ఫొటోలపై హ్యాండ్ ఎంబ్రాయిడరీ ట్రెండ్
బ్లాక్ అండ్ వైట్ ఫొటోలకు సొబగుల అల్లిక
ముంబై, బెంగళూరు నుంచి ఇటీవలే హైదరాబాద్‌కు
ఎంబ్రాయిడరీతో ఫ్రేమ్స్ చేయిస్తున్న ఔత్సాహికులు
ఫొటోలతో పాటు ఇంటికి కూడా కొత్త కళ
మనలో చాలా మంది జీవితంలో మరపురాని సందర్భాలను పదిలపరుచుకుంటారు. కొందరు వీడియోల రూపంలో దాచుకుంటే మరికొందరు ఫొటోల రూపంలో భద్రపరుచుకుంటారు. పుట్టిన పిల్లలకు సంబంధించి ప్రతి నెలా, ప్రతి సంవత్సరం విభిన్నంగా ఫొటో షూట్స్ చేసుకుంటున్నారు. అందరిలాగే మనం ఎందుకు ఉండాలని కొందరు వినూత్నంగా ఆలోచిస్తున్నారు.
ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు ఉండేవి కదా.. మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్తున్నారు. అలా సాధారణ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలకు కొత్త సొబగులు అద్దుతూ సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ ఫొటోలకు చేతులతో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ కొత్త లుక్ తీసుకొస్తారు. చీరలకు, జాకెట్లకు, డ్రెస్‌లకు ఎంబ్రాయిడరీ వర్క్స్ తరహాలోనే.. ఫొటోలకు ఎంబ్రాయిడరీ ఏంటని ఆశ్చర్యపోయేలా వర్క్ చేస్తున్నారు. అవును ఈ సరికొత్త ట్రెండ్ గురించే ఈ కథనం...
ఫొటోలపై హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇటీవల నగరంలో ఫేమస్ అవుతోంది. చాలా ఏళ్ల నుంచి ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఈ పనితీరు ట్రెండింగ్‌లో ఉండగా, తాజాగా మన నగరంలోకి వచి్చంది. పెళ్లి ఫొటోలు, బర్త్‌డే ఫొటోలు, బేబీ బంప్ సందర్భంగా తీసిన ఫొటోలను ఫ్రేమ్స్ రూపంలో ఇంట్లో పెట్టుకోవాలనుకునే వారు.. నార్మల్‌గా కాకుండా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఫొటోలకు డిఫరెంట్ లుక్ తీసుకొచ్చి తగిలించుకోవాలని అనుకుంటున్నారు. దీంతో ఫొటోలకే కాకుండా ఇంటికి కూడా సరికొత్త కళ వస్తోందని కస్టమర్లు అంటున్నారని నగరానికి చెందిన ఓ ఫొటోగ్రాఫర్ చెబుతున్నాడు. ఎంబోజ్ వంటి ప్రింటింగ్‌తో కూడా ఇలాంటి ఎఫెక్ట్ తీసుకురావొచ్చని, అయితే దానికన్నా ఎంబ్రాయిడరీకే కస్టమర్లు మొగ్గు చూపుతున్నారని తెలిపాడు. ముఖ్యంగా ఇంట్లో తగిలించుకునే ఫొటో ఫ్రేమ్స్ విషయంలో ఎక్కువ మంది ఇలాగే అడుగుతున్నారని పేర్కొన్నాడు.
ఎలా చేస్తారు..?
సాధారణంగా పెళ్లి ఫొటోలు లేదా ప్రత్యేక అకేషన్లలో దిగిన ఫొటోలను బ్లాక్ అండ్ వైట్ లేదా కలర్‌లో ప్రింట్ చేస్తారు. మనకు కావాల్సిన పరిమాణంలో ప్రింట్ తీసుకున్నాక.. మనకు కావాల్సిన మోడల్‌లో ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు. కలర్ ఫొటోల వెనుక తెలుపు రంగులో ఫొటో పేపర్‌ను అతికించి, దానిపై ఫ్రేమ్ మాదిరిగా, ఫ్లవర్స్ లేదా మరేదైనా మనకు కావాల్సిన డిజైన్ హ్యాండ్‌తో ఎంబ్రాయిడరీ చేస్తుంటారు. లేదంటే బ్లాక్ అండ్ వైట్ ఫొటోలపై వేసుకున్న డ్రెస్ కానీ, ధరించిన పూల దండలు, నగలను మాత్రమే హైలైట్ చేస్తూ రంగురంగుల దారాలతో అల్లుతారు. దీంతో ఫొటోకు సరికొత్త కళ వస్తుందని చెబుతున్నారు.
కాస్త సమయం పట్టినా..
సాధారణంగా ఫొటో ఎడిటింగ్, ప్రింటింగ్ నిమిషాల్లో అయిపోతుంది. కానీ ఎంబ్రాయిడరీకి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. సైజును బట్టి.. ఫొటోపై కుట్టాల్సిన ఎంబ్రాయిడరీని బట్టి సమయం తీసుకుంటున్నారు. ఒక్క ఫొటో పూర్తి చేసేందుకు కనీసం నాలుగైదు గంటల సమయం పడుతుందని ఓ షాప్ నిర్వాహకుడు వివరించాడు. సాధారణ ఫొటోలతో పోలిస్తే కాస్త ఖరీదు ఎక్కువ అయినా గిఫ్ట్‌లు ఇచ్చేందుకు ఫొటో ఎంబ్రాయిడరీని ఎంచుకుంటున్నారని చెబుతున్నాడు.
బహుమతులకు పర్‌ఫెక్ట్..
ఫొటో ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్ నగరంలో కొత్తగా వచి్చంది. ఎంబోజ్, గ్లిట్టర్ వంటి ఫొటో ప్రింటింగ్ టెక్నాలజీని ఆల్బమ్‌లు రూపొందించేందుకు ఎక్కువగా వాడుతుంటాం. వీటితో ఆల్బమ్‌కు, ఫొటోలకు మంచి లుక్ వస్తుంటుంది. అయితే ఫొటో ఎంబ్రాయిడరీని ఆల్బమ్‌లో పెట్టడం కాస్త కష్టం.
అందుకే చాలా మంది ఫొటో ఫ్రేమ్స్ చేయించుకునేందుకు ఫొటో ఎంబ్రాయిడరీ గురించి అడుగుతున్నారు. ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్, పెళ్లి వంటి శుభకార్యాల్లో గిఫ్ట్‌గా ఇచ్చేందుకు దీన్ని ఎంచుకుంటున్నారు. చూసేందుకు బాగుండటమే కాకుండా రిచ్‌గా, సరికొత్తగా ఉంటోందని చెబుతున్నారు.
:::బీసు విష్ణుప్రసాద్, ఫొటోగ్రాఫర్
::: సాక్షి, సిటీబ్యూరో
Comments
Please login to add a commentAdd a comment