జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లు
మంచిర్యాల: పేదల సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించింది. నిర్మాణాలు పూర్తి కావడంతో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. గత మార్చి 17న కలెక్టర్ బదావత్ సంతోష్ ఆధ్వర్యంలో లక్కీడ్రా పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేశారు.
అయితే ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఇళ్లు అప్పగించలేదు. నేడో రేపో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ఇప్పట్లో పేదల డబుల్ కల నెరవేరే అవకాశం కనిపించడం లేదు.
షెడ్యూల్ వస్తే మరింత జాప్యం
అనర్హులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు డ్రాలో వచ్చిందని మున్సిపల్ అధికారులకు, రెవె న్యూ అధికారులకు, కలెక్టర్‌కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 85 ఫిర్యాదులను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వారి సిబ్బందితో మరోసారి సర్వే చేసి, 50 మందిని అనర్హులుగా గుర్తించారు. వారికి మినహా మిగతా వారికి డబుల్ బెడ్‌రూంలను ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
ఎన్నికల షెడ్యూల్ విడుదలయితే మరింత ఆలస్యంగా ఇళ్లు కేటాయించే అవకాశం ఉంది. పునఃపరిశీలన పేరుతో అసలైన లబ్ధిదారులకు ఇప్పటికీ ఇళ్లు అప్పగించడం లేదు. రెండు నెలలుగా కాలయాపన చేస్తున్నారు. మున్సిపల్, రెవె న్యూ అధికారులు ఉమ్మడిగా సర్వే చేస్తున్నా అనర్హులను గుర్తించడంలో ఇంకా జాప్యం జరుగుతోంది. ఎన్నికల కోడ్ రాకముందే డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
360 నిర్మాణాలు పూర్తి..
జిల్లా కేంద్రంలో 650 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపట్టగా, అందులో 360 నిర్మాణ పనులు పూర్తయ్యాయి. డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చిన 30 కుటుంబాలకు గతంలోనే 30 ఇళ్లను మంజూరు చేశారు. మిగిలిన 330 ఇళ్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి.
5 వేల దరఖాస్తులు..
ఇక 330 ఇళ్ల కోసం 5 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు మొదటగా 2,958 మందిని అర్హులుగా గుర్తించారు. మండల రెవెన్యూ అధికారులతోపాటు, జిల్లాస్థాయి అధికారులు రెండుసార్లు సర్వే చేసి, అర్హులు 1,616 మంది ఉన్నట్లుగా గుర్తించారు. వారికి టోకెన్లు అందించారు.
మార్చి 17న జిల్లా కలెక్టర్ అధ్యక్షతన టోకెన్లు తీసుకున్న వారి సమక్షంలోనే లక్కీడ్రా పద్ధతిలో 330 మందిని ఎంపిక చేశారు. స్థలం ఉన్నవారికి, ఒకే ఇంట్లో ఇద్దరికి సైతం డబుల్ బెడ్‌రూం ఇళ్లు లక్కీడ్రాలో పొందారని ఆధారాలతో ఫిర్యాదు చేయగా, 50 మంది వరకు స్వచ్ఛందంగా డబుల్ బెడ్‌రూం ఇళ్లను వదులుకున్నారు. కానీ అన్ని అర్హతలు ఉన్నవారికి మాత్రం ఇప్పటి వరకు ఇళ్లను అప్పగించలేదు.
Comments
Please login to add a commentAdd a comment