
తిరుపతి, సాక్షి: పవన్ కల్యాణ్ తనయుడు సింగపూర్‌లో ప్రమాదానికి గురికావడంపై అటు సినీ, ఇటు రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో.. ఆ చిన్నారి ప్రమాదానికి గురికావడం తనను కలిచివేసిందని మాజీ మంత్రి ఆర్కే రోజా అంటున్నారు.
ఈరోజు పవన్‌కల్యాణ్‌గారి చిన్నబాబు మార్క్ శంకర్(Mark Shankar) ప్రమాద వార్త నా మనసుని ఎంతో కలచివేసింది.ఆ చిన్నారి త్వరగా కోలుకొని, దీర్ఘాయుష్ ఆరోగ్యంతో కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అని రోజా ట్వీట్ చేశారు.
ఈరోజు @PawanKalyan గారి చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసును ఎంతో కలచివేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకొని, దీర్ఘాయుష్ మరియు ఆరోగ్యంతో కుటుంబంతో కలసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.#Getwellsoon
— Roja Selvamani (@RojaSelvamaniRK) April 8, 2025
ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 9,45గం. ప్రాంతంలో రివర్ వ్యాలీ రోడ్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బడిలో 80 మంది పిల్లలు ఉన్నారు. అరగంటపాటు శ్రమించి ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మరణించగా.. 15 మంది పిల్లలు, నలుగురు స్టాఫ్ గాయపడ్డారు. ఈ ఘటనపై అక్కడి అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్లలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనయుడు మార్క్ శంకర్ కూడా ఉన్నాడు. దీంతో ఈ ఘటన అంతలా హైలైట్ అయ్యింది. పవన్-అన్నాలెజినోవాల చిన్న కొడుకే మార్క్ శంకర్ పవనోవిచ్(mark shankar pawanovich). ఈ ప్రమాదంలో ఆ చిన్నారి చేతికి, కాళ్లకు గాయాలయ్యాయని.. పొగ కారణంగా శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడ్డాడని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అతని ఆరోగ్యకరంగానే ఉన్నట్లు సమాచారం.