
తిరుపతి, సాక్షి: ప్రముఖ నటుడు, ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్(APFDC) మాజీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ఆపడం లేదు. తాజాగా.. టీటీడీ చైర్మన్‌పై సోషల్ మీడియాలో పోస్టులు చేశారంటూ కేసులు నమోదు చేసి వేధించాలని చూస్తోంది.
టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు ఎంపికను పోసాని ఖండించారని, ఆయన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఏపీలోని పలు ప్రాంతాల్లో కేసులు ఇంతకు ముందే నమోదు అయ్యాయి. తాజాగా.. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 15వ తేదీన విచారణకు రావాలంటూ పోసానికి సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ నోటీసులు జారీ చేశారు. ఈ ఫిర్యాదు ఎవరు చేశారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, సోషల్ మీడియాలో పోస్టులు చేశారని.. టీడీపీ, జనసేన నేతల ఫిర్యాదు మేరకు ఇంతకు ముందు ఆయన్ని అరెస్ట్ చేసి రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైళ్ల చుట్టూ తిప్పుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26వ తేదీన హైదారాబాద్‌లో రాయచోటి(అన్నమయ్య జిల్లా) పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి ఓబులవారీపల్లి పీఎస్‌కు తరలించారు. మార్చి 22వ తేదీన గుంటూరు జైలు నుంచి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. మొత్తంగా ఆయనపై అప్పటికే ఏపీలో వ్యాప్తంగా 19 కేసులు నమోదుకాగా.. కోర్టు ఆయనకు ఊరట ఇచ్చింది.
