తిరుమల తిరుపతి దేవస్థానంలో అంతా బాగానే ఉందా? వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం టోకెన్ల కోసం గంటల తరబడి వేచి ఉండి, చివరికి తొక్కిసలాటకు గురై ఆరుగురు మరణించినా... ప్రభుత్వం, టీటీడీ పెద్దలు అదేదో చాలా చిన్న అంశమైనట్లు వ్యవహరిస్తున్నారా? టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణ అధికారి శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు ఉమ్మడిగా మీడియా సమావేశం పెట్టి తమ మధ్య విభేదాలు లేవు.. కలసి పని చేస్తున్నామని చెబితే జనం నమ్మాల్సిందేనా?..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తోపాటు బీఆర్ నాయుడు ఇతర ఉన్నతాధికారులంతా ఎవరిని మోసం చేస్తున్నారు?. ప్రజలనే కాదు.. తమను తాము మోసం చేసుకుంటూ తిరుమలేశుడిని కూడా మోసం చేయడం కాదా!. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కొందరు ప్రచారం చేస్తున్నారని బీఆర్ నాయుడు సూక్తి ముక్తావళి చెబుతున్నారు. తిరుమల లడ్డూ ఉదంతం నుంచి వరసగా జరుగుతున్న అనేక సంఘటనలలో అపచారానికి పాల్పడుతున్నది ఎవరు?. హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నది ఎవరు?. కచ్చితంగా చంద్రబాబు, పవన్‌తో పాటు బీఆర్ నాయుడు కూడా బాధ్యత వహించవలసిందే.
👉బీఆర్ నాయుడు(BR Naidu)కు నిజంగా హిందూ సెంటిమెంట్, దైవభక్తి ఉంటే పదవి నుంచి తప్పుకుని దైవ సన్నిధిలో క్షమాపణ కోరి ఉండాల్సింది. ఒకవేళ రాజీనామాకు మొండికేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పదవి నుంచి తొలగించి ఉండాలి. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసు, టీటీడీ ఉన్నతాధికారులను సస్పెండ్ చేసి ఉండాల్సింది. ఉప ముఖ్యమంత్రి పవన్ తిరుపతిలో సనాతన హైందవ ధర్మం సక్రమంగా నడవడం లేదని, తిరుమల పుణ్యక్షేత్రానికి అపచారం జరిగిందని ప్రకటించి కూటమి నుంచి వైదొలగి ఉండాల్సింది. బీజేపీ హిందూ మతానికి తానే ప్రతినిధి అన్నట్లు నటించడం కాకుండా, తాము ఈ పాపానికి బాధ్యత తీసుకోలేమని ప్రకటించి ఉండాలి. వీరెవ్వరూ ఆ పని చేయలేదు. క్షమాపణల డ్రామా నడిపి, ఛైర్మన్, ఇద్దరు ఉన్నతాధికారులను బలవంతంగా కూర్చోబెట్టి అతా బాగున్నట్లు కలరింగ్ ఇచ్చి ప్రజలను పక్కదారి పట్టించే యత్నం చేశారు. దీంతో మరణించినవారి ప్రాణాలు తిరిగి వచ్చేసినంతగా పిక్చర్ ఇస్తున్నట్లుగా ఉంది. ఇదంతా చంద్రబాబు స్టైలే.
పైకి సీరియస్‌గా ఉన్నట్లు కనిపిస్తూ, లోపల మాత్రం తుతు మంత్రంగా కథ నడిపిస్తుంటారు. ఇలాంటి తొక్కిసలాటలు(Stampede) జరిగితే పదవుల నుంచి తప్పుకోవడం అనేది నైతిక బాధ్యత. అలా విలువలు పాటిస్తారనుకోవడం అత్యాశే కావచ్చు!. గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట వల్ల 29 మంది మరణిస్తేనే చంద్రబాబు పదవి నుంచి తప్పుకోలేదు. ఇప్పుడు బీఆర్ నాయుడు పదవి ఎందుకు వదలుకుంటారు?. పుష్కరాల తొక్కిసలాట కేసులో ఎవరిపైన అయినా చర్య తీసుకుంటే అది తన వరకు వస్తుందని భయపడ్డ చంద్రబాబు ఒక్కరిపై కూడా యాక్షన్ తీసుకోలేకపోయారు. తిరుపతి ఘటనలో కూడా ఒక ఐదుగురు చిన్న స్థాయి అధికారులపై చర్య చేపట్టి, తనకు కావల్సిన అధికారి ఒక్కరిని మాత్రం బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు.
ఈ డ్రామాలో పవన్ తన వంతు పాత్ర పోషించి రక్తి కట్టించారు. కాకపోతే మధ్యలో బీఆర్ నాయుడు చేతిలో పరువు పోగొట్టుకున్నారు. బీఆర్ నాయుడుతో సహా అధికారులంతా అంతా క్షమాపణ చెప్పాలని అన్నారు. కాని టీటీడీ చైర్మన్ మాత్రం పవన్ ఎవరు తనకు చెప్పడానికి అని తీసిపారేశారు. చివరికి ముఖ్యమంత్రి ఒత్తిడితో క్షమాపణ చెప్పినా పవన్ మాత్రం ఏ మాత్రం ఫీల్ కాకుండా సరిపెట్టుకున్నారు. బీఆర్ నాయుడి దెబ్బకు భయపడి ఆయన ఇతర అధికారుల జోలికి వెళ్లలేదు.
ఇక చంద్రబాబు ఎదుటే బీఆర్ నాయుడు, శ్యామలరావులు ఘర్షణ పడ్డారు. దీన్ని తెలుగుదేశం జాకీ మీడియానే ప్రముఖంగా వార్త ఇచ్చింది. ‘నువ్వంటే.. నవ్వు...’ అనుకున్నారని కూడా రాశారు. అసలు తమకు ఏమీ చెప్పడం లేదని చైర్మన్ అంటే.. తాను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్నానని ఈవో అన్నారు. మధ్యలో రెవెన్యూ మంత్రి జోక్యం చేసుకోవడం, చంద్రబాబు వారించడం వంటి సన్నివేశాలన్నీ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. ఆ రోజున వీరెవరూ ఖండించలేదు. కానీ.. తదుపరి బి.ఆర్.నాయుడు, శ్యామలరావు, వెంకయ్య చౌదరిలు ఏమీ తెలియనట్లు నటించారు. ఇక నుంచి కలిసి పనిచేస్తామని చెబితే అది వేరే సంగతి. కాని అసలు గొడవలే లేవన్నట్లుగా మాట్లాడి ఎవరిని ఫూల్స్‌ను చేస్తారు?.
తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారని నాయుడు అనడం మరీ విడ్డూరం. కొద్ది నెలలుగా ఈ అపచారానికి పాల్పడుతున్నది కూటమి పెద్దలు కాదా! తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారని అబద్దం చెప్పడం అపచారం కాదా? అలాంటిది ఏమీ లేదని శ్యామలరావు తొలుత చెప్పగా, ఆయనతో మాట మార్పించ లేదా? అది అప్రతిష్ట కాదా? ఆ మీదట పవన్ రెచ్చిపోయి సనాతని అంటూ వేషం కట్టి మరింత పరువు తీయలేదా? ఐదేళ్లుగా అసలు తిరుమలనే దర్శించని బీఆర్ నాయుడును ఛైర్మన్ పదవికి నియమించడం చంద్రబాబు చేసిన తప్పు కాదా? ఇప్పుడు లోకేష్ మనిషిగా ఉన్నందున బీఆర్ నాయుడును కనీసం పదవి నుంచి తప్పుకో అని చెప్పలేకపోతున్న చంద్రబాబు నిస్సహాయత వల్ల ఇమేజీ దెబ్బతినడం లేదా? జరగని కల్తీకి సంప్రోక్షణ చేయించిన చంద్రబాబు ప్రభుత్వం వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన భక్తులు మరణిస్తే ఎందుకు అలా ప్రత్యేక పూజలు చేయించలేదు? ఇది అపచారం కాదా?
ఈ ఘటన కారణంగా భక్తుల సంఖ్య తగ్గిందని అంకెలతో సహా మీడియాలో వార్తలు వచ్చాయి. అయినా అబ్బే అదేమీ లేదని బుకాయించడం అవసరమా?. టీటీడీ బోర్డులో ఛైర్మన్‌తో సహా పలువురు బోర్డు సభ్యులు ఈవో శ్యామలరావుపై ధ్వజమెత్తడం అసత్యమా? ఆయన గుడికి వెళ్తే ఇతర అధికారులు సైతం పలకరించడానికి భయపడ్డారట!. అది ఎందుకు జరిగింది అంటే ఆయనకంటే వెంకయ్య చౌదరే పవర్ ఫుల్ అనే భావం కాదా? టీటీడీలో టెక్నాలజీని వాడుతున్నామని, ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ ద్వారా క్రౌడ్, క్యూలైన్ మేనేజ్ మెంట్ గురించి గూగుల్ అధికారితో సలహాలు తీసుకున్నామని వెంకయ్య చెబుతున్నారు. అది నిజమైతే ఆ విషయాన్ని ఇంతకాలం ఎందుకు దాచారు?. పెద్ద ఘనకార్యం చేయబోతున్నట్లుగా చెప్పేవారు కదా?.
ఇక.. అధికారిక సమావేశంలో కూడా కొందరు అనధికారులను ఎలా కూర్చోబెట్టారు.లక్ష్మణ్ అనే వ్యక్తి లోకేష్ సన్నిహితుడని చెబుతున్నారు. ఆయన, మరికొందరు తిరుమలలో పెత్తనం చేస్తున్న వార్తలను ఎందుకు ఖండించలేకపోయారు? తిరుపతిలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు చెప్పినట్లుగానే టీటీడీ అధికారులు వ్యవహరించారని, ఒక డీఎస్పీ వల్ల తొక్కిసలాట జరిగిందని శ్యామలరావు అంటున్నారు. అంటే టీటీడీ అధికారుల తప్పు లేకపోయినా ఒక మహిళా జేఈవో పై చంద్రబాబు ఎందుకు చర్య తీసుకున్నారు?. ఎస్పీపై ఎందుకు సస్పెన్షన్ వేటు వేయలేదు? ఇవన్ని పక్షపాతంతో చేసిన నిర్ణయాలుగానే కనిపిస్తాయి. ఇదేనా దైవభక్తి ఉన్నవారు చేసేది?.
గతంలో జగన్ టైమ్‌లో ఉన్నవి, లేనివి సృష్టించి తిరుమలకు అపచారం జరిగిందంటూ చంద్రబాబు, పవన్, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి దారుణ విష ప్రచారం చేసేవి. మరి ఇప్పుడు ఇంత ఘోరం జరిగినా హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? కేవలం టీటీడీ ఛైర్మన్ నిర్వాకంపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే మనోభావాలు దెబ్బతింటాయా? తిరుమలకు అప్రతిష్ట వస్తుందా? గతంలో విశాఖలో ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకై పదమూడు మంది మరణించిన ఘటనలో విదేశాలలో ఉన్న యాజమాన్యం వారిని కూడా అరెస్టు చేయాలని చంద్రబాబు, పవన్ లు డిమాండ్ చేశారా? లేదా?. ఆ ప్రకారమే జగన్ ప్రభుత్వం అరెస్టు చేయించిందా? లేదా?. మరి ఇప్పుడు ఇన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలకు దెబ్బతగిలేనా తొక్కిసలాటలో ఆరుగురు మరణిస్తే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది? ఎందుకు కనీసం ఎవరిపైన కేసు పెట్టలేదు?. కేవలం పదవులు అంటిపెట్టుకుని హిందూ మతానికి తీరని పాపం చేస్తున్నది వీరే అని వేరే చెప్పనవసరం లేదు.
::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment