సాక్షి, హైదరాబాద్: ఇళ్లు కట్టడం ఒక ఎత్తయితే.. కట్టిన ఇళ్లకు కాపలా కాయడం మరొక ఎత్తయిన ఘటన ఇది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వం పేదలకు ప్రకటించిన ఉచిత డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండగా, గ్రేటర్ నగరంలో మాత్రం ఏడాది క్రితం వరకు ఇళ్ల నిర్మాణం వడివడిగా జరిగింది. పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో వాటికి కాపలా కాయడం పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన ఇళ్లలోని విద్యుత్, వాటర్‌సప్లై శానిటరీలకు సంబంధించిన సామగ్రి,పరికరాలను అగంతకులు ఎత్తుకుపోతున్నారు. అంతటితో ఆగకుండా లిఫ్టులు, పంప్‌సెట్లు, అగ్నిమాపక పరికరాల వంటి వాటిని ధ్వంసం చేస్తున్నారు.
ఆ ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నట్లు బల్దియా దృష్టికి వచ్చింది. ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన కాపలా ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత పోలీస్ కమిషనర్లకు సైతం కొద్దికాలం క్రితం అధికారులు లేఖలు రాశారు. కానీ.. ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. జీహెచ్‌ఎంసీలోని ఈవీడీఎం విభాగానికి చెందిన సిబ్బందిని కొన్ని ప్రాంతాల్లో కాపలా విధులకు నియమించారు. కానీ.. ఇంకా చాలా కాలనీల్లో కాపలా లేక దొంగతనాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కోటిరూపాయలకు పైగా విలువైన సామగ్రి మాయమైంది. తిరిగి మళ్లీ కొనుగోలు చేసి.. అమర్చడం ‘డబుల్’ పనిగా మారింది. ఈ నేపథ్యంలో కాపలాకు సెక్యూరిటీ గార్డుల్ని నియమించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది.
ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఆర్నెళ్ల వరకు అంటే.. జూలై నెలాఖరు వరకు ఆయా ప్రాంతాల్లో 133 మంది సెక్యూరిటీగార్డులు/వాచ్‌మన్లను నియమించనుంది. వారి వేతనాల కింద ఆర్నెళ్లకు వెరసి రూ.1.16 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందుకు స్టాండింగ్‌కమిటీ సైతం ఆమోదం తెలిపింది. పేదలుంటున్న బస్తీల్లో వారి చిన్న ఇళ్లను కూల్చి అక్కడే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టినచోట దొంగల బెడద లేకున్నా, శివార్లలో కట్టిన ప్రాంతాల్లోనే ఈ బెడద ఉంది. భారీ సంఖ్యలో ఇళ్లున్న అహ్మద్‌గూడ, రాంపల్లి, మంఖాల్, బహదూర్‌పల్లి, దుండిగల్, బాచుపల్లి, ప్రతాపసింగారం, మురహరిపల్లి, నిజాంపేట, తట్టిఅన్నారం తదితర ప్రాంతాల్లో ఈ సెక్యూరిటీ గార్డులను నియమించనున్నారు. 15వేలకు పైగా ఇళ్లున్న కొల్లూరులో మాత్రం కాంట్రాక్టు ఏజెన్సీయే కాపలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
కేటాయింపులు ఎప్పటికో..?
శివార్లలో ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలు సైతం అందుబాటులోకి వచ్చిన ప్రాంతాల్లోనూ ఇళ్లను ఎవరికీ కేటాయించలేదు. ఇంకా లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాకపోవడమే ఇందుకు కారణం. కేవలం ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు మాత్రమే తమవని, కేటాయింపులతో తమకెలాంటి సంబంధం లేదని జీహెచ్‌ఎంసీ హౌసింగ్ అధికారులు తెలిపారు.లబ్ధిదారుల ఎంపిక బాధ్యత జిల్లా కలెక్టర్లది కావడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment