
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త లిక్కర్ పాలసీ(New Liquor Policy) తీసుకురావడం ద్వారా.. విక్రయాల్లో పారదర్శకతకు పెద్దపీట వేశారు. విక్రయాలు ప్రభుత్వం చేతిలోనే ఉండడం వల్ల, బెల్టు షాపులను నూరుశాతం కట్టడి చేయడం అప్పట్లో సాధ్యం అయింది. అయితే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సమయం నుంచి కూడా.. లిక్కర్ అమ్మకాల్లో పెద్ద స్కామ్ జరుగుతున్నట్టుగా దుష్ప్రచారం ప్రారంభించారు.
.. దాదాపు 50వేల కోట్ల దాకా స్వాహా పర్వం జరిగినట్టుగా పదేపదే గోబెల్స్ ప్రచారం చేస్తూ ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చారు. తీరా గద్దె ఎక్కిన తర్వాత.. అన్ని ఆరోపణలు చేసిన లిక్కరు విక్రయాల విషయంలో ఏదో ఒకటిచేయకపోతే పరువు పోతుందనే భయంతో.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. 50వేల కోట్ల అవినీతి అనే ఆరోపణల స్థానంలో.. 3వేల కోట్ల అవినీతి జరిగిందని ఆ సిట్ గణాంకాలను తయారుచేసింది. ఇక విచారణలు ప్రారంభించారు.
జగన్ మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని నిందితుడిగా చేర్చారు. ఆయనను విచారించాలంటే నోటీసులు ఇవ్వడానికి అందుబాటులో లేరని తేల్చారు. ఐటీ సలహాదారుగా అప్పట్లో ఉన్న తనను మద్యం స్కామ్ లో ఎందుకు విచారణకు పిలుస్తారంటూ ఆయన ఇచ్చిన మెయిల్ కు జవాబు లేదు. ఈలోగా.. వైఎస్సార్‌సీపీ రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijaya Sai Reddy)ని సాక్ష్యంగా విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలో.. అసలు విజయసాయిరెడ్డి సాక్ష్యం చెప్పడానికి ఏ రకంగా అర్హుడు? ఆయన సాక్ష్యానికి చట్టబద్ధత ఉంటుందా? చెల్లుబాటు అవుతుందా? అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి.
సాధారణంగా ఒక కుంభకోణం(Scam) జరిగిందని ప్రభుత్వం భావిస్తే దానితో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవారినే విచారణకు పిలవాలి. ఎవరైతే నేరం చేశారని అనుకుంటున్నారో వారిని విచారించడానికి నోటీసులు ఇచ్చే తరహాలోనే.. దానితో సంబంధం ఉందనిపించిన వారిని సాక్షిగా పిలిచి ధ్రువీకరించుకోవచ్చు.
మద్యం డిస్టిలరీల నుంచి భారీగా సొమ్ములు తీసుకోవడం ద్వారా అవినీతికి పాల్పడ్డారనేది ఇక్కడ ఆరోపణ. మహా అయితే డిస్టిలరీల యజమానులను పిలిచి విచారించడానికి అవకాశం ఉంది. అయితే ఈ వ్యవహారంతో ఏ మాత్రం సంబంధం లేని విజయసాయిరెడ్డిని ఏ కారణం చేత సాక్షిగా వివరాలు చెప్పాలని పిలుస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు.
విజయసాయిరెడ్డి వైఎస్సార్‌సీపీ(YSRCP)కి రాజీనామా చేశారు. బయటకు వెళ్లిన తర్వాత పార్టీ మీద ఇప్పుడు రకరకాల నిందలు వేస్తున్నారు. ఇటీవల లిక్కర్ స్కామ్ జరిగిందని ఆయన ధ్రువీకరిస్తూ.. ఆ స్కామ్ కు కర్త కర్మ క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని అన్నారు. ఎవరో మూడో వ్యక్తి.. హఠాత్తుగా తెరమీదకు వచ్చి. ‘ఫలానా స్కామ్ లో ఫలానావాళ్లు అవినీతి చేశారు.. నేను చెబుతున్నాను’ అని చెబితే అది చెల్లుబాటు అవుతుందా? ఈ లెక్కన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వెళ్లిన నాయకులు ఇంకా అనేక మంది ఉన్నారు. వారందరినీ అధికార కూటమి ప్రలోభపెట్టి, బెదిరించి, మభ్యపెట్టి ఏదో ఒక విధంగా.. వైఎస్సార్‌సీపీ నేతల మీద బనాయించిన రకరకాల కేసుల్లో సాక్షులుగా మార్చేస్తే దాని పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయి కదా అనేది పలువురు అభ్యంతరంగా ఉంది.
వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు వచ్చిన వారిని, ఏమాత్రం సంబంధం లేని కేసుల్లో కూడా సాక్షులుగా మార్చేసుకోవడం ఒక సాంప్రదాయంగా మారిందంటే గనుక.. అది అనేక విపరిణామాలకు దారితీస్తుంది. అధికారంలోకి వచ్చిన ప్రతిపార్టీ తమ ప్రత్యర్థుల్ని వేధించడానికి ఒక అడ్డదారిని ఎంచుకున్నట్టుగా అవుతుంది.
విజయసాయిరెడ్డి సిట్ ముందు హాజరైనా సరే.. ఎవరిమీదనైనా నిందలు వేయగలరు. కానీ..ఆ సమాచారం తనకు ఎలా తెలిసిందో సహేతుకంగా నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. ఆయన చెప్పే సాక్ష్యం మూలాలను కూడా నిర్ధారించుకుంటే తప్ప సిట్ పోలీసులు సమర్థంగా వ్యవహరించినట్టు కాదు.. అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
:::ఎం. రాజ్యలక్ష్మి