
సాక్షి, ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో కూటమి నాయకుల దౌర్జన్యానికి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. పట్టణంలోని ఎల్‌సీకేపురంలో దశాబ్దాలుగా ఉన్న శ్మశాన వాటికకు నకిలీ పట్టాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసి కబ్జా చేసేందుకు జనసేన నాయకుడు తొండమాల రవి యత్నించడం కలకలం రేపింది.
వివరాల ప్రకారం.. ధర్మవరం పట్టణంలోని ఎల్‌సీకేపురంలో సర్వే నంబర్ 649లో భవన నిర్మాణ కార్మికులకు ఇంటి స్థలాల కోసం 30 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో రెండు ఎకరాలకుపైగా మిగులు భూమి ఉండటంతో 2002లో ప్రభుత్వం శ్మశాన వాటికకు కేటాయించింది. అప్పటి నుంచి శివారు ప్రాంత కాలనీ ప్రజలు శ్మశాన వాటికగా ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ స్థలంపై జనసేన నాయకుడు తొండమాల రవి కన్ను పడింది. ఈ రెండు ఎకరాల స్థలాన్ని తన బినామీల పేరిట అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆపై ఆక్రమించుకునేందుకు యత్నించారు.
ఈ క్రమంలో శనివారం జేసీబీలతో స్థలాన్ని చదును చేసేందుకు వెళ్లడంతో స్థానికులు అవాక్కయ్యారు. ఇది శ్మశాన వాటిక స్థలమని, ఎందుకు చదును చేస్తున్నారని ప్రశ్నించారు. తమ స్థలం అంటూ జనసేన నాయకుడు రవి చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జేసీబీలను తీసుకెళ్లాలని భీష్మించారు. చదును పనులను అడ్డుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో జనసేన నేత రవిపై స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి శ్మశాన వాటికను కాపాడాలని కోరారు.