
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అభిమానులతోపాటు కాపు సామాజిక వర్గం వారందరి గుండెల్లోనూ గునపాలు దించేలా మాట్లాడారు. తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా వాడుకుని వదిలేస్తానని, వారి ఆకాంక్షలకు తగినట్లు పనిచేయడం తన పని కాదన్నట్టుగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో డ్రామా ‘పీ-4’ ప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ తనకు సత్తా లేకపోవడం వల్లనే సమర్థుడు, అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబుకు 2014 నుంచి మద్దతిస్తున్నాని చెప్పడం విని అభిమానులు హతశులయ్యే ఉంటారు.
చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లకు మాత్రం ఈ మాటలు చెవికి ఇంపుగా అనిపించి ఉండవచ్చు. పవన్ మన చెప్పుచేతల్లోనే ఉంటాడులే అని మనసులో ఉప్పొంగిపోయి ఉండవచ్చు కూడా. కానీ.. పదేళ్లుగా పవన్ ఎక్కడకు వెళ్లినా సీఎం, సీఎం అంటూ నినాదాలు చేసే అభిమానుల మాటేమిటి? వాస్తవానికి ఇలాంటి అభిమానులు పవన్ లాంటి నేతను నమ్ముకోవడం వారి దురదృష్టం. ఒక్కటైతే వాస్తవం.. పవన్ ఏనాడూ నిజాయితీగా, నిబద్ధతతో వ్యవహరించలేదు. అభిమానులకు కష్టంగా ఉండవచ్చు కానీ.. ఆయన కేవలం సినిమా గ్లామర్ మాత్రమే ఆయన్ను ఈ స్థాయికైనా చేర్చింది. కాపు సామాజికవర్గం నేతలు చాలా మంది ఈయన కన్నా బాగా వారికి అండగా నిలబడ్డారు. అయినా ఎందుకో వారికి ఈయనపైన అభిమానం పెరిగింది. బహుశా మెగాస్టార్ చిరంజీవి సోదరుడు కావడం, ప్రజారాజ్యం పార్టీని పెట్టినా నిలదొక్కుకోలేకపోయారన్న సానుభూతి కావచ్చు. పవన్ కళ్యాణ్ ఆ లోటును తీర్చి తాము కోరుకున్న విధంగా ముఖ్యమంత్రి అవుతారన్న ఫీలింగ్ కావచ్చు.. వీటన్నిటి రీత్యా వీరంతా మద్దతు ఇచ్చారు.
గతంలో కాపు సామాజికవర్గం వైఎస్సార్‌సీపీకి కూడా బలంగా మద్దతు ఇచ్చినా, 2024లో మాత్రం అత్యధికులు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైపే మొగ్గారన్నది ఎక్కువ మంది విశ్లేషణ. అందులో వాస్తవం కూడా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఈయనకు గాలం వేసి తనవైపు లాగడంలో సఫలమయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా 2019లో ఘోర పరాజయం రీత్యా భయపడి, చంద్రబాబు ఏం చెబితే అది చేశారని అంటారు. జాక్ పాట్ తగిలినట్లుగా కూటమి అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎం, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ మంత్రి అయ్యారు. చంద్రబాబు, పవన్‌లకంటే లోకేశే ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, రెడ్ బుక్ పేరుతో అరాచకాలను ప్రోత్సహిస్తున్నా వీరు మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని చాలామంది చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో అప్పడప్పుడూ తన శాఖను పర్యవేక్షిస్తూ, మిగిలిన టైమ్ లో సనాతని వేషం కట్టడం, ఇతర రాష్ట్రాలలో పర్యటించడం, ఎప్పుడైనా చంద్రబాబుకు అవసరమైతే ఆ పాత్రను పోషించడం, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ను నిందించడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పవన్ మొదటి నుంచి గందరగోళంగానే మాట్లాడుతూ వచ్చారు. ఆయన కావాలని అలా మాట్లాడుతున్నారా? లేక అవగాహన లేక వ్యవహరిస్తున్నారో తెలియదు. గత పదేళ్లలో ఆయన ఎన్ని రకాలుగా మాటలు మార్చారో చెప్పతరం కాదు. తన వ్యక్తిగత జీవితం మొదలు, తన పుట్టిన ప్రదేశం, చదువుకున్న ఊరు, ఇతరత్రా పలు అంశాలపై భిన్నమైన ప్రకటనలు చేసినా ఆయన అభిమానులు, కాపు సామాజికవర్గం వారు ఆదరించారనే చెప్పాలి.
పిఠాపురంలో ఎన్నికలకు ముందు టీడీపీ నేత వర్మ చేతులు పట్టుకుని మీరే గెలిపించాలని అన్నారు. గెలిచిన తర్వాత ఆయన దేముందని తన సోదరుడు నాగబాబు అంటే కనీసం ఖండించలేదు. పిఠాపురం సభలో నలభై ఏళ్ల టీడీపీని తానే నిలబెట్టానని చెప్పారు. కాని ఇప్పుడేమో తనకు సత్తా లేదని అంటారు. తన తండ్రి గురించి సైతం రెండు రకాలుగా మాట్లాడటం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఆయన కమ్యూనిస్టు, దీపారాధన దీపం వద్ద సిగరెట్ ముట్టించుకున్నారని ఒకసారి, ఎప్పుడూ రామజపం చేస్తారని మరోసారి చెప్పి విస్మయ పరిచారు. 2017 తర్వాత తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు, లోకేశ్‌లను ఎంత తీవ్రంగా విమర్శించారో, వారిద్దరిని ఎంత అవినీతిపరులుగా చూపారో, ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా పొగుడుతున్నారు. వారిలో ఇప్పుడు అవినీతి కనిపించడం లేదు. సమర్దత మాత్రమే కనిపిస్తోంది. చంద్రబాబు పదిహేనేళ్లు సీఎంగా ఉండాలని అంటున్నా, భవిష్యత్తులో లోకేశ్ సీఎం అయినా కాదనకుండా పవన్ కళ్యాణ్ విధేయుడుగానే ఉంటారన్నది పలువురి నమ్మకంగా ఉంది.
చంద్రబాబు, లోకేశ్‌లు కూడా ఆ రోజుల్లో పవన్‌ను బాగానే విమర్శించేవారు. అయినా ఇప్పుడు వారు పొగుడుతున్నట్లు నటిస్తున్నారు. రెండు పార్టీలు కలిసి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు గురించి పవన్ కళ్యాణ్ నోరు విప్పడం లేదు కనుక వారికి ఆనందంగానే ఉంటుంది. అలా ఉన్నంతకాలం ఆయన మంచి మిత్రుడుగానే కనిపిస్తారు. ప్రశ్నించడానికి పార్టీని పెట్టానని చెప్పిన పవన్ అసలు ప్రశ్న అంటే ఏమిటో మర్చిపోయారు. గతంలో తన తల్లిని, తనను దూషించారని చెప్పిన టీడీపీని భుజాన ఎత్తుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఏకంగా తనకు సత్తా లేదని చెప్పడం చూస్తే, ఒకరకంగా నిజం చెప్పారని కొందరు, తమ పరువు తీశారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ ఇంతగా దిగజారిపోతారని తాము ఊహించలేకపోయామని ఆయనకు మద్దతు ఇచ్చినవారు వాపోతున్నారు.
కాపు సామాజికవర్గ నేతలు పలువురు ముఖ్యమంత్రి చంద్రబాబుపై హోరాహోరీ పోరాడారు. కాపు రిజర్వేషన్ ఉద్యమం పెద్ద ఎత్తునసాగింది. అలాంటి వారందరిని కాదని, కాపుల రిజర్వేషన్ గురించి, కాపుల కులభావన గురించి పలుమార్లు మాట మార్చిన పవన్‌నే ఈసారి కాపు వర్గం వారు ఎంపిక చేసుకున్నారు. సీఎం అని అభిమానులు నినాదాలు ఇస్తుంటే గతంలో ఓటు వేయండి. సీఎం అవుతానని అనేవారు. ఆ తర్వాత టీడీపీతో పొత్తు అనంతరం తమకు సీఎం అయ్యేంత బలం లేదని, ఎమ్మెల్యేగా గెలవడం ముఖ్యం అన్నట్లు మాట్లాడేవారు. అదే పవన్ కళ్యాణ్ టీడీపీని తానే గెలిపించానని చెబితే టీడీపీ సోషల్ మీడియా ఆయనపై విరుచుకుపడింది. జనసేన మద్దతుదారులను ఒక ఆట ఆడుకుంది. అయినా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు.
తిరువూరులో టీడీపీ ఎమ్మెల్యే తీరుతెన్నులపై అక్కడి జనసేన స్థానిక నేత ఆరోపణలు చేస్తే వాటి గురించి వాకబు చేయకుండా, ఆయనకే నోటీసు ఇవ్వడం విశేషం. దీన్ని బట్టి పవన్ పార్టీని బలోపేతం చేసుకోవడం కన్నా, పదవిని ఎంజాయ్ చేయడం, టీడీపీకి సేవ చేయడం ద్వారా తాను కూడా లబ్ది పొందడానికే పరిమితం అయ్యారని అర్థం అవుతోందని అంటున్నారు. చిత్రం ఏమిటంటే ఏపీలో సత్తా లేదని చెబుతున్న పవన్ కళ్యాణ్ కొద్ది కాలం క్రితం తమిళనాడు వెళ్లి అక్కడ జనసేనను విస్తరిస్తానని చెప్పి వచ్చారు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లుగా ఉందీ వైఖరి. వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసమని, ఆయన నుంచి వచ్చే ప్రయోజనాల కోసమని ఎద్దేవా చేశారు. బీజేపీ ఆడినట్లు పవన్ ఆడతారని కొంతమంది అనుకుంటున్నా, ప్రస్తుతానికి చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి సిద్దంగా ఉన్నారని అంటున్నారు.

ప్రభుత్వపరంగా చూస్తే ఆయన శాఖలలో వేలాది ఫైళ్లు పెండింగులో ఉన్నట్లు చంద్రబాబు సర్కారే ప్రకటించింది. ఇందులో మొదటి ర్యాంకు ఇచ్చింది. అయినా పవన్ దానిపై పెద్దగా ఫీల్ అయినట్లు లేరు. నిజానికి పవన్ కళ్యాణ్ పెద్దగా చదువుకోలేదు. కానీ, వేల పుస్తకాలు చదువుకున్నట్లు కనిపించాలన్నది ఆయన తాపత్రయంగా కొందరు అభివర్ణిస్తుంటారు. అసలు ఏ మనిషి అయినా ఎనభై వేల పుస్తకాలు చదవడం సాధ్యమేనా అని ఒకరు ప్రశ్నించారు. అదేమిటంటే ఒక మనిషి వందేళ్లు జీవిస్తాడనుకుంటే, అందులో మొదటి పదిహేనేళ్ల నుంచి ఇరవై ఏళ్ల వరకు విద్యకు కేటాయించవలసి ఉంటుంది. అలాగే చివర ఇరవై ఏళ్లు కూడా పెద్దగా చదవలేని పరిస్థితి రావచ్చు. మనిషి వందేళ్లు జీవించడం అంటే 36500 రోజులు బతకడం అన్నమాట. రోజూ ఒక పుస్తకం చదవడం ఎక్కువ సందర్భాలలో అసాధ్యం. అందువల్ల ఎవరైనా ఏభై వేల పుస్తకాలనో, ఎనభై వేల పుస్తకాలనో, రెండు లక్షల పుస్తకాలనో చదివేశానని చెబితే అదంతా గ్యాస్ అని ఆయన వివరించారు.
అంటే ఇదంతా రాజకీయ నేతల హిపోక్రసీ అన్నమాట. ప్రభుత్వపరంగా పెద్దగా పని చేయలేక, ఇటు పార్టీ పరంగా నిర్మాణం చేయలేక, ఏదో పదవిని ఎంజాయ్ చేస్తూ ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీని నడపడం కన్నా వేరే పార్టీలో విలీనం చేయడం బెటర్ కదా అని కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ సత్తా ఉపన్యాసాలలో అబద్దాలు చెప్పడంలో మాత్రం బాగానే ఉంది. కానీ, ప్రజలకు ఉపయోగపడటంలో మాత్రం విషయం కొరవడింది. అందుకే ఆయన తనకు సత్తా లేదని అంగీకరించారని అనుకోవచ్చా!.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.