‘ఏయ్‌.. పవన్‌ చెప్పినా పనిచేయవా?’ | Kurnool Jana Sena Leader Attack DMHO Officer | Sakshi
Sakshi News home page

‘ఏయ్‌.. పవన్‌ చెప్పినా పనిచేయవా?’

Published Fri, Nov 22 2024 10:54 AM | Last Updated on Fri, Nov 22 2024 10:54 AM

Kurnool Jana Sena Leader Attack DMHO Officer

కర్నూలు (సెంట్రల్‌): ‘ఏయ్‌.. మా పవన్‌ కల్యాణ్‌ చెప్పినా పనిచేయవా?’ అంటూ.. ఊగిపోతూ.. డీఎంహెచ్‌వో కార్యాలయ సూప­రిం­టెండెంట్‌ శ్రీనివాసులుపై దాడికి దిగాడో జనసేన నేత. కర్నూ­లు జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ హర్షద్‌ గురువారం డీఎంహెచ్‌వోలో వీరంగం సృష్టించాడు . 

వివరాల్లోకి వెళితే.. 2012 నుంచి డీఎంహెచ్‌వో కార్యాలయంలో ప్రీతిబాయి తల్లి పార్వతి ఫిమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ పోస్టులో పనిచేస్తోంది. ఆమెకు జూనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి కోసం అధికారులను ఆశ్రయించింది. అందుకు సర్వీసు రూల్స్‌ లేవని చెప్పడంతో ఇటీవల ఆమె డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను ఆశ్రయించింది. ఆయన స్పందించి జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌­బాషాకు ఫోన్‌చేసి పార్వతికి పదోన్నతి కల్పించే అంశంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ అంశాన్ని కలెక్టర్‌ డీఆర్వో సి.వెంకటనారాయణమ్మకు అప్పగించారు. 

ఈ క్రమంలో గురువారం పార్వతితోపాటు డీఎంహెచ్‌వో కార్యాలయ ఏఓ అరుణ, సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు, సీనియర్‌ అసిస్టెంట్‌ సంపత్‌లను డీఆర్వో తన కార్యాలయానికి రావాలని ఆదేశించారు. ఇది పూర్తిగా ఉద్యోగుల సర్వీసు మ్యాటర్‌. అయితే పార్వతితోపాటు జనసేన నాయకుడు హర్షద్‌ కూడా వారి వెంట వెళారు. డీఎంహెచ్‌ఓ కార్యాల­యానికి సంబంధించి కేవలం సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు మాత్రమే రావడం, ఎలాంటి రికార్డులు లేకుండా ఉండటంపై జనసేన నాయకుడు ఆయనపై మండిపడ్డారు. 

డిప్యూటీ సీఎం చెప్పినా ఎందుకు పదోన్నతి ఇవ్వరని శ్రీనివాసులుపై దాడికి యత్నించాడు. అయితే అతను తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన స్వయంగా జిల్లా రెవె­న్యూ అధికారి (డీఆర్వో) సి.వెంకటనారా­యణమ్మ ఎదుటే చోటుచేసుకుంది. 

అయితే పదోన్నతి ఇవ్వా­లంటే డీఎంహెచ్‌వో ఏవో, సూపరింటెండెంట్, సీనియర్‌ అసిస్టెంట్లు లంచం అడిగారని పార్వతి ఆరోపిస్తుండగా..  మరోవైపు సర్వీసు రూల్స్‌  అందుకు అనుమతించడం లేదని అధికారులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement