మనం చంద్రబాబులాగా కాదు: సజ్జల | Sajjala Ramakrishna Reddy Meets With YSRCP MPPs, Check His Speech Highlights | Sakshi
Sakshi News home page

మనం చంద్రబాబులాగా కాదు: సజ్జల

Published Tue, Dec 3 2024 3:59 PM | Last Updated on Tue, Dec 3 2024 5:42 PM

Sajjala Ramakrishna Reddy Meets With Ysrcp Mpps

సాక్షి, తాడేపల్లి: స్వాతంత్ర్యం వచ్చాక ఎవరూ చేయని సంక్షేమ యజ్ఞం వైఎస్ జగన్ చేశారని.. కానీ 2024 ఎన్నికలు మనకు రకరకాల అనుభవాలను మిగిల్చిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీపీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీలను ఉద్దేశించి ఆయన దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..

‘‘వైఎస్సార్‌సీపీ అనేది అందరికీ అందుబాటులో ఉండే పార్టీ. పార్టీలోని నలుగురు కూర్చుని తీర్మానం చేసుకుని దాన్ని అమలు చేసే పార్టీ మనది కాదు. అభిమానులతో నడిచే పార్టీ ఇది.. అందరి అభిప్రాయాలను తీసుకుని నడిచే పార్టీ. అందరిలోనూ తిరిగి పార్టీని అధికారంలోకి తేవాలన్న కసి ఉంది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఓడిపోవటానికి కారణమేంటనే చర్చ పార్టీలో ఉంది’’ అని సజ్జల పేర్కొన్నారు.

‘‘వైఎస్సార్‌సీపీని లేకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు పన్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని ఆయన అనుకుంటున్నారు. ఐదారు నెలలుగా అందుకు  ఆయన ఏం చేస్తున్నారో చూస్తున్నాం. అందరూ గట్టిగా నిలబడాల్సిన సమయం వచ్చింది. 2019 తర్వాత చంద్రబాబు రెండు మూడేళ్లపాటు అసలు కనపడలేదు. తర్వాత కూడా రకరకాల రాజకీయాలు చేస్తూ వచ్చారు. మనం ఎప్పుడూ జనంలోనే ఉన్నాం. ఇప్పుడు మళ్లీ శక్తి పుంజుకోవాల్సిన అవసరం వచ్చింది

..మన సంక్షేమ పథకాల వలన ప్రజల్లో కూడా చెక్కుచెదరని అభిమానం ఉంది. ప్రజల కోసం మళ్లీ మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వంలో మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చాయి. ఎంత సంపాదించుకోవాలో అంత సంపాదించుకోవటానికి దోపిడీలు చేసేస్తున్నారు. 2014-19 మధ్యలో ఉన్నట్లు కొంతైనా మొహమాటం కూడా లేకుండా దోపిడీ చేస్తున్నారు

..ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారు. సీఎంగా ప్రమాణం చేయకముందే రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారు. ఎన్నికల్లో కూడా పూర్తిస్థాయిలో అక్రమాలు చేశారు. అధికారంలోకి వచ్చాక రోజుకొక కొత్త ఇష్యూతో రచ్చ చేస్తున్నారు. చివరికి తిరుపతి లడ్డూ మీద కూడా రాజకీయం చేశారు. జగన్ ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తే.. చంద్రబాబు అన్నిటినీ ప్రయివేటు పరం చేస్తున్నారు. పోర్టులు, ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, చివరికి రోడ్లు కూడా ప్రయివేటు పరం చేస్తున్నారు. వచ్చిన మెడికల్ కాలేజీ సీట్లను పోగొట్టారు. ఐదు, ఆరు వందల మంది విద్యార్థులకు అన్యాయం చేశారు

..ఇప్పుడు ఏం చేసినా జనం ఏమీ పట్టించుకోరని, ఎన్నికల నాటికి అన్నీ మర్చిపోతారని చంద్రబాబు భావిస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. మన హయాంలో చేసిన మంచి పనులు ప్రజల్లో ఇంకా ఉన్నాయి. మన పార్టీ కార్యకర్తలు, నాయకులకు జనంలో గౌరవం ఉంది. పార్టీ కార్యకర్యక్రమాలను ప్రతిస్థాయిలోనూ గట్టిగా తీసుకెళ్లాలి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా స్వీప్ చేసే అవకాశం ఉంది. చంద్రబాబు మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా ఎవరూ వెనుకడుగు వేయలేదు. కార్యకర్తలు కసిగా పనిచేసి 2019లో గెలిపించారు. మనవెంట నడుస్తున్న వారి బాగోగులు చూసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇదీ చదవండి: ఇక ప్రజా పోరాటాలే.. 4న వైఎస్సార్‌సీపీ రాష్ట్రస్థాయి సమావేశం

..ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ మండలాధ్యక్షులకు ఇకనుంచి కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. అనేక అభివృద్ది కార్యక్రమాలను భుజాన వేసుకుని ఐదేళ్లలో పూర్తి చేయాలనే తపనతో పని చేశాం. దానివలన కొన్ని సమస్యలు వచ్చిన మాట నిజమే. ప్రభుత్వ పనిలో పడి, పార్టీకి ఏం అవసరమో అది చేయలేకపోయాం. ఇకమీదట అలా ఉండదు. మీకే ప్రాధాన్యత ఉంటుంది.

..ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపాల్సిన బాధ్యత ఇప్పుడు మనమీద ఉంది. జడ్పీ అధ్యక్షులతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. సోషల్ మీడియాను యాక్టీవ్ చేయాల్సిన అసవరం ఉంది. సమస్యల మీద ఎంపీపీలు కూడా చిన్న వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టాలి. ఎంపీపీలందరితోనూ వైఎస్‌ జగన్ సమావేశమయ్యే ఏర్పాటు కూడా చేద్దాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement