న భయంతో కొందరు దరఖాస్తుదారులు కూడా అధికారులపై ఒత్తిడి చేయకుండా ఎన్నికలయ్యే వరకు వేచిచూసే ధోరణి అవలంబించాలని నిర్ణయించారు. వారు అనుకున్నట్టే ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఇందిరమ్మ ఇళ్ల కోసం తమ దరఖాస్తులను పరిశీలిస్తుందని వారు ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ, వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ఆ దరఖాస్తులను పరిశీలించవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ సభల్లో కొత్త దరఖాస్తులు.. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించేవారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిని అవలంబించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాత ప్రభుత్వం సేకరించిన దరఖాస్తులను పక్కన పెట్టి కొత్తగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిసింది. ఇటీవల హైకోర్టులో గిరిజనప్రాంతాల్లో దరఖాస్తుల స్వీకరణ అంశంపై ఓ కేసు విచారణకు వచ్చింది. నిబంధనల ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల ద్వారా జరగాల్సి ఉంటుంది. గిరిజనులకు దక్కాల్సిన లబ్ధి గిరిజనేతరులు తన్నుకుపోతున్నారన్న ఉద్దేశంతో వారికి రక్షణగా ఈ నిబంధన ఏర్పాటు చేశారు. గృహలక్ష్మి పథకంలో దరఖాస్తుల స్వీకరణలో ఈ నిబంధనల పాటించలేదన్నదని ఫిర్యాదు. నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తుల స్వీకరణ జరిగిందన్న వాదనను ఇప్పుడు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. సరిగ్గా ఎన్నికల వేళ దరఖాస్తుల పరిశీలన జరిగిన నేపథ్యంలో మొత్తంగా ఆ దరఖాస్తులను పక్కనపెట్టనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
వచ్చేవి గృహలక్ష్మి ఇళ్లా! లేక.. ఇందిరమ్మ ఇళ్లా!
దురాజ్‌పల్లి (సూర్యాపేట): గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం దరఖాస్తుదారుల్లో సందిగ్ధ్దత నెలకొంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వం తీసుకున్న దరఖాస్తులు ఆమోదిస్తారా? ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మళ్లీ స్వీకరిస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్చి ఉంది. ఒకవేళ కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తే గతంలో గృహలక్ష్మి పథకం కింద ఎంపికై ఇళ్ల మంజూరు పత్రాలు అందించిన చోట ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తే ఇప్పటి వరకు పడిన శ్రమ, పెట్టిన ఖర్చు వృథాయేనా? అనే గందరగోళ పరిస్థితి నెలకొంది. డబుల్ బెడ్రూం సక్సెస్ కాకపోవడంతో.. గృహలక్ష్మి పథకానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ప్రవేశపెట్టింది. జిల్లాలో అనుకున్న స్థాయిలో ఆ పథకం సక్సెస్ కాలేదు. లబ్ధిదారులు ఎక్కువగా ఉండటం.. నిర్మించిన ఇళ్లు తక్కువ కావడంతో సర్వత్రా ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద సొంతస్థలం ఉన్న వారికి గృహ నిర్మాణం కోసం మూడు విడతల్లో రూ.3లక్షల నగదు ఇస్తామని చెప్పి దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలో మొత్తం 58,564 దరఖాస్తులు రాగా క్షేత్ర స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు పరిశీలించారు. వీటిలో 34,849 మందిని అర్హులుగా తేల్చి ఆన్లైన్లో నమోదు చేశారు. ప్రతి నియోజకవర్గానికి 3వేల యూనిట్ల చొప్పున జిల్లాలోని నాలుగు నియోకవర్గాల్లో 12వేల యూనిట్లకు మంజూరు పత్రాలను అధికారులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. దీంతో వారంతా సంతోషంలో మునిగిపోయారు. మిగతా ఆశావహులు సైతం వారికి అందుతాయని భావించారు. ఇంతలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడం చకచకా జరిగిపోయాయి. తమ హామీల్లో భాగంగా గృహలక్ష్మి స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో గృహలక్ష్మికి దరఖాస్తు చేసుకున్న వారిలో ఆందోళన నెలకొంది. కొత్త ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకం అమలు చేయాలని యోచిస్తోంది. దీంట్లో భాగంగా ఇంటి నిర్మాణానికి ఇప్పటికే రూ.5 లక్షలు ప్రకటించింది. సాయం పెంపుపై అంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నా.. కొత్త పథకం ఎప్పుడు ప్రారంభిస్తారో, విధివిధానాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. దీనిపై కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లాలో సుమారు 70 వేలకు పైగా కుటుంబాలు సొంతిల్లు లేక అద్దె ఇళ్లలో నివసిస్తున్నట్టు సమాచారం. -
