
కర్నూలు, సాక్షి: వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటం ఫలితంగా.. కూటమి కక్ష సాధింపు చర్యల నుంచి నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట దక్కింది. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో ఇప్పటికే బెయిల్ లభించింది. ఈ తరుణంలో ఆయన ఇవాళ ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో రిలీజ్‌కు బ్రేక్ పడింది.
సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ పెట్టారంటూ పోసానిపై 5 నెలల కిందట ఏపీ సీఐడీ(AP CID) కేసు నమోదు చేసింది. తాజా కేసుల నుంచి ఊరటతో ఆయన జైలు నుంచి విడుదల కాబోతుండగా.. హఠాత్తుగా ఆ కేసును తెరపైకి తెచ్చారు. ఆఘమేఘాల మీద గుంటూరు కోర్టులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేయగా.. కోర్టు సీఐడీ విజ్ఞప్తికి అనుమతించింది.
దీంతో.. ఈ ఉదయం సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లారు. పీటీ వారెంట్‌పై పోసానిని కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు సమాచారం. జైలు నుంచే వర్చువల్‌గా జడ్జి ఎదుట ప్రవేశపెడతారని తెలుస్తోంది. పోసానిపై సీఐడీ నమోదు చేసిన కేసు వివరాలు తెలియాల్సి ఉంది.
పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) పై మొత్తం ఏపీ వ్యాప్తంగా 30 ఫిర్యాదులకుగానూ 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసుకు గానూ ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే న్యాయస్థానాల్లో ఊరట దక్కవచ్చనే ఉద్దేశంతోనే.. వరుసగా ఒక్కో పీఎస్‌లో నమోదైన కేసుకుగానూనా ఆయన్ని తరలిస్తూ వచ్చారు. అలా 2 వేల కిలోమీటర్లకుపైగా తిప్పి పోసానిని హింసించారు.
అయితే చివరకు.. న్యాయమే గెలిచింది. బీఎన్‌ఎస్ సెక్షన్ 111 ప్రకారం వ్యవస్థీకృత నేరాల కింద కేసుల నమోదుకు న్యాయస్థానాలు సమ్మతించలేదు. పోసానిపై నమోదు చేసిన కేసులకు ఆ సెక్షన్ వర్తించదని స్పష్టం చేశాయి. పోసాని కృష్ణ మురళిపై నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిళ్లు మంజూరు చేశాయి.
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో కేసు.. బెయిల్
పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేసు.. బెయిల్
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం పీఎస్‌లో కేసు.. బెయిల్
కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసు.. బెయిల్
హైకోర్టులో ఆయనపై పెట్టిన కొన్ని కేసులు.. క్వాష్
మరోవైపు.. పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వం తన అనుకూల మీడియా ద్వారా విషం చిమ్ముతోంది. ఆయన విడుదలపై సందిగ్ధం నెలకొందంటూ ముందుగానే కథనాలు ఇచ్చేసింది. పోసానిపై పలుచోట్ల కేసులున్న నేపథ్యంలో ఆయన విడుదలయ్యే లోపు, ఇతర జిల్లాల నుంచి ఏ స్టేషన్ పోలీసులైనా వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లొచ్చంటూ పేర్కొనగా.. ఈలోపే సీఐడీ ఆయన విడుదలను అడ్డుకునేందుకు తెర మీదకు రావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment