Cemetery occupying
-
స్మశాన వాటికలను సైతం వదలని అక్రమార్కులు
సాక్షి, హైదరాబాద్ : మహానగరంలో గజం భూమి విలువ కనీసం రూ.40వేల నుంచి లక్షలకు పైనే. ఖాళీ జాగా కనిపిస్తే పాగా వేసే భూబకాసురులు శ్మశాన వాటికలను సైతం వదలడం లేదు. ఇప్పటి వరకు శ్మశాన వాటికల స్థలాల్లో అక్రమ దుకాణ సముదాయాలు ఏర్పాటు కాగా, తాజాగా నివాస సముదాయాల కోసం కూడా నిర్మాణాలకు దిగుతున్నారు. నగరంలోని పలు శ్మశాన వాటికల్లో అక్రమ నిర్మాణాలు సాగుతున్న విషయం దృష్టికి రావడంతో వక్ఫ్‌బోర్డు తీవ్రంగా పరిగణించి చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. నిర్మాణాలను నిలిపివేయడంతో పాటు నివాసం ఏర్పాటు చేసుకున్న వారిని తక్షణమే ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది. వక్ఫ్ భూములను అల్లాహ్‌కు చెందిన ఆస్తులుగా పరిగణిస్తారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం గతంలో రాజులు, సంపన్న వర్గాలకు చెందిన వారు మంచి కార్యక్రమాల నిమిత్తం తమ సొంత స్థలాలను ఆధ్యాత్మిక గురువుల పేరిట దర్గాలు, శ్మశాన వాటికలు, మసీదులకు కేటాయించి వక్ఫ్ చేసేవారు. ఇలాంటి భూములను ‘మున్షాయే వక్ఫ్’గా పేర్కొంటారు. ఎక్కువ శాతం శ్మశానవాటికల స్థలాలపై పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. అక్రమార్కుల చెరలో.. ► నగరంలోని పలు శ్మశాన వాటికలు క్రమంగా అక్రమణలకు గురవుతున్నాయి. కోట్ల విలువైన దేవుడి(వక్ఫ్) స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. అందులో కొన్ని మచ్చుతునకలు.. ► మల్లేపల్లిలో గల హజరత్ యూసిఫైన్ దర్గా శ్మశాన వాటికలో కొంత మంది నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు అక్రమంగా దుకాణాలు కూడా వెలిశాయి. ► మాసబ్ ట్యాంక్ ప్రాంతంలోని సయ్యద్ అహ్మాద్‌బాద్షా దర్గాకు సంబంధించిన ఎనిమిది ఎకరాల్లో ముందు భాగంలో సమాధులను తొలగించి దుకాణాల సముదాయాలను నిర్మించుకొని దర్జాగా వ్యాపారాలు సాగిస్తున్నారు. ► పాతబస్తీలోని మిస్రీగంజ్, షంషీర్గంజ్ స్మశాన వాటిక స్థలాల్లో అక్రమంగా దుకాణాల సముదాయాలను నిర్మించారు. ప్రస్తుతం ఆ మడిగల్లో ఒక హోటల్‌తోపాటు పలువ్యాపారాలు సాగుతున్నాయి. ► సైదాబాద్‌లోని హజరత్ ఉజేలాషా దర్గా, హజరత్ సయ్యద్ బాద్షా మహజూద్ సాహెబ్ దర్గాల స్మశాన వాటికల్లో దుకాణాల సముదాయాలతోపాటు నివాస గృహాలు కూడా వెలిశాయి. అక్రమ కట్టడాలను తొలగిస్తాం శ్మశాన వాటిక స్థలాల్లో అక్రమ కట్టడాలను తొలగిస్తాం.అక్రమార్కులు తక్షణమే అక్కడినుండి ఖాళీ చేయాలి, దుకాణాలను సైతం తొలగించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. – సలీం, చైర్మన్, వక్ఫ్‌బోర్డు, తెలంగాణ చదవండి: 16 ఏళ్లుగా భార్య శవంతో బెడ్‌పై.. -
వక్ఫ్ బోర్డు అసమర్థత కనిపిస్తోంది: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ముస్లిం శ్మశాన వాటికలను కబ్జాల నుంచి పరిరక్షించాలన్న పటిషన్‌పై మంగళవారం తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిపింది. ముస్లిం శ్మశాన వాటికల ఆక్రమణలపై నివేదికను వక్ఫ్ బోర్డు కోర్టుకు సమర్పించింది. దీనిపై స్పందించిన హైకోర్టు శ్మశానాల కబ్జాదారులపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించింది. అలాగే కబ్జాలను చాలా సాధారణ అంశంగా వక్ఫ్ బోర్టు చూస్తోందని పేర్కొంది. ఈ విషయంలో వక్ఫ్ బోర్డు అసమర్థత కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. (రాజస్తాన్ ఎడారిలా.. తెలంగాణ) వక్ఫ్ బోర్డు చైర్మన్ మైనార్టీల కోసం పని చేస్తున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. దేవుడికి అంకితమిచ్చిన భూముల రక్షణకు బాధ్యతా యుతంగా ఉండాలని హితవు పలికింది. అయితే సిబ్బంది కొరత వల్ల, కరోనా వేళ మరింత ఇబ్బందిగా ఉందని వక్ఫ్ బోర్డు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మంత్రికి చెబితే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తారు కదా అని హైకోర్టు బదులిచ్చింది. సర్వే నెంబర్ల వారీగా కబ్జాల వివరాలతో స్పష్టమైన నివేదిక ఇవ్వాలని వక్ఫ్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. (ఫీల్డ్ అసిస్టెంట్ల పిటిషన్‌పై హైకోర్టు విచారణ) -
‘శ్మశానం’లో రాజకీయం!
వేములవాడరూరల్: మండలంలోని రుద్రవరం గ్రామ పునరావాస కాలనీలో శ్మశాన వాటికకు 2016లో అప్పటి అధికారులు సర్వే నంబర్ 65, 66, 67 లోని ఆరు ఎకరాల స్థలాన్ని పంచాయతీ అధికారులకు అందజేశారు. మూడేళ్లుగా స్థల యజమాని అప్పగించడంలేదు. తన స్థలం అనుపురం పరిధిలో ఉందని, రుద్రవరం పరిధిలో ఉన్న స్థలాన్నే తీసుకోవాలంటూ యజమాని శ్మశాన వాటికకు కేటాయించిన స్థలానికి అడ్డుపడుతున్నాడు. ఈ ఆందోళన ఎట్టకేలకు కలెక్టర్ వరకు చేరింది. ఈ విషయంపై రుద్రవరం సర్పంచ్ పిల్లి రేణుక కలెక్టర్ కృష్ణభాస్కర్‌ను గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో తమ గ్రామానికి కేటాయించిన శ్మశాన వాటిక స్థలం తమకే దక్కాలని దానికి హద్దులు ఏర్పాటు చేసి తమకు ఇవ్వాల సర్పంచ్‌తోపాటు గ్రామ పెద్దలు కలెక్టర్‌కు విన్నవించారు. స్పందించిన కలెక్టర్ గతంలో ఇచ్చిన విధంగా ఆరెకరాలు ఇవ్వడం కుదరదని, నాలుగు ఎకరాలు రెండు గ్రామాల్లో కలిపి తీసుకోవాలంటూ కలెక్టర్ వారికి తెలిపారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో జిల్లా అధికారులు కూడా ఏమీ చేయలేక గతంలో తమకు కేటాయించిన స్థలం నుండే తగ్గిస్తున్నారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, కలెక్టర్ స్థలాన్ని తగ్గించడంతో తాము న్యాయ పోరాటం చేస్తామని సర్పంచ్ పిల్లి రేణుక తెలిపారు. గతంలో అధికారులే తమకు అన్ని ఆధారాలతో అనుమతులతో స్థలాన్ని అప్పగించారని ప్రస్తుతం ఆ స్థలం నుంచి కొంత స్థలాన్ని తీసుకోవాలని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. తమ వద్ద ఉన్న ఆధారాలతో న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. -
దళితుల మనోభావాలకు సమాధి..!
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఓ గ్రామంలోని దళితులకు తీరని మనోవేదనను మిగుల్చుతోంది. స్వాతంత్య్రం రాక ముందు నుంచి ఉన్న రోడ్డును అధికార పార్టీకి చెందిన నేతకు పట్టాగా రాసి ఇచ్చారు. సీఎం రాక కోసం రాత్రికి రాత్రే శ్మశానాన్ని ఆక్రమించి, శవాలను సైతం పెకలించి తారురోడ్డు వేస్తున్నారు. మనోభావాలు దెబ్బతిన్న దళితులు ఈ నెల 4న సీఎం పర్యటనను అడ్డుకుంటామని స్పష్టం చేస్తున్నారు. తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీలో పట్టణ నిరుపేదల హౌసింగ్ పథకం కింద దాదాపు 1,724 ప్లాట్లను జీ+3 పద్ధతిలో నిర్మించారు. వీటిని ఈ నెల 4న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. దీనికి సర్వే నెం.363లోనే రోడ్డును చూపించారు. ఈ ప్లాట్లకే కాకుండా దళితుల పొలాలకు, పైన ఉన్న దాదాపు 50 ఎకరాల్లో వేసిన 10 వెంచర్లకు సైతం ఈ రోడ్డునే చూపించారు. మట్టిగా ఉన్న ఈ రోడ్డును తారురోడ్డుగా మార్చేందుకు పంచాయతీరాజ్ అధికారులు మంగళవారం ప్రయత్నించారు. అయితే ఈ రోడ్డును తిరుపతికి చెందిన ఓ టీడీపీ నాయకుడు పట్టాగా మార్చుకున్నాడు. తమ పట్టా భూమిలో రోడ్డు ఎలా వేస్తారని అడ్డుకున్నారు. అందేంటి.. 60 ఏళ్లకు ముందు నుంచే రోడ్డుగా ఉంటే పట్టాగా ఎప్పుడు మార్చారు.. అంటూ అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. అధికార పార్టీ నేతలు హైదరాబాదు స్థాయిలో ఒత్తిడి తీసుకురావడంతో అధికారులు వెనకడుగు వేసినట్లు సమాచారం. దళితుల శ్మశానం ఆక్రమణ... ఈ రోడ్డుకు అనుకునే సర్వే నెం.360లో దాదాపు 25 సెంట్లలో తనపల్లి దళితవాడకు శ్మశానం ఉంది. దాదాపు 100 ఏళ్లకు పైనుంచే ఎవరైనా చనిపోతే ఇక్కడే ఖననం చేసేవారు. పాత రోడ్డు స్థలానికి సంబంధించి టీడీపీ నాయకుడికి పట్టా ఉందని చెప్పడంతో, దళితుల శ్మశానం నుంచి రోడ్డు వేసేందుకు అధికారులు ప్రయత్నించారు. దానిని తనపల్లి దళితులు అడ్డుకున్నారు. పోలీసులతో బెదిరించి, వారిని పక్కకు తప్పించి శ్మశానంలో మూడు అడుగుల మేర మట్టిని తీశారు. ఎముకలు, పుర్రెలు బయటపడ్డాయి. వాటిని తొలగించి రాత్రికి రాత్రే కొత్తగా తారురోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు. దీంతో దళితుల శ్మశానం సగానికి పైగా కనుమరుగైంది. మండిపడుతున్న దళిత సంఘాలు శ్మశానాన్ని ఆక్రమించి తారురోడ్డు వేయడంపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి కోసం దళితుల శవాలపై రోడ్డును వేస్తారా? అని తనపల్లి మాజీ సర్పంచ్ నాగరాజు నిలదీశారు. అధికార పార్టీ నేత కోసమే ఇలా ఎప్పటి నుంచో ఉన్న రోడ్డును పట్టాగా మార్చారని, దళితుల శ్మశానాన్ని ఆక్రమించి పూర్వీకుల జ్ఞాపకాలను సైతం చెరిపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశానాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే ముఖ్యమంత్రినే నిలదీస్తామని హెచ్చరించారు. -
శ్మశానాన్ని ఆక్రమించిన టీడీపీ నేత
సాక్షి ప్రతినిధి, విజయనగరం : చివరకు శవాలను పూడ్చే భూములనూ వదలడం లేదు. ఊరికి దూరంగా ఉన్న శ్మశానాన్ని సైతం కబ్జా చేశా రు. ఆక్రమణకు కాదేది అనర్హమని నిరూపించారు. టీడీపీ నేతొకరు ఈ ఘనకార్యానికి పాల్పడ్డారు. భూమి విలువ పెరగడంతో ఆక్రమణకు తెగబడ్డారు. కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని, ఆ స్థలంలో దర్జాగా సాగు చేస్తున్నారు. వీటిని సాగు భూములుగా చూపించి ఏదోక రోజున రికార్డులను సృష్టించినా ఆశ్చర్యపోక్కర్లేదు. జాతీయ రహదారికి ఆనుకుని, విశాఖనగరానికి దగ్గర్లో ఉండడం, పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తాయన్న ప్రచారం, ఎయిర్ పోర్ట్ రానుందన్న వార్తలతో భోగాపురం మండలంలోని భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. శివారు గ్రామాల్లో సైతం భూములకు గిరాకీ పెరిగింది. దీంతో అధికారం అండ ఉన్న కొంతమంది.. భూములను దర్జాగా ఆక్రమించి తమ వశం చేసుకుంటున్నారు. మండలంలోని భెరైడ్డిపాలెంలో అదే జరిగింది. అక్క డొక టీడీపీ నేత ఏకంగా శ్మశానాన్ని కబ్జా చేసేశారు. రెడ్డికంచేరు రోడ్డులో, మిరాకిల్ కంపెనీకి వెళ్లే దారిలో ఎకరా భూమి సుమారు రూ.70 లక్షలు పలుకుతోంది. ఆ గ్రామ శివారులో శ్మశానం కింద సర్వే నంబర్.30/1లో 8.16 ఎకరాలున్నాయి. వీటి మధ్యనే చిన్న చెరువు, సాగునీటి కాలువ ఉంది. ఓ టీడీపీ నేత కన్ను ఈ భూమిపై పడింది. అక్కడికి ఎవరొస్తారులే అని ఆక్రమణకు దిగారు. శ్మశానం కోసం 15సెంట్లు భూమి వదిలేసి మిగతాదంతా చదును చేసేశారు. కొంతమేర వేరుశనగ, మరికొంతమేర కొబ్బరి మొక్కలు వేశారు. కళ్లముందే శ్మశానం భూమి ఆక్రమణకు గురైనా ఏ ఒక్కరూ అడ్డుకోలేకపోతున్నారు. గతంలో ఒకసారి ఆక్రమించారన్న ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు వెళ్లి రాళ్లు పాతారు. అయితే, టీడీపీ అధికారంలోకి రాగానే ఆ రాళ్లు పీకేసి యథేచ్ఛగా చదును చేసి సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడా ఆక్రమణదారు చేతిలో ఉన్న భూముల విలువ రూ.4 కోట్ల మేర ఉండొచ్చని అంచనా. గతంలో ఫిర్యాదు చేసేందుకైనా స్థానికులు ముందుకొచ్చారు. ఇప్పుడు చేతిలో ఉన్న అధికారంతో ఏం చేస్తారన్న భయంతో ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు. ఎవరో వచ్చి వెలికి తీస్తే తప్ప శ్మశాన భూములను కాపాడుకోలేమని స్థానికులు వాపోతున్నారు. శ్మశాన భూములను కాపాడుతాం: తహశీల్దార్ భెరైడ్డిపాలెంలోని శ్మశాన భూములు అక్రమణ గురయ్యాయన్న విషయం తన దృష్టికి రాలేదని భోగాపురం తహశీల్దార్ పేడాడ జనార్దనరావు తెలిపారు. ఫిర్యాదొచ్చినా, రాకపోయినా నిజంగా ఆక్రమణ జరిగితే తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆక్రమణదారుడు కబంధ హస్తాల నుంచి భూములను కాపాడతామన్నారు.