మళ్లీ ఇందిరమ్మ ఇళ్లు
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు సిద్ధమవుతున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, తిరిగి గృహనిర్మాణ శాఖను పునరుద్ధరించబోతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదల కోసం లక్షల సంఖ్యలో ఇళ్లను నిర్మించారు. ఆ సమయంలో రాష్ట్ర గృహ నిర్మాణశాఖ దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. అవినీతి ఆరోపణలు చేస్తూ సీఐడీతో దర్యా ప్తు చేయించింది. చివరకు గృహ నిర్మాణ శాఖే లేకుండా చేసింది. రోడ్లు భవనాల శాఖలో ఓ విభాగంగా మార్చేసింది. అందులోని సిబ్బంది వివిధ శాఖలకు బదిలీ అయ్యారు. కాగా త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి గృహ నిర్మాణాలకు సంబంధించి సమీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం అందటంతో, ఆగమేఘాల మీద అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ శాఖను పునరుద్ధరించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది. వైఎస్ హయాంలో 14 లక్షల ఇళ్లు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తెలంగాణ పరిధిలో ఏకంగా 14 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మితమయ్యాయి. 2004–2009 మధ్యలో ఈ ఇళ్లు రూపొందగా, ఆ తర్వాత 2014 వరకు కేవలం నాలుగున్నర లక్షలు మాత్రమే నిర్మితమయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత, ఇందిరమ్మ తరహా ఇళ్ల నిర్మాణాన్ని నిలిపేసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. అయితే తొమ్మిదేళ్లలో లక్షన్నర ఇళ్లను కూడా పూర్తి చేయలేకపోయింది. తర్వాత గృహలక్ష్మి పేరు తో ఇందిరమ్మ తరహా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినా, దరఖాస్తులు స్వీకరించే సమయానికి ఎన్నికలు రావటంతో అది కాస్తా ఆగిపోయింది. ఇప్పు డు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కానుంది. గృహలక్ష్మి పథకంలో లబ్ధిదారులకు రూ.3 లక్షలు చొప్పు న ఇచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటి యూనిట్ కాస్ట్‌ను రూ.5 లక్షలుగా ఖరారు చేసింది. అదనంగా సిబ్బంది కావాల్సిందేనా..? గృహనిర్మాణ శాఖలో 1983–87 మధ్య సిబ్బంది నియామకం జరిగింది. ఆ తర్వాత కొన్ని బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ మాత్రమే జరిగింది. కాలక్రమంలో చాలామంది పదవీ విరమణ చేశారు. అయితే రిటైర్మెంట్ వయసు పెంపు కారణంగా మొత్తం మీద 500 మంది వరకు ఉండగా, శాఖను రద్దు చేయటంతో 450 మంది వివిధ శాఖలకు బదిలీ అయ్యారు. దీంతో కేవలం 50 మంది మాత్రమే ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్లను కొనసాగించాలంటే పాత సిబ్బంది తిరిగి రావటమే కాకుండా, అదనపు సిబ్బంది కావాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిటైర్డ్ అధికారుల సేవలను వినియోగించుకుంటే మంచిదన్న సూచనలు అందుతున్నాయి. ఆ దరఖాస్తులేం చేస్తారు? గత ప్రభుత్వం చివరలో ప్రారంభించిన గృహలక్ష్మి పథకం కోసం 14 లక్షల దరఖాస్తులు అందాయి. వాటిల్లో అర్హమైనవి 11 లక్షల వరకు ఉన్నట్టు గుర్తించారు. ఈలోపు ఎన్నికల నోటిఫికేషన్ రావడం, బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో ఇప్పుడా పథకమే లేకుండా పోనుంది. దీంతో ఆ దరఖాస్తులను ఏం చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. -
రూ. లక్ష పెంచితేనే ‘డబుల్ బెడ్రూం’ ఇళ్ల పనులు!
సాక్షి, హైదరాబాద్: నిర్వహణ లోపాలతో ఇప్పటికే అస్తవ్యస్తంగా మారిన రెండు పడక గదుల ఇళ్ల విషయంలో కొత్త సమస్య తలెత్తింది. ప్రాజెక్టు యూనిట్ కాస్ట్‌ను భారీగా పెంచాలని కాంట్రాక్టర్లు గృహనిర్మాణ సంస్థకు తేల్చి చెప్పారు. ఒక్కో ఇంటిపై రూ.లక్ష చొప్పున యూనిట్ కాస్ట్‌ను సవరించాలని, లేని పక్షంలో పనులు కొనసాగించలేమని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇప్పుడు అధికారులు ఇదే విషయాన్ని కొత్త ప్రభుత్వం ముందు ప్రతిపాదించనున్నారు. అసలే ఖజానాకు తీవ్ర భారంగా మారిన ఈ ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టి గృహలక్ష్మి పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. పనులు ప్రారంభించిన ఇళ్లను మాత్రం పూర్తి చేసి, టెండర్లు పిలవాల్సిన వాటిని ప్రారంభించకపోవటమే మంచిదన్న అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. ఇప్పుడు కాంట్రాక్టర్ల కొత్త డిమాండ్‌తో, అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయటం కొత్త సవాల్‌గా మారబోతోంది. ఎందుకు పెంచుతున్నారంటే.. ఇల్లు లేని పేదలకు ఏకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఉచితంగా అందించాలని అప్పట్లో బీఆర్ఎస్ సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కావటంతో ఒక్కో ఇంటికి ప్రాంతాల వారీగా రూ.5.10 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. కానీ, ఆ మొత్తం కూడా సరిపోదని, యూనిట్ కాస్ట్‌ను పెంచాలని పథకాన్ని ప్రారంభించిన కొత్తలోనే కాంట్రాక్టర్లు కోరారు. దీంతో చాలా ప్రాంతాల్లో టెండర్లకు స్పందన కూడా లేకుండా పోయింది. కాంట్రాక్టర్లతో పలువురు మంత్రులు స్వయంగా భేటీ అవుతూ, ఇతర ప్రాజెక్టుల్లో పనులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొనటంతో కొన్ని ప్రాంతాల్లో టెండర్లకు స్పందన వచ్చింది. ఆ క్రమంలో పనులు మొదలైనా, ఆ యూనిట్ కాస్ట్‌తో ప్రాజెక్టులు పూర్తి చేయటం కష్టమంటూ చాలా మంది పనులను నెమ్మదిగా చేస్తూ వచ్చారు. తాజాగా ఇప్పుడు యూనిట్ కాస్ట్‌ను పెంచకుంటే పనులు చేయలేమని, ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందని, రూ.లక్ష మేర పెంచాలంటూ ఇటీవల వారు ప్రతిపాదించినట్టు తెలిసింది. ఈ ఇళ్లను పూర్తి చేసేందుకు రూ.4500 కోట్లు అవసరం రాష్ట్రవ్యాప్తంగా 2.93 లక్షల ఇళ్లను నిర్మించేందుకు పరిపాలన అనుమతులు ఇవ్వగా, 2.29 లక్షల ఇళ్లకు టెండర్లు పూర్తయ్యాయి. వీటిల్లో ఇప్పటి వరకు 1.55 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. ఇంకా 74 వేల ఇళ్లు పూర్తి చేయాల్సి ఉంది. వీటిల్లో 45 వేలు తుది దశలో ఉన్నాయి. వీటిని కచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో యూనిట్ కాస్ట్ పెంచాల్సిందే. ఈ మేరకు ఈ ఇళ్లను పూర్తి చేసేందుకు రూ.4500 కోట్లు అవసరం. కాగా, లబ్ధిదారుల జాబితా రూపొందించకుండానే పనులు జరుపుతున్న తీరును తప్పుపడుతూ కేంద్రప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాసయోజన నిధులు ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో నిధుల కోసం తీవ్ర ఇబ్బందులు ఉన్న తరుణంలో, అదనంగా భారం పడటం పథకానికి శరాఘాతంగా మారనుంది. -
కేసీఆర్‌కు దమ్ముంటే కొడంగల్‌లో పోటీ చేయాలి
కొడంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ముంటే కొడంగల్‌లో పోటీ చేయాలని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. దసరా పండుగను పురస్కరించుకుని సోమవారం ఆయన కొడంగల్‌కు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి నివాసానికి వెళ్లి దేశ్‌ముఖ్ కుటుంబ సభ్యులకు జమ్మి పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఆపై తన నివాసానికి చేరుకొని అభిమానులు, పార్టీ శ్రేణులతో ముచ్చటించారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి తన హయాంలోనే జరిగిందన్నారు. నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన అన్ని ప్రభుత్వ భవనాలను తానే మంజూరు చేయించినట్లు చెప్పారు. 2018లో పోలీసులను అడ్డు పెట్టుకొని తనను ఓడించారని, ఇప్పుడు కూడా పోలీసుల సాయంతో దొంగ దెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కొడంగల్‌కు కేసీఆర్ అన్యాయం అన్ని విషయాల్లోనూ సీఎం కేసీఆర్ కొడంగల్ నియోజకవర్గానికి అన్యాయం చేశారని రేవంత్ ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గానికి సాగునీరు తెచ్చి రైతుల కాళ్లు కడుతానని కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని రేవంత్ ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూపంపిణీ ఊసేలేదని మండిపడ్డారు. కొడంగల్‌ను కేసీఆర్ రెండు ముక్కలు చేసి పాలనాపరమైన ఇబ్బందులు సృష్టించారని ఆరోపించారు. ఉద్యోగులంతా ఏకమై కేసీఆర్‌ను ఇంటికి పంపాలని రేవంత్ పిలుపునిచ్చారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఆసరా పింఛన్లు నెలకు రూ.4 వేలు ఇస్తామని, కేసీఆర్ చేసిన రుణమాఫీ బ్యాంకుల మిత్తీకి కూడా సరిపోలేదన్నారు. కార్యక్రమంలో నియోజక వర్గంలోని 8 మండలాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
డబుల్ కల నెరవేరేది ఎప్పుడు..?
మంచిర్యాల: పేదల సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించింది. నిర్మాణాలు పూర్తి కావడంతో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. గత మార్చి 17న కలెక్టర్ బదావత్ సంతోష్ ఆధ్వర్యంలో లక్కీడ్రా పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఇళ్లు అప్పగించలేదు. నేడో రేపో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ఇప్పట్లో పేదల డబుల్ కల నెరవేరే అవకాశం కనిపించడం లేదు. షెడ్యూల్ వస్తే మరింత జాప్యం అనర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు డ్రాలో వచ్చిందని మున్సిపల్ అధికారులకు, రెవె న్యూ అధికారులకు, కలెక్టర్‌కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 85 ఫిర్యాదులను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వారి సిబ్బందితో మరోసారి సర్వే చేసి, 50 మందిని అనర్హులుగా గుర్తించారు. వారికి మినహా మిగతా వారికి డబుల్ బెడ్రూంలను ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయితే మరింత ఆలస్యంగా ఇళ్లు కేటాయించే అవకాశం ఉంది. పునఃపరిశీలన పేరుతో అసలైన లబ్ధిదారులకు ఇప్పటికీ ఇళ్లు అప్పగించడం లేదు. రెండు నెలలుగా కాలయాపన చేస్తున్నారు. మున్సిపల్, రెవె న్యూ అధికారులు ఉమ్మడిగా సర్వే చేస్తున్నా అనర్హులను గుర్తించడంలో ఇంకా జాప్యం జరుగుతోంది. ఎన్నికల కోడ్ రాకముందే డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 360 నిర్మాణాలు పూర్తి.. జిల్లా కేంద్రంలో 650 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టగా, అందులో 360 నిర్మాణ పనులు పూర్తయ్యాయి. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చిన 30 కుటుంబాలకు గతంలోనే 30 ఇళ్లను మంజూరు చేశారు. మిగిలిన 330 ఇళ్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. 5 వేల దరఖాస్తులు.. ఇక 330 ఇళ్ల కోసం 5 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు మొదటగా 2,958 మందిని అర్హులుగా గుర్తించారు. మండల రెవెన్యూ అధికారులతోపాటు, జిల్లాస్థాయి అధికారులు రెండుసార్లు సర్వే చేసి, అర్హులు 1,616 మంది ఉన్నట్లుగా గుర్తించారు. వారికి టోకెన్లు అందించారు. మార్చి 17న జిల్లా కలెక్టర్ అధ్యక్షతన టోకెన్లు తీసుకున్న వారి సమక్షంలోనే లక్కీడ్రా పద్ధతిలో 330 మందిని ఎంపిక చేశారు. స్థలం ఉన్నవారికి, ఒకే ఇంట్లో ఇద్దరికి సైతం డబుల్ బెడ్రూం ఇళ్లు లక్కీడ్రాలో పొందారని ఆధారాలతో ఫిర్యాదు చేయగా, 50 మంది వరకు స్వచ్ఛందంగా డబుల్ బెడ్రూం ఇళ్లను వదులుకున్నారు. కానీ అన్ని అర్హతలు ఉన్నవారికి మాత్రం ఇప్పటి వరకు ఇళ్లను అప్పగించలేదు. -
ఇలాంటి ఇళ్లు చూపిస్తే రాజీనామా చేస్తా
రామచంద్రాపురం (పటాన్చెరు): సీఎం కేసీఆర్ నిరుపేదల కోసం నిర్మించిన ఇళ్లు దేశంలో ఎక్కడైనా కట్టినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సవాల్ విసిరారు. సోమవారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో మూడో విడత డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ రాజకీయ చరిత్రలో పేదల కోసం ఇలాంటి ఆధునిక ఇళ్లు కట్టించిన ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కిందన్నారు. పేదల సొంతింటి కలను నిజం చేయాలన్న లక్ష్యంతో రూ.కోట్ల వ్యయంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించారని తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను స్వయంగా తానే తీసుకెళ్లి ప్రభుత్వం నిర్మిస్తున్న రెండు పడకల ఇళ్లను చూపించానని తలసాని చెప్పారు. కానీ ఈ నిర్మాణాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలియదన్నట్లు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారని, ఆయన వివేకానికే వదిలేశానని వ్యాఖ్యానించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంతింటి కల నిజం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, దానం నరేందర్, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. -
'ఇళ్ల స్థలాలు రాలేదని..' సెల్ టవరెక్కి ఇద్దరు వ్యక్తులు హల్చల్!
భద్రాద్రి: ధన్‌బాద్ పంచాయతీ రెండో వార్డు సభ్యుడు, మాయాబజార్‌కు చెందిన పిచ్చేటి శివకుమార్, దనసరి బన్ను తమకు ఇళ్ల స్థలాలు రాలేదని సోమవారం 5 ఇంక్లైన్లో సెల్ టవరెక్కి నిరసన తెలిపారు. మాయాబజార్ ప్రాంతంలో ఇళ్లు కోల్పోయే వారికి ఈ నెల 3న సింగరేణి ప్రధాన కార్యాలయం సమీపంలో సుమారు 347 మందికి 100 గజాల చొప్పున కొత్తగూడెం ఎమ్మెల్యే చేతుల మీదుగా స్థలాలు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ జాబితాలో పేర్లు లేకపోవడంతో శివకుమార్, బన్ను మనస్తాపం చెంది సెల్‌టవర్ ఎక్కా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తల్లి దండ్రుల కాలం నుంచి సుమారు 60 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని తెలిపారు. వీకే–7ఓసీ విస్తరణలో భాగంగా ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయించి, వేరే చోట స్థలాలు ఇస్తామని సింగరేణి, రెవెన్యూ, పంచాయతీ అధికారులు చెప్పారని తెలిపారు. సర్వే చేసిన జాబితాలో ఉన్న పేర్లు, పంపిణీ జాబితాలో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు పేర్లు చేర్చారని, తమకు మాత్రం అన్యాయం చేశారని వాపోయారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఝెర్రా కామేష్ అక్కడికి చేరుకుని బాధితులకు నచ్చజెప్పారు. దీంతో బాధితులు టవర్ దిగారు. అనంతరం పొంగులేటి ఫోన్ ద్వారా సమస్యను ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. కామేష్ మాట్లాడుతూ వీకే–7ఓసీ విస్తరణ బాధితులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికార పార్టీ నాయకులు డబ్బులు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. జాబితాలో కొందరు బాధితుల పేర్లు లేకుండా చేశారని, యూనియన్ నాయకులు, సొంత ఇళ్లు ఉన్నవారి పేర్లు అక్రమంగా చేర్చారని పేర్కొన్నారు. నేడు జరిగే పట్టాల పంపిణీని నిలిపివేసి, మళ్లీ సమగ్ర సర్వే చేయాలని డిమాండ్ చేశారు. సెల్ టవరెక్కిన మరో నిర్వాసితుడు ఇంటి స్థలం మంజూరు కాలేదని సోమవారం రాత్రి ఎస్ఆర్టీ కాలనీకి చెందిన యువకుడు రవితేజ కూడా రుద్రంపూర్‌లోని బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఓసీ విస్తరణ నిర్వాసితులకు పంపిణీ చేయనున్న ఇళ్ల స్థలాల జాబితాలో పేరు లేకపోవడంతో ఆర్కే స్వామి చిన్న కుమారుడు రవితేజ సెల్ టవరెక్కి సుమారు మూడు గంటలపాటు నిరసన వ్యక్తం చేశాడు. త్రీ టౌన్ సీఐ మురళి, డీటీ తిరుమల తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని నచ్చజెప్పారు. డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి స్థలం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో యువకుడు సెల్‌టవర్ దిగాడు. -
ప్రజల కోసం బ్రహ్మాండమైన ప్యాకేజీ
సాక్షి, హైదరాబాద్/దుండిగల్: ఎంతో కాలం అధికారంలో ఉన్నా ఏమీ చేయని వాళ్లు.. చేసింది చెప్పుకోవ డానికి ఏమీ లేనివాళ్లు ఇప్పుడు తమ కు అవకాశమిస్తే ఎన్నో చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని, వారి మాటలు నమ్మొద్దని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రజలను హెచ్చరించా రు. సంక్రాంతి ముందు గంగిరెద్దుల వాళ్లు వచ్చినట్లు ఎన్నికల ముందు వచ్చేవాళ్ల మాటలతో మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ, బెంగళూరుల నుంచి వచ్చేవారు ఎన్నో ప్యాకేజీలు ప్రకటిస్తున్నారని, వాళ్లు చెప్పిన దానికంటే ఎక్కువ సంక్షేమ కార్యక్ర మాలు, బ్రహ్మాండమైన ప్యాకేజీ ఇచ్చే ఆలోచన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందని, ఆ విషయాల్ని ఆయనే త్వరలో ప్రకటిస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ స్కీముల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్‌లో నిర్మించిన 1,800 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను కేటీఆర్ గురువారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘డబుల్’ లబ్ధిదారుల్లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు పేదలు, రైతులపై కేసీఆర్కున్న ప్రేమ దేశంలో మరెవ్వరికీ లేదని కేటీఆర్ చెప్పారు. ప్రగతి రథ చక్రాన్ని ఆపేందుకు ఇష్టమొచ్చినట్లుగా హామీలిస్తు న్న వారి మాటలు నమ్మి మోసపోవద్దని, పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని ఎలాంటి పక్షపాతం లేకుండా ఆన్లైన్ లాటరీ ద్వారా ఎంపిక చేశామని తెలిపారు. జగద్గిరిగుట్ట డివిజన్లోని కాంగ్రెస్ మహిళా అధ్యక్షు రాలు కౌసల్యకు, బీజేపీ నాయకురాలు సునీతకు కూడా ఇళ్లు వచ్చాయని చెప్పారు. తొలిదశలో అర్హులకు లక్ష ఇళ్లు ఇస్తుండగా, అర్హులైన మిగతా మూడున్నర లక్షల మందికి కూడా ఇచ్చే బాధ్యత తమదేనని అన్నారు. ఈ రోజుతో 30 వేల ఇళ్ల పంపిణీ పూర్తవుతుండగా, త్వరలోనే మిగతా 70 వేల ఇళ్లు కూడా అందజేస్తామన్నారు. లక్ష ఇళ్ల నిర్మాణా నికి ప్రభుత్వానికైన ఖర్చు దాదాపు రూ.10 వేల కోట్లయితే, మార్కెట్ రేటు ప్రకారం దాదాపు రూ. 50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల విలువైన ఆస్తిని పేదల చేతుల్లో పెడుతున్న ప్రభుత్వం తమదని కేటీఆర్ పేర్కొన్నారు. దుండిగల్‌కు త్వరలోనే కొత్త పరిశ్రమ రానుందని తెలిపారు. ఇలాంటి ఇళ్లు ఇంకెక్కడైనా ఉన్నాయా ? మన రాష్ట్రం కాక దేశంలో ఉన్న మరో 27 రాష్ట్రాల్లో, కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్నాయేమో చూపిస్తారా? అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సవాల్ విసిరారు. పేదలకు ఇలాంటి ఇళ్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేవని చెప్పారు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అని పెద్దలు అంటారని, నిరుపేద ప్రజలకు ఇళ్లు కట్టించి, పెళ్లి చేయించి ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి మేనమామగా నిలిచారని పేర్కొన్నారు. చాయ్ అమ్ముకో.. దేశాన్ని మోసం చేయొద్దు ఇంటి పట్టా అందుకున్న ఒక మహిళను కేటీఆర్ ఏం చేస్తావంటూ ప్రశ్నించారు. ఆమె తాను చా య్ అమ్ముతానని చెప్పడంతో ‘చాయ్ అమ్ము కోవాలి.. కానీ దేశాన్ని మోసం చేయొద్దు’ అని అన్నారు. ఏమీ అర్థం కాక ఆమె తెల్లముఖం వేయడంతో.. ‘నీ గురించి కాదులే.. వేరేవా ళ్లు ఉన్నారు.. వారి గురించి చెబుతున్నా’ అంటూ పరోక్షంగా ప్రధాని మోదీని ప్రస్తావించారు. -
‘కాంగ్రెస్ నాయకురాలికి డబుల్ ఇల్లు ఇచ్చాం.. ఇప్పుడేమంటారు’
సాక్షి, దుండిగల్: మంత్రి కేటీఆర్ మేడ్చల్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా దుండిగల్‌లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పేదల గురించి ఆలోచించే సీఎం కేసీఆర్ మాత్రమే. అన్ని సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు పూర్తి చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజలపక్షమే. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదింమని కోరుతున్నాను. పేదలను ప్రేమించే నాయకుడు కేసీఆర్. కొత్త లింక్ రోడ్డు, బ్రహ్మండమైన నాలాలు నిర్మిస్తున్నాం. గతంలో మంచినీటి కోసం ఎంత ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మంచినీటి కష్టాలు లేవు. కేసీఆర్ ప్రజల మనిషి.. ఇల్లు కట్టిసూడు-పెళ్లి చేసిచుడు అంటారు పెద్దలు. కానీ కేసీఆర్ మాత్రం ఇళ్ళు నేనే కట్టిస్తా..పెళ్లి నేనే చేయిస్తా అంటున్నారు. ఒక్కో డబుల్ బెడ్ రూమ్ ఇల్లుకు 10లక్షలు ప్రభుత్వానికి ఖర్చు అయితే.. దాని విలువ 30లక్షలు ఉంది. గ్రేటర్ పరిధిలో 50వేల కోట్లు ఖరీదు చేసే ఆస్తులను ప్రభుత్వం పేదలకు ఇస్తోంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ఎంతో పారదర్శకంగా జరుగుతోంది. జగద్గిరి గుట్టలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలికి ఇల్లు వచ్చింది. ఇప్పటి వరకు 30వేల ఇండ్లను పంపిణీ చేశాం. వికలాంగులు, దళితులు, పేదలకు ఇండ్లు పంపిణీ చేస్తున్నాం. గ్రేటర్ పరిధిలో 1లక్ష ఇండ్లను ఎన్నికల లోపు చేస్తాం. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇచ్చారా?. దుండిగల్‌కి త్వరలోనే కొత్త పరిశ్రమ రాబోతోంది అభివృద్ధి చెప్పుకోలేక కొత్త మార్గాల్లో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి హామీలు ఇస్తే తొందర పడొద్దు. వాళ్ళు ఇచ్చే హామీలకంటే మంచి హామీలు కేసీఆర్ ఇవ్వబోతున్నారు. ఇళ్ల పంపిణీలో ఎవరి జోక్యం లేదు కాబట్టే కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలకు ఇల్లులు వచ్చాయి’ అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: సెల్‌ఫోన్ యూజర్లకు వార్నింగ్ మెసేజ్.. స్పందించిన కేంద్రం -
తుక్కుగుడ మున్సిపాలిటీ పరిధిలో ఉద్రిక్త వాతావరణం..
సాక్షి, రంగారెడ్డి: మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగుడ మున్సిపాలిటీ పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 2200 డబుల్ బెడ్రూం ఇళ్లల్లోనూ స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాల వారికి ఇవ్వడంతో ఆందోళనకు దిగారు స్థానిక ప్రజలు. కాగా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో మంకాల, తుక్కుగూడ, రావిరాల్, సర్దార్ నగర్ , ఇమామ్ గూడ గ్రామ ప్రజలకు కాకుండా ఇతర ప్రాంతాల వారికి ఇళ్లు కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. తమకు కాకుండా.. పాతబస్తీ మలక్‌పేట్, చార్మినార్, చాంద్రాయణ్‌గుట్ట , యాకత్‌పురకు చెందిన వారికి ఇవ్వడాన్ని నిరసిస్తూ స్థానిక నాయకులందరూ కలిసికట్టుగా జేఏసీగా ఏర్పడి మున్సిపాలిటీ బంద్‌కు పిలుపునిచ్చారు. జేఏసీ పిలుపు మేరకు ఆయా గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ ప్రజలు నల్ల బ్యాడ్జీలు ధరించి మున్సిపాలిటీలోని అన్ని గ్రామాల ప్రజలు భారీ నిరసన ర్యాలీ ప్రారంభించారు... -
ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న పనులు..! సొంతింటి కల నెరవేరేనా..?
మెదక్: గూడులేని నిరుపేదలకు ఇళ్లను అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం నత్తనడకన కొనసాగుతోంది. ఆర్థికంగా స్తోమత లేని పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి అందిస్తామని 2014 లో బీఆర్ఎస్ ప్రబుత్వం ప్రకటించింది. ఈ మేరకు అర్హుల నుంచి దరఖాస్తులను సైతం స్వీకరించారు. బడ్జెట్లో కేటాయించిన ప్రకారం జిల్లాకు 4,776 ఇళ్లు మంజూరు చేశారు. లక్ష్యం ఘనంగా ఉన్నా.. ఆచరణ మాత్రం అంతంతే అన్నట్లుగా మారింది జిల్లాలో ఇళ్ల కేటాయింపు. చాలా చోట్ల నిర్మాణాలు పూర్తికాక, పూర్తయిన వాటిని పంపిణీ చేయకుండా వదిలేయడంతో ఎనిమిదేళ్లుగా అర్హులకు ఎదురు చూపులు తప్పడంలేదు. జిల్లా వ్యాప్తంగా.. ప్రభుత్వం మెదక్ జిల్లాలో అర్హులకు 4,776 ఇళ్లను మంజూరు చేసింది. అందులో 3,779 ఇళ్లకు టెండర్ పిలువగా, 3,644 గృహాల పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో 2,440 ఇళ్లు పూర్తి కాగా, 1,204 పనులు జరగాల్సి ఉంది. చాలా వరకు పునాది స్థాయిలో, మరికొన్ని స్లాబ్ వేసి వదిలేశారు. పూర్తి అయిన కొన్నింటిని మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని పిల్లకొటాల్ శివారులో 950 ఇళ్లు మంజూరవగా, 540 ఇళ్లు పూర్తయ్యాయి. వీటిని గతేడాది ఆగస్టులో మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగతా 410 ఇళ్లను రెండు నెలల్లో పూర్తి చేయాలని మంత్రి సూచించినా.. పనులు ముందుకు సాగడంలేదు. నర్సాపూర్‌కు 500 ఇళ్లకు 250 మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయి. పూర్తయిన వాటిని పంపిణీ చేయకపోవటంతో అవి శిథిలావస్థకు చేరాయి. చేగుంట మండలానికి 1,250 ఇళ్లు మంజూరవగా, 108 మాత్రమే పూర్తయ్యాయి. వాటిని ఇంకా లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. ఇదే మండలం కొండాపూర్ గ్రామంలో 20 ఇళ్ల నిర్మాణం పూర్తయినా.. అధికారికంగా పంపిణీ చేయలేదు. దీంతో గ్రామానికి చెందిన కొందరు పేదలు ఇళ్లను ఆక్రమించి నివాసం ఉంటున్నారు. మెదక్ మండలం పాతూర్, రాయినిపల్లి గ్రామాలకు 40 చొప్పున కేటాయించినా.. నేటికి పనులు మొదలుకాలేదు. కొల్చారం మండలంలోని కొల్చారం, ఎనగండ్లలో ఇదే పరిస్థితి. చిన్నశంకరంపేట మండలంలో కామారం, మీర్జాపల్లి, కొర్విపల్లిలో కూడా నిర్మాణాలు పూర్తికాలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలకే పంపిణీ.. జిల్లాలో మొదటి దశలో పూర్తయిన 2,440 ఇళ్లలో పంపిణీ చేసినవి 1,568 కాగా ఇంకా 872 పంపిణీ చేయాల్సి ఉంది. కాగా ఇప్పటివరకు పంపిణీ చేసిన వాటిలో బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. లబ్ధిదారుల ఎంపికను సర్పంచులు, కౌన్సిలర్లు చేశారు. ఈ నెల 21న రెండో విడత ప్రారంభించాలని, అర్హుల ఎంపికను అధికారులకు అప్పగించాలని కోరుతున్నారు. ఇప్పుడైనా అర్హులకు ఇళ్లు అందుతాయో లేదో వేచి చూడాల్సిందే. -
డబుల్ బెడ్రూం ఇళ్ల ‘డ్రా పద్ధతి’పై హైదరాబాద్ కలెక్టర్ ముద్ర
హైదరాబాద్ : డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, కేటాయింపు ‘డ్రా పద్ధతి’పై హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తనదైన శైలిలో ప్రత్యేకతను ప్రదర్శించారు. దేశంలోనే తొలిసారిగా సరికొత్త ఆన్లైన్ ర్యాండమైజేషన్ విధానం ద్వారా లబ్ధిదారుల ఎంపిక, కేటాయింపు ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. రాజస్థాన్ బిట్స్ పిలానీ ఐఐటీ, సివిల్స్ టాపర్ అయిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అధికారుల సహకారంతో ఆధునిక సాంకేతికతతో కూడిన ప్రత్యేక ఆన్లైన్ ర్యాండమైజేషన్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ విధానాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. హైదరాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ఆమోదం లభించింది. ప్రత్యేక డిస్ప్లే స్క్రీన్ ద్వారా.. గత నెల 24న హైదరాబాద్ కలెక్టరేట్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్ రాస్, మేడ్చల్ కలెక్టర్ అమయ్‌కుమార్ సమక్షంలో ఆన్లైన్ ర్యాండమైజేషన్ పద్ధతిలో జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రత్యేక ఆన్లైన్ డిస్ప్లే స్క్రీన్ ద్వారా అర్హత సాధించిన దరఖాస్తుల జాబితా, ఆ తర్వాత ర్యాండమైజేషన్ పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక నిర్వహించి తుది జాబితా ప్రదర్శించారు. లబ్ధిదారు పేరు, ఆధార్, ఫోన్ నంబర్లు ప్రదర్శించేలా పారదర్శకత పాటించారు. కేవలం 30 నిమిషాల్లోనే లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. హైదరాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా లబ్ధిదారుల ఎంపిక విజయవంతం కావడంతో ఆ తర్వాత మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో సైతం ఆన్లైన్ ర్యాండమైజేషన్ పద్ధతిలోనే లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేశారు. ఇళ్ల కేటాయింపు సైతం గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు చెందిన 24 అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన లబ్ధిదారులకు ఆన్లైన్ ర్యాండమైజేషన్ పద్ధతిలోనే ఎంపికై న లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. నగర శివారులోని ఎనిమిది ప్రదేశాల్లో నిర్మించిన డబుల్బెడ్రూం నివాస సముదాయాల్లో సుమారు 11,700 మంది లబ్ధిదారులకు ఆన్లైన్ ర్యాండమైజేషన్ పద్ధతిలో ఇళ్లను కేటాయించారు. డబుల్ బెడ్రూం లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా, సునాయాసంగా జరిగేలా ఆధునిక సాంకేతికతతో కూడిన ఆన్లైన్ ర్యాండమైజేషన్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందించారు. -
‘డబుల్ ఇంజన్’లో అన్నీ ట్రబుల్సే
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో కొందరు నేతలు డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని మాట్లాడుతున్నారని... డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేస్తున్నారా అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నిరుపేదలకు ఇలాంటి గృహాలు ఇవ్వట్లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నిరుపేదలకు ఆత్మగౌరవ గృహాలను పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూం గృహ సముదాయంలో శనివారం 11,700 ఇళ్లకు సంబంధించిన పట్టాలను పటాన్చెరువు, ఖైరతాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్, కార్వాన్, శేరిలింగంపల్లి, గోషామహల్ నియోజకవర్గాలకు చెందిన లబ్దిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న రాష్ట్రాల్లో అన్నీ ట్రబుల్సేనని ఎద్దేవా చేశారు. కొన్ని ప్రతిపక్ష పార్టీలు నిత్యం నినాదాలు, ధర్నాలు చేస్తున్నాయని, ఆయా పార్టీలు జీవితాంతం అలాగే ఉంటాయని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కేవలం మాటలకే పరిమితమవుతోందని విమర్శించారు. కాంగ్రెస్ తీరుపైనా హరీశ్‌రావు విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇల్లు నిర్మించుకొనే వారికి రూ. 60 వేలు ఇచ్చేదని, అందులో కొంత మొత్తం అప్పుగా ఉండేదని, దానిపై వడ్డీలు సైతం వసూలు చేసే వారన్నారు. ఇప్పుడు నయా పైసా ఖర్చు లేకుండా సుమారు రూ. 60 లక్షల విలువ చేసే డబుల్ బెడ్రూం ఇళ్లను ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు అరికెపూడి గాం«దీ, దానం నాగేందర్, కౌసర్ అహ్మద్, రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. ‘డబుల్’ఇళ్లు దేశానికే ఆదర్శం: మంత్రి మహేందర్‌రెడ్డి పటాన్చెరు టౌన్: దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీని చేపట్టారని సమాచార, పౌర సంబంధాలు, గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం కర్దనూరు గ్రామం ఫేజ్– 2లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను శనివారం రాజేంద్రనగర్, నార్సింగి, బైరాగిగూడకు చెందిన 500 మంది లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలో ఒకే రోజు ఎనిమిది ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మరో దశలో 1,620 ఇళ్లను దాదాపు రూ.140 కోట్లతో నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. -
‘వాళ్ల మాటలు కోటలు దాటితే, చేతలు పకోడిలా ఉంటాయి’
సాక్షి, సంగారెడ్డి: బీజేపీ వాళ్ళకు మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని హరీష్ రావు మండిపడ్డారు. మాటలు కోటలు దాటుతాయి.. చేతలు పకోడిలా ఉంటాయని సెటైర్లు వేశారు. తెల్లపూర్ మున్సిపాలిటి పరిధిలోని కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్‌ల ఇళ్ల పంపిణి కార్యక్రమం శనివారం జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నియోజకవర్గ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ శరత్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్లు తీసుకున్న వారిలో సంతోషం కనపడుతుందన్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 60 లక్షల విలువైన ఇల్లు పేదల సొంతమయ్యాయని పేర్కొన్నారు. విలువైన స్థలంలో ధనవంతులు ఉండే ప్రాంతంలో పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ప్రశంసించారు. కాంగ్రెస్, బీజేపీలు ఎప్పుడు ధర్నాలే చేస్తాయని, పనిచేయవని విమర్శించారు. హైదరాబాద్ నలుమూలలా లక్ష డబుల్ బెడ్ రూమ్‌లు ఇస్తున్నామన్నారు. ఇక్కడ ఇండ్ల వద్ద అన్ని వసతులు కల్పిస్తామని, ఆసుపత్రి, రేషన్ షాపుతో పాటు అన్ని సౌకర్యాలు అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించినట్టు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా అన్ని మతాలను గౌరవించే వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. ఆలయం, చర్చ్, మసీదు కూడా ఏర్పాటు చేస్తామని, ఫంక్షన్ హాల్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. చదవండి: మేడ్చల్ జిల్లాలో రాజకీయ సంద‘ఢీ’.. ప్రత్యర్థులెవరు? ‘బీఆర్ఎస్ సర్కార్ అంటే మాటలు తక్కువ పనులు ఎక్కువ. ఇప్పుడు మంచినీళ్లకు ధర్నాలు లేవు. తాగు నీరు సరఫరా మంచిగా జరుగుతుంది. బీజేపీ వాళ్ళు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్నో చెప్పారు. ఇల్లు పోతే ఇల్లు, బండి పొతే బండి ఇస్తామన్నారు. బండి పోతే బండి.. గుండు పోతే గుండు అన్నారు. బండి లేదు గుండు లేదు. డబుల్ ఇంజిన్ సర్కార్‌లో ఎక్కడైనా డబుల్ బెడ్ రూమ్‌లు ఇచ్చారా ? వీరిది డబుల్ ఇంజన్ కాదు ట్రబుల్ ఇంజన్ సర్కార్. విలువైన ఇంటిని జాగ్రత్తగా కాపాడుకోండి. ఇల్లు ఇచ్చిన, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కేసీఆర్‌ను ఆశీర్వదించండి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యునిటీగా మారనుంది’ అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజాసింగ్, దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, మాగంటి గోపీనాథ్, మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాల్లో.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు లేవు? - మంత్రి శ్రీ @BRSHarish.#DignityHousing pic.twitter.com/Uddlkvy64E — BRS Party (@BRSparty) September 2, 2023