
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి నేతలు చెప్పే మాటలకు చేసే పనులకు చాలా తేడా ఉందన్నారు జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్. టీటీడీని రాజకీయ పునరావాసంగా మార్చారు. ఇది టీటీడీ బోర్డు కాదు.. టీడీపీ బోర్డు అని ఆరోపించారు. క్రిమినల్ కేసులు ఉన్న వారు ట్రస్ట్ బోర్డు సభ్యులా? అని ప్రశ్నించారు.
జడ శ్రావణ్ కుమార్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై చాలా ఆరోపణలు ఉన్నాయి. క్రిమినల్ కేసులు ఉన్న వారు ట్రస్ట్ బోర్డు సభ్యులా?. ప్రశాంతి రెడ్డి, జ్యోతుల నెహ్రుపై ఐటీ ఎగవేత కేసులు ఉన్నాయి. ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై 23 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. బాబు అరెస్ట్ అయినప్పుడు క్యారేజీలు మోసిన మునికోటేశ్వర రావుకు పదవా?. అలివేలు మంగమ్మపై జోకులు వేసిన నర్సిరెడ్డి బోర్డు మెంబరా?. దేవాదాయ చట్టానికి విరుద్ధంగా బోర్డు సభ్యుల నియామకం జరిగింది.
అలాగే, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ప్రజల డబ్బులు ఖర్చుచేశారని చెప్పిన పట్టాభి దీనికి సమాధానం చెప్పాలి. చంద్రబాబు ఇంటికి కోట్ల రూపాయలు ఎందుకు కేటాయించుకున్నారు. చంద్రబాబు నివాసం అనధికార నివాసం. అనధికార కట్టడం కూల్చివేయాలని నేషనల్ ట్రిబ్యునల్‌కి వెళ్తున్నాం. కరకట్ట మీద అన్ని కట్టడాలు కూలగొట్టి తీరుతాం. ముఖ్యమంత్రి నివాసం అయినా కూల్చాల్సిందే.
ప్రభుత్వ ధనం వృధా అవుతుంటే సనాతన వాది, పవన్ స్టార్ ఏమయ్యాడు. పవన్ అనధికార కట్టడాలపై మౌనంగా ఉండడానికి కారణం జనసేన పార్టీ కార్యాలయానికి పర్మిషన్ లేకపోవడమే. హైడ్రా వంటి చట్టం ఆంధ్రప్రదేశ్‌లో అమలు అయితే ముందు పోయేది ముఖ్యమంత్రి ఇల్లు.. తర్వాత పోయేది పవన్ ఇల్లు. కూటమి నేతలు చెప్పే మాటలకు చెప్పే పనులకు చాలా తేడా ఉంది. జనవరి నుండి కాలర్ పట్టుకుని కూటమి నేతలను రోడ్లపైకి లాగుతాం అని సీరియస్ కామెంట్స్ చేశారు.

Comments
Please login to add a commentAdd a comment