సాక్షి,తాడేపల్లి:అన్నదాతకు అండగా వైఎస్సార్‌సీపీ నినాదంతో ఈనెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీ మంత్రి,వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి,రుహుల్లా తదితరులతో కలిసి అంబటి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ‘అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్‌లకు వెళ్లి వినతిపత్రాలు ఇస్తాం. వరి రైతులను ఆదుకోవాలనేది మా నినాదం. రాష్ట్రంలో వరి వేసిన రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మంగళగిరిలో రాసులుగా పోసిన ధాన్యాన్ని చూసి రైతులతో మాట్లాడా. ఈ ఏడాది అకాల వర్షాలతో రైతులు చాలా నష్టపోయారు.ధాన్యం దిగుబడి తగ్గిపోయింది. రైతులకు కనీస మద్దతుధర దక్కడం లేదు.
మంత్రి నాదెండ్ల ప్రతీ గింజా ప్రభుత్వమే కొంటుందని చెప్పారు.ఒక్క మెసేజ్ పెడితే ధాన్యం కొనేస్తామన్నారు. రెండు రోజులైనా రైతులు హాయ్ పెట్టినా..ఫోన్లు చేసినా ఎవరూ స్పందించడం లేదు. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు.దళారులు ఎంటరైపోతున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకే ధాన్యం కొంటున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు కనీస మద్దతు ధరకంటే ఎక్కువకే ధాన్యాన్ని కొన్నాం.
ఈ ప్రభుత్వంలో కనీస మద్దతు ధర కూడా రావడం లేదు. వానల భయంతో రైతులు ఎంతో కొంతకు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. రైతులకు అండగా నిలవాలని వైఎస్ జగన్ ఆదేశించారు. చంద్రబాబు ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం.రైతులకు 20 వేలు ఇస్తామన్నారు కానీ నయాపైసా ఇవ్వలేదు. రైతుల వద్ద ధాన్యం కొంటే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. ధాన్యం కొని రైతులను ఆదుకోవాలి’అని అంబటి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment