గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సమస్యలపై కూటమి సర్కార్‌తో పోరాడాల్సిన సమయం వచ్చిందని.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజాపక్షాన నిలబడాల్సిందేనని వైఎస్సార్‌సీపీ నేతలకు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు ఇచ్చారు. ఈ పోరాటంలో రాజీ ప్రస్తావన ఎంతమాత్రం ఉండబోదని స్పష్టం చేశారాయన.
మంగళవారం వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ప్రజా పోరాట కార్యాచరణను ఈ సందర్భంగా ఆయన వాళ్లతో చర్చించారు. ఈ సమావేశంలో ఆయన ఏమన్నారంటే..
‘ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ ఉందనే మెసేజ్ బలంగా వెళ్ళాలి. వారి గొంతుకగా మనం ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ప్రజా సమస్యలపై ప్రభుత్వం దిగివచ్చేవరకూ మనం వారికి అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. బరితెగించి వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాడుదాం’ అని పార్టీ నేతలతో అన్నారు.
👉అధికారం చేపట్టిన తొలిరోజు నుంచే నుంచే అధికార తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ సహా హామీలను వేటినీ నిలబెట్టుకోలేకపోయింది.పైగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేసిన పనులను, నెలకొల్పిన వ్యవస్ధలను ఈ కూటమి ప్రభుత్వం నాశనం చేసింది. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన పథకాలను.. వాళ్లకు అందకుండా చేశారు. ఇంటింటికే డెలివరీలాంటి వ్యవస్థలను కూకటివేళ్లతో పెకిలించారు. ఇదేకాదు..
👉రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అణిచివేతకు గురవుతున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి గొంతు నొక్కుతున్నారు. కుట్ర పూరితంగా కేసులు నమోదు చేస్తూ భయానక వాతావరణం సృష్టించారు. ఈ పరిస్థితుల నడుమ ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా స్పందించాల్సిన సమయం వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ప్రజల పక్షంగా వారి తరపున నిలబడాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది.
ఈ పోరాట కార్యాచరణను అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మన పార్టీలో అందరితో చర్చించి నిర్ణయం ప్రకటించారు. ‘రైతాంగానికి అండగా నిలవాల్సిన సమయం వచ్చింది. వైఎస్సార్సీపీ శ్రేణులంతా రైతాంగం వెంట నడవాలి. రైతులకు సంబంధించి వారికి అండగా నిర్వహిస్తున్న కార్యక్రమం డిసెంబరు 13వ తేదీన చేపట్టాలని పార్టీ నిర్ణయించింది.
వచ్చిన ఆరు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం రూ.17వేల కోట్ల కరెంట్ భారం ప్రజలపై మోపింది. రెండో కార్యక్రమం విద్యుత్ ఛార్జీల భారంపై డిసెంబరు 27న చేపట్టబోతున్నాం. పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టనున్నాం.
అదే విధంగా ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వాన్ని నిలదీస్తూ జనవరి ౩వ తేదీన మూడో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాం. ఇప్పటికే 4 క్వార్టర్లు ఫీజు చెల్లించకపోవడంతో విద్యార్ధులకు హాల్ టిక్కెట్లు ఇవ్వకుండా కాలేజీల యాజమాన్యాలు తిరస్కరిస్తున్నాయి. కాబట్టి వాళ్లకు అండగా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం.
👉మనం చేసిన మంచినంతా నాశనం చేస్తున్న ఈ ప్రభుత్వ తీరును నిరసిస్తూ... ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేపడుతున్నాం. మనం చేపట్టబోయే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ గట్టిగా తీర్మానం చేసింది. ఎలాంటి రాజీ లేకుండా గ్రామస్ధాయి వరకు అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి. అన్నివర్గాల తరపున పోరాడుతూ.. ప్రభుత్వాన్ని నిలదీయడానికి వైఎస్సార్‌సీపీ ఏ స్ధాయిలోనైనా అండగా నిలబడుతుందనే విషయం ఆ వర్గాలకు తెలియజేయాలి.
👉రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ అనే మొట్టమొదటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టేలా అందరూ ముందుకు రావాలి. ఆయా జిల్లాల్లో చేపట్టబోయే కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రేణులు, రైతులు తరలి వచ్చేలా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో పార్టీ కేడర్ గ్రామస్ధాయి నుంచి జిల్లా స్ధాయి వరకు వెళ్లి ర్యాలీలో పాల్గొనడంతోపాటు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వాలి అని సజ్జల తెలిపారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు, మునిసిపల్ ఛైర్‌పర్సన్‌లు, కౌన్సిలర్లు, జేసీఎస్ మండల ఇంఛార్జ్‌లకు ఆయన దిశానిర్దేశం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment