గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని జనం డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వేల ఇళ్లు నిర్మాణం పూర్తయినా పేదల చేతికి రావడం లేదు. మరెన్నో ఇళ్లు వివిధ దశల్లో పనులు ఆగిపోయి బోసిపోయి కనిపిస్తున్నాయి. గ్రేటర్‌లో కలిసి ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని ప్రాంతాల్లో 62 వేలకుపైగా ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వీటిని వెంటనే పంపిణీ చేయాలని, తమ సొంతింటి కలను తీర్చాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు 2015లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెద్ద సంఖ్యలో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ.. త్వరలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ ఉంటుందని ప్రకటించింది. కానీ ఇది అమల్లోకి రాలేదు. ఇప్పటివరకు 62 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయినా లబ్ధిదారుల ఎంపిక జరగకపోవడంతో పంపిణీ కాలేదు.
దరఖాస్తుల అప్‌లోడింగ్ సగమే..
మొత్తంగా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా.. 50 వేల ఇళ్లను పంపిణీ చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ దాదాపు రెండేళ్ల క్రితం పేర్కొన్నారు. పంపిణీకి అర్హులైన పేదలను గుర్తించేందుకు ఆరు నెలల కింద క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన చేపట్టారు. 7 లక్షల మందికిపైగా ‘డబుల్’ ఇళ్ల కోసం దర ఖాస్తు చేసుకోగా.. ఇప్పటివరకు మూడున్నర లక్షల మంది వివరాలనే సంబంధిత యాప్‌లో అప్‌లోడ్ చేశారు.
కరోనా సమయంలో చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం, ఫోన్ నంబర్లు మారడం తదితర కారణాలతో వారికి సమాచారం అందలేదు. అర్హుల ఎంపిక ఇప్పటికీ పూర్తికాలేదు. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారనే ప్రచారంతో చాలా మంది ఆశపడినా నిరాశే మిగిలింది.
నిలిచిన పనులు.. సామగ్రి దొంగల పాలు
పలుచోట్ల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు తుది దశలో ఉన్నాయి. కానీ కాంట్రాక్టర్లకు బిల్లులు అందకపోవడంతో ఏడాదిన్నరగా పనులు నిలిచిపోయాయి. నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగాయని, పాత ధరలతో ఇప్పుడు పనులు చేయలేమని కాంట్రాక్టర్లు అంటున్నారు. మరోవైపు నిర్మాణం పూర్తయిన ప్రాంతాల్లో ఇళ్లకు కాపలా సమస్యగా మారింది.
కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల తలుపులు, కిటికీలు, శానిటేషన్ సామగ్రితోపాటు వివిధ అవసరాల కోసం ఏర్పాటు చేసిన కేబుళ్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వంటివి చోరీకి గురయ్యాయి. చివరికి ఇళ్ల గోడలు తొలిచి ఇటుకలనూ దొంగిలించినట్టు అధికారుల దృష్టికి వచ్చింది. ఇప్పటికే దాదాపు రూ.3కోట్ల విలువైన సామగ్రి దొంగలపాలు అయిందని.. లబ్ధిదారులకు కేటాయింపులు, గృహ ప్రవేశాలు జరిగితేగానీ మొత్తం ఏయే సామగ్రి పోయిందో, ఎంత విలువో తెలుస్తుందని అధికారులు చెప్తున్నారు.
అపార్ట్‌మెంట్ల తరహాలో నిర్మాణం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్లను భారీ అపార్ట్‌మెంట్ల తరహాలో నిర్మిస్తున్నారు. వీటిలో మూడు రకాలున్నాయి.
►సెల్లార్+ స్టిల్ట్+ 9 అంతస్తులు, లిఫ్టులు, ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలతో భవన సముదాయం. ఒక్కో ఇంటి వ్యయం రూ.8.65 లక్షలు
►స్టిల్ట్+ 5అంతస్తులు, లిఫ్టులు, మౌలిక సదుపాయాలతో భవనాలు. ఒక్కో ఇంటి వ్యయం రూ.8.50 లక్షలు.
►లిఫ్టులు లేకుండా గ్రౌండ్+3 అంతస్తులు, మౌలిక సదుపాయాలతో భవనాలు. ఒక్కో ఇంటి వ్యయం రూ.7.75 లక్షలు.
►అన్ని రకాల్లోనూ 569 చదరపు అడుగుల విస్తీర్ణంతో.. ఒక హాల్, 2 బెడ్రూంలు, ఒక కిచెన్, రెండు టాయిలెట్లు ఉండేలా నిర్మిస్తున్నారు.
లక్ష ఇళ్లు ఇలా..
►మొత్తం లక్ష ఇళ్లకుగాను కోర్టు కేసులు, వివాదాలతో 2,659 ఇళ్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
►మిగతా వాటిలో 88,443 ఇళ్లను 27 ఖాళీ ప్రదేశాల్లో చేపట్టారు. వీటిలో 62,516 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగతావాటి పనులు 70–80 శాతం వరకు పూర్తయ్యాయి.
►నగరంలోని మురికివాడలు, ఇతర ప్రాంతాల్లో పేదల పాత ఇళ్లను కూల్చివేసి వాటిస్థానంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇలా 40 ప్రాంతాల్లో 8,898 ఇళ్లు నిర్మిస్తున్నారు. వీటిని డిగ్నిటీ హౌసింగ్ కాలనీలుగా పిలుస్తున్నారు. ఇప్పటివరకు 26 డిగ్నిటీ హౌసింగ్ కాలనీల్లో 5,266 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వీటిని మాత్రం పంపిణీ చేశారు.
మరో రూ. 2847 కోట్లు అవసరం
►గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్లకు మౌలిక సదుపాయాలతో కలిపి మొత్తం అంచనా వ్యయం: రూ.9,715 కోట్లు
►ఇందులో హౌసింగ్ విభాగం నుంచి అందిన నిధులు: రూ.6,868 కోట్లు
►పెండింగ్‌లో ఉన్న బిల్లులు: రూ. 150 కోట్లు
►ఇళ్లు పూర్తయ్యేందుకు ఇంకా కావాల్సిన నిధులు: రూ. 2,847 కోట్లు
►కేంద్రం నుంచి పీఎంఏవై ద్వారా రూ. 1,500 కోట్లు మంజూరైనా.. లబ్ధిదారుల ఎంపిక జరగనందున మొత్తం నిధులు రాలేదు. ఇప్పటివరకు దాదాపు రూ. 750 కోట్లు అందాయి.
పంపిణీ యోచనలో ప్రభుత్వం ఉంది
‘‘కోవిడ్ కారణంగా అన్నిరంగాలు దెబ్బతినడం, ఆర్థిక ఇబ్బందులతో కొంతకాలం పనులు నెమ్మదించాయి. 62 వేల ఇళ్లు పూర్తికాగా మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. స్థానికత గుర్తింపు కోసం నియోజకవర్గ ఓటరు, ఆధార్ జిరాక్సులను జీహెచ్‌ఎంసీ సర్కిల్ స్థాయిలో అధికారులు సేకరిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక యాప్ రూపొందించారు. ఇళ్ల కోసం ఏడు లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకోగా.. 3.50 లక్షల మంది డేటా అప్‌లోడ్ అయింది.
ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి సమాచారం నిమిత్తం పత్రికా ప్రకటనలు జారీ చేయడంతోపాటు జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. మూడు నెలలకోమారు 30 వేల కుటుంబాలకు చొప్పున ఇళ్లను పంపిణీ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఉత్తర్వులు రాగానే ఇళ్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
– కె.సురేశ్‌కుమార్, ఓఎస్డీ (హౌసింగ్), జీహెచ్‌ఎంసీ
ఐదేళ్ల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాం
డబుల్ బెడ్రూం ఇంటి కోసం ఐదేండ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. ఆరు నెలల కింద ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ వస్తే ఓటరు ఐడీకార్డు, ఆధార్‌కార్డు వివరాలిచ్చాం. ఇప్పటికైనా సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేస్తారని ఆశిస్తున్నాం.
– పద్మ, బాపునగర్, చిక్కడపల్లి
కళ్లు కాయలు కాస్తున్నాయ్..
అదిగో ఇదిగో డబుల్ బెడ్రూం ఇళ్లొస్తున్నాయ్ అంటూ ఏళ్లు గడుస్తున్నా అతీగతీ లేదు. నాలుగేళ్ల కింద దరఖాస్తులిచ్చినం. ఇప్పటివరకు ఏమీలేదు. మాకు ఇద్దరు ఆడపిల్లలు. మా ఆయన కూలి పనికి వెళతాడు. కరోనా వచ్చినప్పటి నుంచి మరిన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఇంటికోసం ఎదురు చూసీ చూసీ కళ్లు కాయలు కాస్తున్నాయ్.
– ప్రశాంతి, ఉప్పల్
Comments
Please login to add a commentAdd a comment