
సాక్షి, హైదరాబాద్: టీకా తయారీలో పేరొందిన హైదరాబాదీ సంస్థ భారత్ బయోటెక్ మరో కీలకమైన ముందడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటిసారి జన్యు, కణాధారిత చికిత్సలకు ఉపయోగపడే వ్యవస్థలను ప్రారంభించింది. హైదరాబాద్ శివార్లలోని జినోమ్ వ్యాలీలో సుమారు యాభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కొత్త వ్యవస్థ ద్వారా కేన్సర్‌సహా అరుదైన వ్యాధులు కొన్నింటికి చికిత్సను అభివృద్ధి చేయడం వేగవంతం కానుంది.
కేన్సర్ వంటి వ్యాధులకు ఇటీవలి కాలంలో ఎన్నో కొత్త రకం చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. మన శరీరంలోని రోగ నిరోధక కణాలను చైతన్యపరచడం ద్వారా అవి కేన్సర్ కణాలను మట్టుబెట్టేలా చేసే కార్-టీ చికిత్స వీటిల్లో ఒకటి. అలాగే కొన్ని వ్యాధులకు జన్యు ఆధారిత చికిత్సలు అందుబాటులో ఉన్నాయి కానీ.. అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే లభించే ఈ చికిత్సలు చాలా ఖరీదైనవి. ఈ నేపథ్యంలోనే తాము కణ, జన్యు ఆధారిత చికిత్సలను అందరికీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఈ సరికొత్త వ్యవస్థను సిద్ధం చేసినట్లు భారత్ బయోటెక్ ఎగ్జిక్యుటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు.
రోగ నిరోధక వ్యవస్థను నియంత్రించడం, శరీర కణాలు ఎక్కువ కాలం పాటు మనగలిగే చేయడం, మన లక్ష్యాలకు అనుగుణంగా జన్యువులు తగిన ప్రొటీన్లు ఉత్పత్తి చేసేలా చేయడం ఈ కొత్త వ్యవస్థ నిర్వహించే పనులు. క్లుప్తంగా చెప్పాలంటే కొన్ని వ్యాధుల చికిత్సకు అవసరమైన ప్రత్యేకమైన వైరస్‌లను అభివృద్ధి చేసేందుకు ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయి. ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే విదేశాల్లో ఎంతో ఖర్చుపెట్టి చేయించుకోవాల్సిన కేన్సర్ చికిత్సలకు మనకు చవకయ్యే అవకాశం ఉంటుంది. అలాగే హీమోఫీలియా వంటి జన్యుపరమైన వ్యాధులకూ చికిత్స లభించడం మొదలవుతుంది.
‘‘జన్యు, కణ చికిత్సలు చాలా సంక్లిష్టమైనవి. అత్యాధునిక పద్ధతులు, టెక్నాలజీల వాడకం ఉంటుంది. ఎంతో నైపుణ్యం ఉంటే కానీ.. మన అవసరాలకు తగ్గట్టుగా జన్యువుల్లోమార్పులు చేయడం కుదరదు. అయితే వైరస్‌లతో టీకాలు తయారు చేయడంలో భారత్ బయోటెక్ ఇప్పటికే ఎంతో అనుభవం సాధించింది. నైపుణ్యాలను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలోనే అత్యంత అరుదైన, కేన్సర్ వంటి సంక్లిష్టమైన వ్యాధులపై పోరును ముందుకు తీసుకెళ్లగలిగేలా, క్లినికల్ ట్రయల్స్‌కు ఉపయోగపడే హ్యూమన్ గ్రేడ్ వెక్టార్లను తయారు చేసేందుకు ఈ కొత్త వ్యవస్థ ఉపయోగపడుతుంది’’ అని డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు.
భారత్ బయోటెక్ చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ రేచెస్ ఎల్లా మాట్లాడుతూ.. ‘‘ఏఏవీ, లెంటివైరస్, అడినోవైరస్ వంటి వైరల్ వెక్టార్లు కణ, జన్యు చికిత్సల్లో చాలా కీలకపాత్ర పోషిస్తాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న వ్యవస్థలో వీటిని అత్యధిక నాణ్యతతో అభివృద్ధి చేయగలం. తద్వారా రక్త కేన్సర్లు, అవయవాల్లోని కేన్సర్ల చికిత్సకు అవసరమైన వెక్టార్లను తయారు చేయగలం’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment