కక్ష సాధింపు కోసమేనా పోలీసులు?.. ఇది దేనికి సంకేతం: సజ్జల | Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu And Police | Sakshi
Sakshi News home page

కక్ష సాధింపు కోసమేనా పోలీసులు?.. ఇది దేనికి సంకేతం: సజ్జల

May 12 2025 6:01 PM | Updated on May 13 2025 11:37 AM

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu And Police

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను నీరు గారుస్తూ.. రాజకీయ కక్ష సాధింపులకు వినియోగిస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం అందుబాటులో ఉన్న పార్టీ నాయకులతో ఆయన  భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ కక్షసాధింపు చర్యలు, పోలీసులను వినియోగించుకుంటున్న తీరు, దిగజారిన శాంతిభద్రతలు, తాజాగా మాజీ మంత్రి విడదల రజిని పట్ల స్థానిక సీఐ అమానుషంగా వ్యవహరించిన వైనంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.

ఈ సందర్భంగా పలువురు నాయకులు రాష్ట్రంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలపై ఉదాహరణలతో సహా సమావేశంలో ప్రస్తావించారు. తాజాగా మాజీ మంత్రి విడదల రజిని పట్ల పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు రాష్ట్రంలో పోలీసుల ద్వారా ప్రభుత్వం చేయిస్తున్న దౌర్జన్యకాండకు నిదర్శనమని పలువురు నాయకులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, పోలీస్ యంత్రాంగాన్ని తప్పుదోవలో నడిపిస్తున్న వైనంను ప్రజలు ముందు పెట్టేందుకు వైఎస్సార్‌సీపీ ఒక కార్యాచరణను సిద్ధం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి సర్కార్ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తోందని, ఎవరైనా ప్రభుత్వ వైఫ్యలాలను నిలదీస్తే పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు సైతం కేసుల నమోదులో చట్టపరమైన నిబంధనలను పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం దారుణ అన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయాయని, డీజీపీకి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఇవ్వక పోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

ప్రశ్నించే గొంతులు నొక్కేందుకే పోలీసులు కూటమి అరాచకాలపై సజ్జల ఫైర్

ఎన్ని సార్లు డీజీపీ అపాయింట్‌మెంట్ కోరినా స్పందించపోవడం దేనికి సంకేతమని నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వైఎస్సార్‌సీపీ సీరియస్‌గా తీసుకుంటోందని, వ్యవస్థలను కాపాడేందుకు బాధ్యత గల ప్రతిపక్షంగా దీనిపై స్పందిస్తుందన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, జోగి రమేష్, విడదల రజిని, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్‌రావు, అన్నాబత్తుని శివకుమార్, పార్టీ నాయకులు దేవినేని అవినాష్, వేమారెడ్డి, పోతిన మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement