
సాక్షి, వైఎస్సార్: ఏపీలో జనసేన నాయకుడు జోగినేని మణి అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీరామనవమి రోజున ఓ మహిళను కాళ్లతో తన్ని.. తనకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరింపులకు గురిచేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, సదరు బాధితురాలు.. మణి వల్ల తమకు ప్రాణహని ఉందని పోలీసులను ఆశ్రయించారు.
వివరాల ప్రకారం.. పోసాని కృష్ణమురళిపై ఓబులవారిపల్లి పీఎస్‌లో కేసు పెట్టిన జనసేన నాయకుడు జోగినేని మణి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. శ్రీరామనవమి రోజున మణి.. అదే మండలం చెన్నరాజుపోడు గ్రామానికి చెందిన మహిళ రాజేశ్వరిని కాళ్లతో తన్ని దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరింపులకు గురిచేశాడు. అనంతరం, పత్తి రాజేశ్వరిపై దాడి చేశాడు. ఈ సందర్భంగా మణి.. తనకు పవన్ కల్యాణ్, హోం మంత్రి అందరూ తెలుసు. నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ చులకన చేసి మాట్లాడాడు. దీంతో, మణి వల్ల తనకు ప్రాణహాని ఉంది బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇక, జనసేన రాయలసీమ జోన్ కన్వీనర్‌గా జోగినేని మణి కొనసాగుతున్నాడు. అంతకుముందు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను విమర్శించాడంటూ పోసాని కృష్ణమురళిపై మణి కేసు పెట్టిన విషయం తెలిసిందే. అతని ఫిర్యాదు మేరకు అప్పట్లో ఆఘమేఘాలపై పోసానిని అరెస్టు చేశారు పోలీసులు. తాజగా మణి అరాచకాలను బాధితురాలు.. పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.