‘టీడీపీ స్వార్థ రాజకీయాలు ముస్లిం సమాజం గమనిస్తోంది’ | Hafiz Khan Reaction To Supreme Court Order On Waqf Amendment Act | Sakshi
Sakshi News home page

‘టీడీపీ స్వార్థ రాజకీయాలు ముస్లిం సమాజం గమనిస్తోంది’

Apr 17 2025 7:17 PM | Updated on Apr 17 2025 7:43 PM

Hafiz Khan Reaction To Supreme Court Order On Waqf Amendment Act

సాక్షి, కర్నూలు: ‘వక్ఫ్‌ సవరణ చట్టం-2025’పై సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలను స్వాగతిస్తున్నామని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ.హఫీజ్‌ ఖాన్‌ అన్నారు. గురువారం ఆయన కర్నూలు రాయల్‌ ఫంక్షన్ హాల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. వక్ఫ్‌ సవరణ చట్టంపై దేశసర్వోన్నత న్యాయస్థానం ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై ఆయన స్పందించారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం ముస్లిం, మైనార్టీలను అన్యాయం చేశారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇప్పటికైనా ఎన్‌డీఏ నుంచి బయటికి వచ్చి ముస్లిం, మైనార్టీల పక్షాన నిలబడాలని హఫీజ్‌ ఖాన్‌ డిమాండ్‌ చేశారు. హఫీజ్‌ ఖన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..

వక్ఫ్‌ (సవరణ) చట్టం 2025ను సవాల్‌ చేస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై దేశసర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం తరఫున  సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వారం గడువు కోరడం మనం చూశాం. తదుపరి విచారణ వరకు వక్ఫ్‌ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలపడం, వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. ఇది మా ముస్లిం సమాజానికి గొప్ప రిలీఫ్‌.

రాజ్యాంగం మాకు కల్పించిన ప్రాథమిక హక్కులకు విరుద్దంగా కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతి దశలోనూ అడ్డుకుంది. దీనిపై సుప్రీంలో తప్పకుండా మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని మేం బలంగా నమ్ముతున్నాం. ఈ కేసులో సీజేఐ లేవనెత్తిన అంశాలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. వక్ఫ్‌ ఆస్తుల విషయంలో సీజేఐ గారు సొలిసిటర్‌ జనరల్‌ను అడిగిన ప్రశ్నలే మేం ముందు నుంచి అడిగాం. ప్రభుత్వానికి సుప్రిం ఇచ్చిన నిర్ణీత గడువులో వారు సమాధానం ఇవ్వాలి. మా ముస్లింల తరుపున పోరాడిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.

టీడీపీ మాత్రం స్వార్ధ రాజకీయాలు చేసి తడిగుడ్డతో మా ముస్లిం, మైనార్టీల గొంతు కోసింది. వీరి స్వార్థ రాజకీయాలు ముస్లిం సమాజం గమనిస్తోంది. కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒక్క ఏపీలోనే కాదు దేశంలోని ముస్లింలు అంతా కూడా చంద్రబాబు, నితీష్‌కుమార్‌ల వైపు చూశారు, మా హక్కులు అణగదొక్కుతుంటే మా వైపు నిలవకుండా వీరిద్దరూ మైనార్టీల పక్షాన నిలవకుండా బీజేపీ అజెండాను దేశమంతా అమలుచేయడానికి పూర్తిగా సహకరించారు, ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలి, మీపై బాధ్యత ఉంది, మీరు ఎన్‌డీఏ నుంచి బయటికి వచ్చి ముస్లిం, మైనార్టీల పక్షాన నిలబడాలని డిమాండ్‌ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా వైఎస్సార్‌సీపీ ప్రతి అడుగులో కూడా ముస్లిం సోదరుల వెంట నడుస్తుంది, వారి తరపున పోరాడుతుందని హఫీజ్‌ ఖాన్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement