YSRCP in Support of Farmers
-
నిరసనల్లో కదం తొక్కిన రైతన్న.. వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు (ఫొటోలు)
-
YSRCP Poru bata: విశాఖ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
విశాఖపట్నం, సాక్షి: కూటమి సర్కార్‌పై పోరుబాటలో భాగంగా.. ఇవాళ అన్నదాతకు అండగా కార్యక్రమం నిర్వహిస్తోంది వైఎస్సార్సీపీ. ఈ క్రమంలో రాష్ట్రమంతా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చింది. అయితే.. కలెక్టరేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.విశాఖ కలెక్టరేట్ వద్దకు వైఎస్సార్సీపీ నేతలతో పాటు భారీగా రైతులు చేరుకున్నారు. అయితే లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తోపులాట జరగ్గా.. మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య గాయపడ్డారు. ఆయన చేతికి గాయమైనట్లు తెలుస్తోంది.మరోవైపు.. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ దాకా వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ క్రమంలో డీఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు ఆ పార్టీ నేతలు. ‘‘ ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. రైతాంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించాం.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్న రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. తక్షణమే.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి... సూపర్ సిక్స్ అని చెప్పి కూటమి ప్రభుత్వం డక్ ఔట్ అయింది. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏడాదికి రూ.20,000 ఇవ్వాల్సిందే. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 18 ఏళ్ల నిండిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ హామీలన్నీ నెరవేర్చాల్సిందే అని గుడివాడ అన్నారు. -
‘రైతును రాజు చేస్తానన్న పవన్ ఎక్కడ?’
గుంటూరు, సాక్షి: ఏపీలో రోడ్డెక్కిన అన్నదాతలకు వైఎస్సార్సీపీ బాసటగా నిలుస్తుందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఆరు నెలలు పూర్తి చేసుకున్నా కూడా.. రైతులకు పెట్టుబడి సాయం అందించలేదని మండిపడ్డారామె. సాక్షితో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మాట్లాడుతూ.. ‘‘టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తోంది. రైతుల సంక్షేమం గాలికి వదిలేసింది. పెట్టుబడి సాయం ఊసే ఎత్తడం లేదు. పైగా వరి ధాన్యం కొనుగోలు చేయకుండా ఆలస్యం చేస్తోంది. అకాల వర్షాలకు వరి ధాన్యం భారీగా తడిసింది. తడిసిన ధాన్యాన్ని రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కచ్చితంగా కొనుగోలు చేయాలి.రైతును రాజు చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ మాటలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి?. ఇచ్చిన మాట ప్రకారం.. రైతులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదుకోవాల్సిందే. రైతులకు అండగా వైఎస్సార్సీపీ ఇవాళ రైతు పోరుబాట అన్ని జిల్లాల్లో నిర్వహిస్తోంది. ఇదీ చదవండి: ఉద్యోగాల పేరుతో టీడీపీ ఎమ్మెల్యే భర్త మోసాలు! -
రైతు కోసం వైఎస్సార్సీపీ పోరుబాట.. వైఎస్ జగన్ ట్వీట్
చంద్రబాబు సర్కార్ మోసాలపై అన్నదాతల నిరసనకు వైఎస్సార్సీపీ బాసట.. అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల వరకు ర్యాలీలు.. -
చంద్రబాబు మోసాలపై రైతుపోరు నేడే
సాక్షి, అమరావతి: రెండు సీజన్లు గడుస్తున్నా పెట్టుబడి సాయం రూ.20 వేలు అందక.. గిట్టుబాటు ధర దక్కక.. ఉచిత పంటల బీమా రద్దుతో ధీమా లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నలకు వైఎస్సార్ సీపీ దన్నుగా నిలిచింది. అన్నదాతను దగా చేస్తున్న కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఆ పిలుపునందుకున్న వైఎస్సార్సీపీ అన్ని జిల్లాల కేంద్రాల్లో శుక్రవారం రైతులతో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనుంది. అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించనున్నారు.కుడి, ఎడమల దగా..కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందుతుందని అన్నదాతలు ఆశించారు. అయితే రెండు వ్యవసాయ సీజన్లు గడిచిపోతున్నా కూటమి సర్కారు పైసా సాయం జమ చేసిన పాపాన పోలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడి సాయం కింద రూ10,718 కోట్లు చెల్లించాల్సి ఉండగా బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లే విదిలించిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. మరోవైపు పంటల బీమా ప్రీమియం బకాయిలను ఎగ్గొట్టి రైతులకు దక్కాల్సిన రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారాన్ని అందకుండా చేసింది. సున్నా వడ్డీ రాయితీ కింద రూ.131.68 కోట్ల ఊసెత్తడం లేదు. రబీలో కరువు సాయం బకాయిలు రూ.319.59 కోట్లు ఎగ్గొట్టింది. ఖరీఫ్ ధాన్యాన్ని కొనే నాధుడు లేక రైతులు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్నెల్లలోనే రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. గత ఐదేళ్ల పాటు వెన్నుదన్నుగా నిలిచిన వైఎస్సార్ ఉచిత పంటల బీమాను కూటమి సర్కారు రాగానే అటకెక్కించడంతో ఆ భారం భరించలేక, బ్యాంకుల చుట్టూ తిరగలేక, అవస్థలు పడలేక అన్నదాతలు పంటల బీమాకు దూరమవుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఏకంగా 70 మంది వరకు రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడగా ఏ ఒక్కరికీ ఆర్థిక సాయాన్ని అందించి ఆదుకోలేదు.రైతన్నకు బాసటగా జగన్..కూటమి ప్రభుత్వం దగా చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నలకు వైఎస్ జగన్ దన్నుగా నిలిచారు. ప్రభుత్వంపై పోరాటానికి పిలుపునిచ్చారు. ఈమేరకు వైఎస్సార్సీపీ శ్రేణులు అన్ని జిల్లా కేంద్రాల్లో రైతులతో కలసి శుక్రవారం భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నాయి. టీడీపీ కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రభంజనంలా కదిలి వచ్చేందుకు రైతన్నలు సన్నద్ధమయ్యారు. అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని పేర్కొంటూ కలెక్టర్లకు డిమాండ్ పత్రాలను అందించనున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో పేర్కొన్న ప్రకారం రైతులకు పెట్టుబడి సాయంగా తక్షణమే రూ.20 వేలు అందించాలని కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు సమర్పించనున్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించాల్సిందేనని.. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. ధాన్యంలో తేమ శాతం లెక్కలతో రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. తక్షణమే ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని.. రైతులపై అదనపు భారం మోపే చర్యలను కూటమి ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేయనున్నారు.నాడు... చెప్పిన దాని కంటే మిన్నగారైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలను పెట్టుబడి సాయంగా అందిస్తానని నాడు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే ఎవరూ అడగకపోయినా సరే ఆ సాయాన్ని రూ.13,500కి పెంచడమే కాదు.. ఐదేళ్లలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా రూ.67,500 అందజేశారు. చెప్పిన దాని కంటే మిన్నగా సాయం అందించి రైతు పక్షపాతినని నిరూపించుకున్నారు. ఇక రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతీ ఎకరాకు యూనివర్శల్ కవరేజీ కల్పిస్తూ ఉచిత పంటల బీమాను అమలు చేశారు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసేలోగా అందించి రైతులకు అండగా నిలిచారు. పంట నష్ట పరిహారమైతే ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగానే రైతుల ఖాతాల్లో జమ చేశారు. సున్నా వడ్డీ రాయితీని ప్రతి ఏటా క్రమం తప్పకుండా జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సచివాలయాలకు అనుబంధంగా నెలకొల్పిన ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన విత్తనాలు, నాన్ సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుల మందులను కూడా రైతుల ముంగిటికే అందించారు. లక్ష మందికి పైగా అభ్యుదయ రైతులతో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా సీజన్‌కు ముందుగానే పంటల ప్రణాళికలు రూపొందించి సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. రైతన్నలు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు, దళారీల ప్రమేయం లేకుండా కళ్లాల నుంచే నేరుగా కొనుగోలు చేశారు. ప్రతీ గింజకు కనీస మద్దతు ధర కల్పించడమే కాకుండా గన్నీ బ్యాగ్స్, లోడింగ్, రవాణా (జీఎల్టీ) భారాన్ని సైతం భరిస్తూ ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. మార్కెట్లో ధరలు పతనమైన ప్రతీసారి మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకొని మద్దతు ధరలకు ఆయా పంట ఉత్పత్తులను సేకరించి రైతన్నలకు ప్రతి అడుగులోనూ అండగా నిలిచారు. ఇలా వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా 2019–24 మధ్య ఐదేళ్లలో అన్నదాతలకు ఏకంగా రూ.1,88,541 కోట్ల మేర ప్రయోజనాన్ని వైఎస్ జగన్ చేకూర్చారు. -
జగన్ పండగ చేస్తే.. చంద్రబాబు దండగ చేశారు: వైఎస్సార్సీపీ
సాక్షి, పల్నాడు జిల్లా: కూటమి ప్రభుత్వం రైతులను నిలువున ముంచేసిందని వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. నరసరావుపేటలో ‘అన్నదాతకు అండగా’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెప్పిన సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. ‘‘రైతులు ఆరుగాలం పండించిన పంటను కొనే నాధుడే లేడు. రేపు(శుక్రవారం) రైతుల తరఫున వైఎస్సార్సీపీ నాయకులు కలెక్టర్లకు మెమోరాండం సమర్పిస్తారని ఆయన చెప్పారు.మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. విత్తనాల కోసం ఎంత ఇబ్బంది పడ్డారో నరసరావుపేటలో మనం ప్రత్యక్షంగా చూశాం. ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు రూ.20 వేలు ఇస్తానన్న చంద్రబాబు రైతుల్ని మోసం చేశాడని ఆమె మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ వ్యవసాయాన్ని పండగ చేశారని.. కూటమి ప్రభుత్వం దండగ చేసిందన్నారు. బస్తాకు 400 రూపాయలు నష్టానికి రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా పెట్టుబడి సాయం అందించాం. ఉచితంగా పంటల బీమా కల్పించాం. ఏ సీజన్లో పంటకు నష్టం వస్తే అదే సీజన్లో ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించాం. కూటమి ప్రభుత్వం రైతుల నడ్డి విరిచేసిందన్నారు.మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు పైన కేసులు బనాయిస్తోంది. ఇదే దృష్టి పాలన పైన పెట్టాలి. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాలికి వదిలేశారు. ప్రజలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’’ అని ఆయన చెప్పారు. -
రైతు కంట కన్నీరు
సాక్షి, అమరావతి: అన్నదాత కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పడరాని పాట్లు పడుతున్నారు. ఏటా సీజన్‌కు ముందే అందే పెట్టుబడి సాయం లేదు. ఉచిత పంటల బీమా అటకెక్కింది. పంటల బీమా పరిహారం జాడలేదు. కరువు సాయం ఊసే లేదు. సున్నా వడ్డీ రాయితీ లేదు. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందడం లేదు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలకు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కనీస మద్దతు ధర దక్కక రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టే దుస్థితి నెలకొంది. ప్రభుత్వ తీరుపై అన్నదాతలు కన్నెర్ర చేస్తున్నారు. ఓవైపు విత్తనాలు, ఎరువుల కోసం ధర్నాలు చేస్తున్నారు. మరోవైపు పండించిన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆందోళన బాటపట్టారు. ఇటీవలే ధాన్యం రాశులతో మండల కేంద్రాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు డిమాండ్‌తో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగడం రాష్ట్రంలో రైతుల దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో ఆర్నెల్ల కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షోభంలో కూరుకుపోయిన రైతులకు అండగా వైఎస్సార్ సీపీ ఆందోళన బాటపట్టింది. ఈ నెల 13వ తేదీన జిల్లా కలెక్టరేట్ల ఎదుట వైఎస్సార్ సీపీ తలపెట్టిన ఆందోళన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన వ్యక్తం చేసేందుకు రైతులు సన్నద్దమవుతున్నారు. అన్నదాతా.. ఎక్కడ సుఖీభవ? అధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తామంటూ సూపర్ సిక్స్‌లో ఇచి్చన హామీని చంద్రబాబు అటకెక్కించేశారు. గత ఐదేళ్లుగా వైఎస్సార్ రైతు భరోసా కింద లబ్ధి పొందిన 53.58 లక్షల మంది రైతులకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలంటే ఏటా రూ.10,718 కోట్లు అవసరం. కానీ బడ్జెట్లో కేవలం రూ.వెయ్యి కోట్లు మాత్రమే విదిలించి చేతులు దులిపేసుకున్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ముగిసింది. రబీ సీజన్ ప్రారంభమై 40 రోజులు దాటింది. కేంద్రం రెండు విడతల్లో పీఎం కిసాన్ సాయం అందించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్క విడత కూడా పెట్టుబడి సాయాన్ని జమ చేసిన పాపాన పోలేదు. అన్నదాత సుఖీభవ కోసం విధివిధానాల రూపకల్పన కూడా జరగలేదు. పెట్టుబడిసాయం అందక, సకాలంలో రుణాలు దొరక్క గత రెండు సీజన్లలో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పంటల బీమాకు దూరం రైతులపై పైసాభారం పడకుండా ఐదేళ్ల పాటు నోటిఫై పంటలకు యూనివర్శల్ కవరేజ్ కల్పిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కూటమి ప్రభుత్వం అటకెక్కించేసింది. 2023–24 సీజన్‌కు సంబంధించి రైతులతో సహా రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి రూ.930 కోట్ల ప్రీమియం మొత్తాన్ని జమ చేయకపోవడం వల్ల ఆ సీజన్లో కరువు వల్ల పంటలు దెబ్బతిన్న దాదాపు 15 లక్షల మంది రైతులకు రూ.1,385 కోట్ల బీమా పరిహారం అందకుండా పోయింది. రబీ సీజన్ నుంచి స్వచ్ఛంద నమోదు పద్ధతిలో పంటల బీమా అమలు చేస్తుండడంతో ప్రీమియం భరించలేక రైతులు పంటల బీమాకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. రబీలో ఇప్పటి వరకు 16.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే బీమా కవరేజ్ పొందిన విస్తీర్ణం కేవలం 65 వేల ఎకరాలు మాత్రమే. ప్రీమియం భారం రైతుల నెత్తిన వేయడంతో ఈ సీజన్లో రూ.350 కోట్లకుపైగా భారం భరించలేక పంటల బీమాకు దూరమవుతున్నారు. కరువు సాయం అందక అగచాట్లు వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్–2023 సీజన్లో పంటలు నష్టపోయిన 8.89 లక్షల మంది రైతులకు రూ.1,126.31 కోట్లు జమ చేశారు. సాంకేతిక కారణాల వల్ల 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు జమ కాలేదు. రబీ–2023–24 సీజన్లో కరువు ప్రభావం వల్ల 2.52 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్న పంటలకు గాను 2.32 లక్షల మంది రైతులకు రూ.164.05 కోట్ల కరువు సాయం చెల్లించాల్సి ఉంది. ఈ రెండు బకాయిలు కలిపి 3.91 లక్షల మంది రైతులకు రూ.327.71 కోట్ల కరువు సాయం ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతోంది.ఇక ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో కురిసిన వర్షాల వల్ల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తొలుత 16 జిల్లాల్లో 1.65 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, చివరికి నాలుగు జిల్లాల్లో 54 వేల ఎకరాలకు పరిమితం చేశారు. 29,944 మంది రైతులకు రూ.37.33 కోట్లు పరిహారం చెల్లించాలని లెక్కతేల్చగా ఆచరణకు వచ్చేసరికి కేవలం 23వేల మందికి రూ.25.75 కోట్లకు కుదించేశారు. ఆ పరిహారం నేటికీ జమ చేయలేదు. సెప్టెంబర్ లో కురిసిన భారీవర్షాలు, వరదలకు తొలుత 6 లక్షల ఎకరాల్లో పంటలతో పాటు పెద్ద ఎత్తున పాడి రైతులకు జరిగిన నష్టానికి సంబంధించి రూ.557 కోట్ల పరిహారం ఇవ్వాలని అంచనా వేయగా చివరికి 2.15 లక్షల మందికి రూ.319.59 కోట్లకు కుదించేశారు. సాంకేతిక కారణాలతో లక్షలాది మందికి నేటికీ పరిహారం అందక పడరాని పాట్లు పడుతున్నారు. మరొక పక్క వర్షాభావ పరిస్థితుల వల్ల కరువుతో అల్లాడుతున్న రాయలసీమ జిల్లాల్లో కంటి తుడుపుగా కరువు మండలాల ప్రకటన చేసిన ప్రభుత్వం ఆయా జిల్లాల రైతులను ఆదుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. కలసిరాని సాగు.. ఆదుకోని ప్రభుత్వం ప్రభుత్వ నిర్వాకానికి తోడు వైపరీత్యాల ప్రభావంతో ఖరీఫ్‌తో పాటు రబీ సాగు కూడా రైతులకు కలిసిరావడం లేదు. పెట్టుబడుల కోసం పడరాని పాట్లు పడ్డారు. రూ.3–5 వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ సాగు చేసినా వైపరీత్యాల ప్రభావంతో పంటలు దెబ్బతినడంతో పాటు ఆశించిన దిగుబడులు రాక లక్షలాది మంది రైతులు నష్టాలపాలయ్యారు. చేతికొచ్చిన పంటలు అమ్ముకునే సమయంలో మార్కెట్లో ధరలేక ధాన్యం రైతులతో పాటు పత్తి తదితర పంటల రైతులకు పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొంది. ఓ వైపు ముమ్మరంగా కోతలు జరుగుతున్న దశలో విరుచుకు పడిన ఫెంగల్ తుపాన్ ప్రభావంతో చేతికొచ్చిన పంట దెబ్బతిని మరింత నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో తమ రెక్కల కష్టార్జితాన్ని దళారీల పాల్జేయాల్సిన దుస్థితి రైతులకు దాపురించింది.తేమ శాతం సాకుతో దోపిడీ..కేంద్ర ప్రభుత్వం ధాన్యం సాధారణ రకానికి క్వింటా రూ.2300, ఏ–గ్రేడ్‌కు రూ.2320గా మద్దతు ధర ప్రకటించింది. అంటే 75 కేజీల బస్తాకు సాధారణ రకానికి రూ.1725, ఏ–గ్రేడ్‌కు రూ.1740 గిట్టుబాటు ధర చెల్లించాలి. కానీ కూటమి ప్రభుత్వ పాలనలో 75 కేజీల బస్తాకు రూ.400 నుంచి రూ.500 వరకు రైతు నష్టపోతున్నారు. రైతు సేవా కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యాన్ని తేమ శాతాన్ని బట్టి ధర నిర్ణయించాల్సిన అధికారులు మిల్లర్లు చెప్పిన ధరకు అమ్ముకోమంటూ సలహాలిస్తున్నారు. మరోవైపు మార్కెట్లో మద్దతు ధరకు మించి రేటు పలికే ఎంటీయూ 1262, ఎంటీయూ 1318, బీపీటీ 5204 వంటి ఫైన్ వెరైటీస్‌కు కూడా ఈసారి మద్దతు ధర కూడా దక్కడం కష్టంగా ఉంది. 75 కేజీల బస్తా రూ.1300–1500 మధ్య కొనే పరిస్థితి నెలకొంది. కోసిన ధాన్యాన్ని కొనే నాధుడు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. గోనె సంచుల కొరత తీవ్రంగా ఉంది. ఆరబోతకు కూలీల కొరత వేధిస్తోంది. కూలీల ఖర్చులు, పంటను కాపాడుకునేందుకు టార్పాలిన్స్కు ఎకరాకు రూ.వెయ్యి వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.ఆందోళన కలిగిస్తున్న రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్న రైతులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కేవలం ఆర్నెల్ల వ్యవ«ధిలోనే సుమారు 70 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యలకు ఒడిగట్టడం రాష్ట్రంలో రైతుల దయనీయ పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తోంది. అత్యధికంగా ఒక్క కర్నూలు జిల్లాలోనే 30 మందికి పైగా బలవన్మరణం చెందారు. రాయలసీమ జిల్లాలతో పాటు కోస్తాంధ్ర, గోదావరి జిల్లాల్లో కూడా రైతు ఆత్మహత్యలకు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు కుటుంబానికీ కూటమి సర్కారు పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు.జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే..అదే వైఎస్ జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే.. జూన్‌లో అన్నదాతకు తొలి విడత వైఎస్సార్ రైతు భరోసా సాయం అందేది. గడిచిన సీజన్ మాదిరిగానే ఈ ఏడాది కూడా 53.58 లక్షల మందికి మేలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4,000 చొప్పున పెట్టుబడి సాయాన్ని జమ చేసేవారు. ఖరీఫ్–2023 సీజన్‌కు సంబంధించి రూ.1,385 కోట్ల బీమా పరిహారం అందేది. కరువు సాయం బకాయిలు రూ.327.71 కోట్ల కూడా జమ చేసేవారు. సున్నా వడ్డీ రాయితీ కింద సుమారు రూ.130 కోట్ల వరకు జమయ్యేది. ఖరీఫ్ సీజన్లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతీ రైతుకు పూర్తి స్థాయిలో పరిహారం జమయ్యేది. -
ఇది రైతుల పక్షాన నిలబడాల్సిన సమయం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేవారు లేక, గిట్టుబాటుధర అందక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 13వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో తలపెట్టిన ర్యాలీలు, మెమోరాండం సమర్పించే కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైఎస్ జగన్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు...అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు, రైతులు సంయుక్తంగా ర్యాలీగా కలెక్టర్ కార్యాలయంకు వెళ్లీ, అధికారులకు మెమోరాండంను సమర్పించాలి. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు మొత్తం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్పాహంగా పాల్గొనాలి...ఇది రైతులకు అండగా నిలబడాల్సిన సమయం, సందర్భం. ప్రభుత్వం ధాన్యం సేకరణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, రైతులకు న్యాయం జరిగేలా ఒత్తిడి చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. శాంతియుతంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి కావాలని అనుమతులు నిరాకరించి, కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తే, దానిని కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాం.కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, రైతులకు అండగా నిలుస్తూ, ఎన్నికల తరువాత వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపడుతున్న ఈ కార్యక్రమంపై జాతీయ స్థాయిలోనూ ఆసక్తి వ్యక్తమవుతుంది. వైఎస్సార్సీపీ ఎంత బలంగా ఉందో, ప్రజా సమస్యలపై ఎంత దృఢంగా ఉందో ఈ కార్యక్రమం ద్వారా వెల్లడవుతుంది. జిల్లా పార్టీ అధ్యక్షులు కీలకంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ దీనిని విజయవంతం చేయాలి.ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులకు అండగా, ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని వైఎస్సార్సీపీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ శ్రేణులు సైతం భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని, రైతుల గొంతుకగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
‘రైతులను ముంచేసిన కూటమి సర్కార్’
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ముంచేసిందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మండిపడ్డారు. ఈ నెల 13వ తేదీన రైతుల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తామని తెలిపారు. ఆ పార్టీ కార్యాలయంలో బుధవారం.. ‘అన్నదాతకు అండగా’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట ఇంఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, వైఎస్ జగన్ రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులకు పెట్టుబడి సాయం అందించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆర్బీకే సెంటర్లు లేకుండా పోయాయి. రైతుల కోసం బడ్జెట్లో ప్రస్తావించకుండా కూటమి సర్కార్ మోసం చేసింది. సూపర్ సిక్స్‌లో చెప్పిన పెట్టుబడి సాయం గురించి కూటమి నేతలు మాట్లాడటం లేదు. కనీస మద్దతు ధర కూడా రైతుకు దక్కకుండా చేస్తున్నారు’’అని అవినాష్ నిలదీశారు.దయనీయ స్థితిలో రైతులుతన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ, రైతులకు కనీసం గోనె సంచులు కూడా అందించడం లేదని మండిపడ్డారు. ధాన్యం రవాణాకు జీపీఎస్ ఉన్న వాహనాలు ఉండాలని నిబంధన పెట్టారు. గతంలో సబ్సిడీపై రైతులకు టార్పాలిన్ పట్టాలిచ్చేవారు. ఈ కూటమి ప్రభుత్వం టార్పాలిన్ పట్టాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది. రైతులు దయనీయమైన స్థితిలో దళారులకు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తుంది’’ అని మండిపడ్డారు.రైతులంటే చంద్రబాబుకు చిన్నచూపువిజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, కళ్లాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే ఉంది. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. ధాన్యం రంగుమారిపోతున్నా కొనడం లేదు. రైతులంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే. రైతులను మోసం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది’’ అని ఆమె ధ్వజమెత్తారు. -
రైతుల తరపున పోరాడతాం: భూమన
సాక్షి,తిరుపతి:కూటమి ప్రభుత్వం రైతులకు పెద్ద ఎత్తున సహాయం చేస్తామని చెప్పి మోసం చేసిందని, చంద్రబాబు మొదటి నుంచి రైతు వ్యతిరేకి అని వైఎస్సార్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు.‘అన్నదాతకు అండగా’ పేరుతో ఈ నెల 13 నుంచి వైఎస్సార్సీపీ చేపట్టనున్న నిరసన కార్యక్రమాల పోస్టర్‌ను భూమన మంగళవారం(డిసెంబర్10) విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.‘ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సహాయం చేస్తామని,వరికి మద్దతు ధర ఇస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి 6 నెలలయినా రైతులను పట్టించుకోక పోవడం దారుణం.20 ఏళ్ల క్రితమే చంద్రబాబు రైతు వ్యతిరేకి, ఉచిత కరెంటు ఇస్తామని ఆనాడు వైఎస్సార్ చెబితే హేళన చేసిన వ్యక్తి చంద్రబాబు.రూ.86 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని 2014లో మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. రైతుల పక్షాన పోరాటం చేస్తాం. ఈనెల 13న తిరుపతి జిల్లా కలెక్టరేట్ ముందు నేతలు ఆర్కే రోజా, అభినయ్,మోహిత్,రాజేష్,మధుసుధన్‌రెడ్డితో కలిసి నేను నిరసనలో పాల్గొంటా. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట పూతలపట్టు పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ సునీల్,విజయానందారెడ్డి కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతాం. విద్యుత్ చార్జీలు పెంపునకు వ్యతిరేకంగా ఈ నెల 27న నిరసన కార్యక్రమాలు చేపడతాం. డిస్కంల ఎదుట ఆందోళన చేస్తాం’అని భూమన తెలిపారు. -
‘అన్నదాతకు అండగా వైఎస్సార్సీపీ’..పోస్టర్ ఆవిష్కరించిన నేతలు
సాక్షి,తాడేపల్లి:అన్నదాతకు అండగా వైఎస్సార్సీపీ నినాదంతో ఈనెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి,రుహుల్లా తదితరులతో కలిసి అంబటి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ‘అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లకు వెళ్లి వినతిపత్రాలు ఇస్తాం. వరి రైతులను ఆదుకోవాలనేది మా నినాదం. రాష్ట్రంలో వరి వేసిన రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మంగళగిరిలో రాసులుగా పోసిన ధాన్యాన్ని చూసి రైతులతో మాట్లాడా. ఈ ఏడాది అకాల వర్షాలతో రైతులు చాలా నష్టపోయారు.ధాన్యం దిగుబడి తగ్గిపోయింది. రైతులకు కనీస మద్దతుధర దక్కడం లేదు.మంత్రి నాదెండ్ల ప్రతీ గింజా ప్రభుత్వమే కొంటుందని చెప్పారు.ఒక్క మెసేజ్ పెడితే ధాన్యం కొనేస్తామన్నారు. రెండు రోజులైనా రైతులు హాయ్ పెట్టినా..ఫోన్లు చేసినా ఎవరూ స్పందించడం లేదు. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు.దళారులు ఎంటరైపోతున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకే ధాన్యం కొంటున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కనీస మద్దతు ధరకంటే ఎక్కువకే ధాన్యాన్ని కొన్నాం.ఈ ప్రభుత్వంలో కనీస మద్దతు ధర కూడా రావడం లేదు. వానల భయంతో రైతులు ఎంతో కొంతకు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. రైతులకు అండగా నిలవాలని వైఎస్ జగన్ ఆదేశించారు. చంద్రబాబు ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం.రైతులకు 20 వేలు ఇస్తామన్నారు కానీ నయాపైసా ఇవ్వలేదు. రైతుల వద్ద ధాన్యం కొంటే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. ధాన్యం కొని రైతులను ఆదుకోవాలి’అని అంబటి డిమాండ్ చేశారు. -
‘బరితెగించిన ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ పోరాటం’
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సమస్యలపై కూటమి సర్కార్‌తో పోరాడాల్సిన సమయం వచ్చిందని.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజాపక్షాన నిలబడాల్సిందేనని వైఎస్సార్సీపీ నేతలకు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు ఇచ్చారు. ఈ పోరాటంలో రాజీ ప్రస్తావన ఎంతమాత్రం ఉండబోదని స్పష్టం చేశారాయన. మంగళవారం వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రజా పోరాట కార్యాచరణను ఈ సందర్భంగా ఆయన వాళ్లతో చర్చించారు. ఈ సమావేశంలో ఆయన ఏమన్నారంటే.. ‘ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ ఉందనే మెసేజ్ బలంగా వెళ్ళాలి. వారి గొంతుకగా మనం ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ప్రజా సమస్యలపై ప్రభుత్వం దిగివచ్చేవరకూ మనం వారికి అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. బరితెగించి వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాడుదాం’ అని పార్టీ నేతలతో అన్నారు. 👉అధికారం చేపట్టిన తొలిరోజు నుంచే నుంచే అధికార తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ సహా హామీలను వేటినీ నిలబెట్టుకోలేకపోయింది.పైగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేసిన పనులను, నెలకొల్పిన వ్యవస్ధలను ఈ కూటమి ప్రభుత్వం నాశనం చేసింది. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన పథకాలను.. వాళ్లకు అందకుండా చేశారు. ఇంటింటికే డెలివరీలాంటి వ్యవస్థలను కూకటివేళ్లతో పెకిలించారు. ఇదేకాదు..👉రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అణిచివేతకు గురవుతున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి గొంతు నొక్కుతున్నారు. కుట్ర పూరితంగా కేసులు నమోదు చేస్తూ భయానక వాతావరణం సృష్టించారు. ఈ పరిస్థితుల నడుమ ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా స్పందించాల్సిన సమయం వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ప్రజల పక్షంగా వారి తరపున నిలబడాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది.ఈ పోరాట కార్యాచరణను అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన పార్టీలో అందరితో చర్చించి నిర్ణయం ప్రకటించారు. ‘రైతాంగానికి అండగా నిలవాల్సిన సమయం వచ్చింది. వైఎస్సార్సీపీ శ్రేణులంతా రైతాంగం వెంట నడవాలి. రైతులకు సంబంధించి వారికి అండగా నిర్వహిస్తున్న కార్యక్రమం డిసెంబరు 13వ తేదీన చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. వచ్చిన ఆరు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం రూ.17వేల కోట్ల కరెంట్ భారం ప్రజలపై మోపింది. రెండో కార్యక్రమం విద్యుత్ ఛార్జీల భారంపై డిసెంబరు 27న చేపట్టబోతున్నాం. పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టనున్నాం.అదే విధంగా ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వాన్ని నిలదీస్తూ జనవరి ౩వ తేదీన మూడో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాం. ఇప్పటికే 4 క్వార్టర్లు ఫీజు చెల్లించకపోవడంతో విద్యార్ధులకు హాల్ టిక్కెట్లు ఇవ్వకుండా కాలేజీల యాజమాన్యాలు తిరస్కరిస్తున్నాయి. కాబట్టి వాళ్లకు అండగా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం.👉మనం చేసిన మంచినంతా నాశనం చేస్తున్న ఈ ప్రభుత్వ తీరును నిరసిస్తూ... ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేపడుతున్నాం. మనం చేపట్టబోయే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ గట్టిగా తీర్మానం చేసింది. ఎలాంటి రాజీ లేకుండా గ్రామస్ధాయి వరకు అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి. అన్నివర్గాల తరపున పోరాడుతూ.. ప్రభుత్వాన్ని నిలదీయడానికి వైఎస్సార్సీపీ ఏ స్ధాయిలోనైనా అండగా నిలబడుతుందనే విషయం ఆ వర్గాలకు తెలియజేయాలి.👉రైతులకు అండగా వైఎస్సార్సీపీ అనే మొట్టమొదటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టేలా అందరూ ముందుకు రావాలి. ఆయా జిల్లాల్లో చేపట్టబోయే కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రేణులు, రైతులు తరలి వచ్చేలా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో పార్టీ కేడర్ గ్రామస్ధాయి నుంచి జిల్లా స్ధాయి వరకు వెళ్లి ర్యాలీలో పాల్గొనడంతోపాటు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వాలి అని సజ్జల తెలిపారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు, మునిసిపల్ ఛైర్పర్సన్లు, కౌన్సిలర్లు, జేసీఎస్ మండల ఇంఛార్జ్‌లకు ఆయన దిశానిర్దేశం చేశారు. -
ప్రజల తరఫున గొంతెత్తాలి.. సర్కార్‌పై ఒత్తిడి తేవాలి: బొత్స
సాక్షి, కాకినాడ: ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?.. పంట నష్టపోయిన రైతులకు ఎప్పుడు పరిహారం అందిస్తారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కాకినాడలో ఉమ్మడి గోదావరి జిల్లా వైఎస్సార్సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం, మాజీ ఎంపీలు వంగా గీతా, చింతా అనురాధ హాజరయ్యారు.ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, ‘‘విద్యార్థులు, రైతులు, విద్యుత్ బిల్లుల పెంపుపై పోరాటం చేయాలని వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు. ప్రజల తరపున గొంతెత్తాలి.. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఈ నెల 13న రైతు సమస్యలపై కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తాం. ఈ నెల 27న విద్యుత్ బిల్లుల పెంపుపై ఉద్యమిస్తాం. జనవరిలో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఉద్యమిస్తాం’’ అని బొత్స తెలిపారు.