
సాక్షి, కోనసీమ జిల్లా: ఏపీలో జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీలో రెండు వర్గాల నేతల మధ్య దాడి ఘటన చోటుచేసుకుంది. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన నాయకుడిపై దాడి చేసిన ఘటనలో పార్టీ మండల అధ్యక్షుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జనసేన నాయకుడు తొలేటి ఉమకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లిలో జనసేన పార్టీ నేతల మధ్య విభేదాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. పార్టీ నాయకుడు తోలేటి ఉమపై జనసన మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్, ఆయన అనుచరులు దాడి చేశారు. ఆదివారం అర్ధరాత్రి రాజేష్, అనుచరులు.. ఉమ ఇంట్లోకి చొరబడి కర్రలతో దాడి చేశారు. ఈ దాడి సందర్భంగా ఉమను తప్పించే ప్రయత్నం చేసిన ఆయన భార్యపై కూడా వారు దాడి చేయడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.
రాజేష్ వర్గం.. ఉమపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, అర్ధరాత్రి హుటాహుటిన ఉమను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. ఉమపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న అతడి అనుచరులు.. రాజేష్ కారును ధ్వంసం చేశారు. దాడి ఘటన కారణంగా ఉద్రిక్తత నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. జనసేన మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్, సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆదివారం మధ్యాహ్నం పి.గన్నవరం పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కారణంగానే దాడి జరిగినట్టు పలువురు చెబుతున్నారు.