‘సుప్రీం’ నిర్ణయం చంద్రబాబుకు చెంపపెట్టు: వైఎస్సార్‌సీపీ | Ysrcp Leaders Reactions On Supreme Court Decision In Tirumala Laddu Case | Sakshi
Sakshi News home page

‘సుప్రీం’ నిర్ణయం చంద్రబాబుకు చెంపపెట్టు: వైఎస్సార్‌సీపీ

Published Fri, Oct 4 2024 12:52 PM | Last Updated on Fri, Oct 4 2024 4:21 PM

Ysrcp Leaders Reactions On Supreme Court Decision In Tirumala Laddu Case

సాక్షి, తిరుపతి: సీబీఐ సిట్ బృందం విచారణ పూర్తిగా స్వాగతిస్తున్నామని వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుమల లడ్డూ కేసులో సుప్రీం కోర్టు నిర్ణయంపై ఆయన స్పందిస్తూ..  లడ్డూపై కేవలం దురుద్దేశ పూర్వకంగా చంద్రబాబు ఆరోపణలు చేశారన్నారు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందనే నమ్మకం ఉందన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆదేశాలతోనే సుప్రీంకోర్టు ద్వారా ఆదేశాలు వచ్చాయన్నారు. సీబీఐ విచారణ ద్వారా నిజాలు నిగ్గు తేలతాయని, సత్యం వెలుగులోకి వస్తుందని భూమన అన్నారు.

 

న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం: వైవీ సుబ్బారెడ్డి
సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నామని వైఎస్సార్‌సీపీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పొలిటికల్ కామెంట్లు చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పింది. చంద్రబాబు వ్యాఖ్యలతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.

సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిజాలు బయటపెట్టేలా విచారణ జరిపించాలని పిటిషన్ వేశామన్నారు. ఆరోపణలు నిజమైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని చెప్పాము. నా హయాంలో ఏ.ఆర్‌ కంపెనీ నుంచి ఎప్పుడూ నెయ్యి సరఫరా జరగలేదు. కల్తీ జరిగితే ఎలాంటి పదార్థాలు కలిశాయన్నది కూడా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నింద వేసింది కాబట్టి ఇక వెనక్కి వెళ్లొద్దన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. విచారణ ముగిసే వరకు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంటుంది. మా పై చేసిన నిందలు తొలగిపోతాయని అనుకుంటున్నాము. మా సమయంలో కల్తీ జరగలేదు’’ అని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

బాబు అబద్ధాలు తేటతెల్లమయ్యాయి: రవీంద్రనాథ్‌రెడ్డి
తిరుమల లడ్డు కల్తీ ఆరోపణలపై సుప్రీం కోర్టు సిట్ వేయడం చంద్రబాబుకు చెంపపెట్టని, ఇప్పటికైనా చంద్రబాబు దేవుడిని తన స్వార్ధ రాజకీయాలకు వాడుకోవడం మానుకోవాలని వైఎస్సార్‌సీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వరుని భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారని, లడ్డూలో కల్తీ నెయ్యి వాడకపోయినా కల్తీ జరిగిందంటూ చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేశారని ఆయన అన్నారు. నేటి సుప్రీం కోర్టు తీర్పుతో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలని తేటతెల్లమయ్యాయని, సీబీఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు  రవీంద్రనాథ్‌రెడ్డి చెప్పారు.

స్వ‌తంత్ర ద‌ర్యాప్తుతో వాస్త‌వాలు బ‌య‌టికి..: ఆర్కే రోజా
శ్రీ‌వారి ల‌డ్డూ వివాదంలో సుప్రీంకోర్టు నిర్ణయం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం’’ అని మాజీ మంత్రి ఆర్కే రోజా ట్వీట్‌ చేశారు. సున్నిత‌మైన భ‌క్తుల మ‌నోభావాల‌తో కూడుకున్న శ్రీ‌వారి ప్ర‌సాదాల విష‌యంలో రాజ‌కీయ దురుద్దేశ‌పూరిత వ్యాఖ్య‌లు మానుకుంటే మంచిదని ఆమె హితవు పలికారు.

‘‘మొద‌టి నుంచి మేము భావిస్తున్న‌ది రాష్ట్ర ముఖ్య‌మంత్రే విచార‌ణ‌, ఆధారాల‌తో సంబంధం లేకుండా రాజ‌కీయ ఆరోప‌ణ‌లు చేసిన నేప‌థ్యంలో వారి ప‌రిధిలోని విచార‌ణ‌తో నిజాలు బ‌య‌టికి రావ‌ని స్వ‌తంత్ర ద‌ర్యాప్తు సంస్థ కావాల‌ని కోరుకున్నాం. కేంద్ర ప్ర‌భుత్వం కూడా సిట్ స‌రిపోద‌ని, కేంద్ర ప్ర‌భుత్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో విచార‌ణ జ‌ర‌గాల‌నే వాద‌న‌తో మా డిమాండ్‌కు విశ్వ‌స‌నీయ‌త పెరిగింది. సుప్రీం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో స్వ‌తంత్ర ద‌ర్యాప్తుతో వాస్త‌వాలు బ‌య‌టికి వ‌స్తాయ‌ని, త‌ద్వారా గాయ‌ప‌డిన కోట్లాది మంది భ‌క్తుల మ‌నోభావాల్ని పున‌రుద్ధ‌రించిన‌ట్టు అవుతుంద‌ని తిరుప‌తి ఆడ‌బిడ్డ‌గా న‌మ్ముతున్నాను..!!’’ అని ఆర్కే రోజా ట్వీట్‌ చేశారు.

 

చంద్రబాబు, పవన్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: కొట్టు సత్యనారాయణ 
స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయడం స్వాగతిస్తున్నామని మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు వంద రోజుల పరిపాలన ఫెయిల్యూర్‌ని కప్పిపుచ్చుకొని లడ్డూ రాజకీయం చేశారు. సుప్రీంకోర్టు ధర్మాసనం కోట్లాది మంది హిందువుల మనోభావాలు నిలబెట్టింది. దుర్మార్గుడైన ముఖ్యమంత్రి రాజకీయ క్రీడలకు ఇది చెంపపెట్టు. లడ్డూ వివాదంపై ఇప్పటికైనా ప్రభుత్వం పుల్ స్టాప్ పెట్టి సుప్రీంకోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉండాలి.

ఇదీ చదవండి: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ

..స్వతంత్ర సిట్ కమిటీ చంద్రబాబు పవన్ కల్యాణ్‌లను కూడా విచారణ చేయాలి. కల్తీ లడ్డూలు అయోధ్య రామలయానికి కూడా పంపారంటూ పవన్‌ వ్యాఖ్యానించారు. ఏ ఆధారాలతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.? ఎవరు స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్టు మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మంలో బ్రాహ్మణ ఇతరులు సైతం కూడా ఆచరించే ఆగమాలు సైతం ఉన్నాయి. సనాతన ధర్మంపై పవన్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని కొట్టు సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

సుప్రీంకోర్టు నిర్ణయం స్వాగతిస్తున్నాం: కాకాణి
సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకి చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. మొదటి నుంచి వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్న దానినే సుప్రీంకోర్టు ఏకీభవించినట్లు అనిపించిందన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ద్వారా నిజానిజాలు బయటికి రావు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు  ఏర్పాటు అయ్యే  స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారానే నిజాలు బయటికి వస్తాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉండాలి హిందూ భక్తులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. రాజ్యాంగం, కోర్టుల గురించి పవన్‌కు అవగాహన లేదు. హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదు. వారాహి డిక్లరేషన్‌లో పవన్ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణ కింద పరిగణలోకి తీసుకోవాలి.

చంద్రబాబు రాజకీయ పతనం ఆరంభమైంది: తోపుదుర్తి
తిరుపతి లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పుపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి స్పందిస్తూ.. తిరుపతి లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది.  సుప్రీంకోర్టు.. చంద్రబాబుని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మడం లేదు. చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం భగవంతున్ని సైతం వదలకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు. చంద్రబాబు రాజకీయ పతనం ఆరంభమైంది. చంద్రబాబు సుప్రీం కోర్టు నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, లేదంటే రాజీనామా చేయాలి’ అని తోపుదుర్తి డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement