సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేవారు లేక, గిట్టుబాటుధర అందక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 13వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో తలపెట్టిన ర్యాలీలు, మెమోరాండం సమర్పించే కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైఎస్ జగన్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
..అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వైఎస్సార్‌సీపీ పార్టీ శ్రేణులు, రైతులు సంయుక్తంగా ర్యాలీగా కలెక్టర్ కార్యాలయంకు వెళ్లీ, అధికారులకు మెమోరాండంను సమర్పించాలి. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు మొత్తం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్పాహంగా పాల్గొనాలి.
..ఇది రైతులకు అండగా నిలబడాల్సిన సమయం, సందర్భం. ప్రభుత్వం ధాన్యం సేకరణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, రైతులకు న్యాయం జరిగేలా ఒత్తిడి చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. శాంతియుతంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి కావాలని అనుమతులు నిరాకరించి, కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తే, దానిని కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాం.
కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, రైతులకు అండగా నిలుస్తూ, ఎన్నికల తరువాత వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపడుతున్న ఈ కార్యక్రమంపై జాతీయ స్థాయిలోనూ ఆసక్తి వ్యక్తమవుతుంది. వైఎస్సార్‌సీపీ ఎంత బలంగా ఉందో, ప్రజా సమస్యలపై ఎంత దృఢంగా ఉందో ఈ కార్యక్రమం ద్వారా వెల్లడవుతుంది. జిల్లా పార్టీ అధ్యక్షులు కీలకంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ దీనిని విజయవంతం చేయాలి.
ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులకు అండగా, ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ శ్రేణులు సైతం భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని, రైతుల గొంతుకగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment