
గుంటూరు, సాక్షి: ఏపీలో కూటమి ప్రభుత్వ(Kutami Prabhutvam) ప్రతీకార పాలన కొనసాగుతోంది. నిత్యం వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, ఆరోపణలు, తప్పుడు కేసులతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో తాజాగా.. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో- ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసుకుని ఎల్లో మీడియాతో అడ్డగోలు కథనాలను అచ్చేయిస్తోంది.
సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం కడప జిల్లా సీకేదిన్నె మండల పరిధిలోని అటవీ భూములు ఆక్రమించిందనే ఆరోపణలను కూటమి అనుకూల మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి. అయితే ఈ కథనాలపై వైఎస్సార్‌సీపీ భగ్గుమంది. కబ్జా కథనాలను తీవ్రంగా ఖండించింది.
‘‘అసలు కబ్జా ఆరోపణలకు ఆస్కారమే లేదు. ఆ మీడియా చానెల్స్ చెప్తున్నట్టుగా కడప సమీపంలోని మామిడి తోటల్లో ఒక్క సెంటు భూమికూడా సజ్జల రామకృష్షారెడ్డికి లేదు. అలాంటప్పుడు కబ్జా అన్న ప్రశ్నే తలెత్తదు. 1995 ప్రాంతంలోనే అంటే ఇప్పటి చంద్రబాబు(Chandrababu) అప్పుడు సీఎంగా ఉన్న సమయంలోనే ఇక్కడ పనికిరాని భూములను సజ్జల, ఆయన సోదరులు కొనుగోలుచేశారు. మామిడితోటలు వేశారు. దీనికి దాదాపు పదేళ్ల తర్వాత సజ్జల రామకృష్షారెడ్డి తన వాటా భూములను సోదరులకు విడిచిపెట్టారు. అప్పటినుంచీ ఆయనకు ఆ భూములతో ఆయనకు సంబంధం లేదు. ఇది జరిగినప్పుడు ఆయన రాజకీయాల్లోకూడా లేరు.
2014లో ఫారెస్ట్, రెవిన్యూ విభాగాల మధ్య ఈ ప్రాంతంలో మొత్తం భూముల విషయమై వివాదం నెలకొంది. ఫారెస్ట్ కిందకు వస్తుందని అటవీశాఖ, ఆ ప్రసక్తే లేదని రెవిన్యూశాఖలు తలోరకంగా చెప్తున్నాయి. ఇరుశాఖలకు మొత్తం రికార్డులు కూడా సజ్జల సోదరులు అప్పగించారు. సంయుక్తంగా సర్వే చేసి ఏదో విషయం తేల్చాలని సజ్జల సోదరులే పలుమార్లు అర్జీలు పెట్టుకున్నారు.
కేవలం సజ్జల రామకృష్షారెడ్డి(Sajjala Ramakrishna Reddy) పై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డమే లక్ష్యంగా ఎల్లోమీడియా ప్రయత్నిస్తోంది. తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారిపై సజ్జల న్యాయపరమైన చర్యలకు దిగుతున్నారు’’ అని వైఎస్సార్‌సీపీ ఒక ప్రకటనలో తెలిపింది.
