సాక్షి, పల్నాడు జిల్లా: కూటమి ప్రభుత్వం రైతులను నిలువున ముంచేసిందని వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. నరసరావుపేటలో ‘అన్నదాతకు అండగా’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెప్పిన సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. ‘‘రైతులు ఆరుగాలం పండించిన పంటను కొనే నాధుడే లేడు. రేపు(శుక్రవారం) రైతుల తరఫున వైఎస్సార్‌సీపీ నాయకులు కలెక్టర్లకు మెమోరాండం సమర్పిస్తారని ఆయన చెప్పారు.
మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. విత్తనాల కోసం ఎంత ఇబ్బంది పడ్డారో నరసరావుపేటలో మనం ప్రత్యక్షంగా చూశాం. ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు రూ.20 వేలు ఇస్తానన్న చంద్రబాబు రైతుల్ని మోసం చేశాడని ఆమె మండిపడ్డారు.
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ వ్యవసాయాన్ని పండగ చేశారని.. కూటమి ప్రభుత్వం దండగ చేసిందన్నారు. బస్తాకు 400 రూపాయలు నష్టానికి రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా పెట్టుబడి సాయం అందించాం. ఉచితంగా పంటల బీమా కల్పించాం. ఏ సీజన్లో పంటకు నష్టం వస్తే అదే సీజన్‌లో ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించాం. కూటమి ప్రభుత్వం రైతుల నడ్డి విరిచేసిందన్నారు.
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు పైన కేసులు బనాయిస్తోంది. ఇదే దృష్టి పాలన పైన పెట్టాలి. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాలికి వదిలేశారు. ప్రజలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది’’ అని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment