సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో కొందరు నేతలు డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని మాట్లాడుతున్నారని... డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేస్తున్నారా అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నిరుపేదలకు ఇలాంటి గృహాలు ఇవ్వట్లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నిరుపేదలకు ఆత్మగౌరవ గృహాలను పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు.
సంగారెడ్డి జిల్లా కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూం గృహ సముదాయంలో శనివారం 11,700 ఇళ్లకు సంబంధించిన పట్టాలను పటాన్‌చెరువు, ఖైరతాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్, కార్వాన్, శేరిలింగంపల్లి, గోషామహల్ నియోజకవర్గాలకు చెందిన లబ్దిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న రాష్ట్రాల్లో అన్నీ ట్రబుల్సేనని ఎద్దేవా చేశారు. కొన్ని ప్రతిపక్ష పార్టీలు నిత్యం నినాదాలు, ధర్నాలు చేస్తున్నాయని, ఆయా పార్టీలు జీవితాంతం అలాగే ఉంటాయని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కేవలం మాటలకే పరిమితమవుతోందని విమర్శించారు.
కాంగ్రెస్ తీరుపైనా హరీశ్‌రావు విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇల్లు నిర్మించుకొనే వారికి రూ. 60 వేలు ఇచ్చేదని, అందులో కొంత మొత్తం అప్పుగా ఉండేదని, దానిపై వడ్డీలు సైతం వసూలు చేసే వారన్నారు. ఇప్పుడు నయా పైసా ఖర్చు లేకుండా సుమారు రూ. 60 లక్షల విలువ చేసే డబుల్ బెడ్రూం ఇళ్లను ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు అరికెపూడి గాం«దీ, దానం నాగేందర్, కౌసర్ అహ్మద్, రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు.
‘డబుల్’ఇళ్లు దేశానికే ఆదర్శం: మంత్రి మహేందర్‌రెడ్డి
పటాన్‌చెరు టౌన్: దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీని చేపట్టారని సమాచార, పౌర సంబంధాలు, గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. పటాన్‌చెరు మండలం కర్దనూరు గ్రామం ఫేజ్– 2లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను శనివారం రాజేంద్రనగర్, నార్సింగి, బైరాగిగూడకు చెందిన 500 మంది లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలో ఒకే రోజు ఎనిమిది ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మరో దశలో 1,620 ఇళ్లను దాదాపు రూ.140 కోట్లతో నిర్మించి ఇస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment