శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తా.. బీఆర్ నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, తిరుపతి: టీటీడీ పాలకమండలి నియామకంలో గందరగోళం నెలకొంది. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు, కొందరు సభ్యులపై విమర్శల నేపథ్యంలో పాలక మండలి జీవో జారీపై ప్రతిష్టంభన ఏర్పడింది. మిడ్ నైట్ మసాలా షో నడిపిన వాళ్లకి టీటీడీ బాధ్యతలా..? అంటూ సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. కొందరు ఇతర రాష్ట్రాల సభ్యులపై కూడా ఆరోపణలు ఉన్నాయి.టీటీడీ పాలక మండలిలో బ్రాహ్మణులకు మొండి చెయ్యి ఇవ్వగా, ఏపీ నుంచి ఒక్క బ్రాహ్మణ వ్యక్తికి కూడా టీటీడీలో చోటు దక్కలేదు. సీఎం చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీని గాలికి వదిలేశారు. టీడీపీ మేనిఫెస్టోలో టీటీడీ పాలకమండలిలో ఒక బ్రాహ్మణ వ్యక్తికి సభ్యులుగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు మోసంపై బ్రాహ్మణ వర్గాలు మండిపడుతున్నాయి. మరో వైపు, పార్టీ సీనియర్లను కాదని, ఎన్నికల ముందు వచ్చినవాళ్లకి పదవులు ఇవ్వడంపై కొందరు టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో టీటీడీ చైర్మన్గా జీవో రాక ముందే బీఆర్ నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఇప్పటి వరకు వెయ్యికి పైగా నూతన ఆలయాల నిర్మాణం టీటీడీ చేపట్టింది. బీఆర్ నాయుడు వాఖ్యలపై హిందూత్వ సంఘాలు, భక్తులు మండిపడుతున్నారు. టీటీడీపై అవగాహన పెంచుకుని మాట్లాడాలని భక్తులు కోరుతున్నారు. అన్యమత ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.అయితే, ఎల్లో మీడియా సిండికేట్లో భాగమైన టీవీ–5 అధినేత బీఆర్ నాయుడుకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారని ముందు నుంచి అనుకుంటున్నదే. అయితే, బీఆర్ నాయుడు కనుసన్నల్లోనే ఆయన కుమారుడు అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు.ఆయన కుమారుడు ప్రాతినిథ్యం వహిస్తున్న హౌసింగ్ సొసైటీలో అవకతవకలు.. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో అక్రమాలు.. డ్రగ్స్ వినియోగదారులతో చెట్టాపట్టాలు.. హౌసింగ్, ‘రియల్’ వ్యాపారంపై తెలంగాణ హైకోర్టు ఆక్షేపణ.. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నా టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు నియామకం చర్చనీయాంశంగా మారింది.వాస్తవానికి బీఆర్ నాయుడు నియామకంపై ఎన్నికల కంటే చాలా ముందే టీడీపీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై కావాలనే బురదజల్లే కార్యక్రమాలు ప్రసారం చేశారని సమాచారం.ఇదీ చదవండి: బాబు హామీ గాలికి.. టీటీడీ పాలక మండలిలో బ్రాహ్మణులకు మొండిచేయి