ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగ విష సంస్కృతి కోరలు చాస్తోంది. అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలకూ పాకుతోంది. ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల, తిరుపతి దేవస్థానంలోనూ ఈ రకమైన నీచ రాజకీయాలు ప్రవేశించాయి. తమకు గిట్టనివారిపై మాత్రమే సాగుతున్న రెడ్‌బుక్ కుట్రలతో పోలీసు శాఖకు కూడా అప్రతిష్ట ఏర్పడుతోంది. సాటి అధికారులపైనే కుట్రలకు దిగుతుండటం బహుశా దేశ చరిత్రలోనే మొదటిసారి కావచ్చు.
టీటీడీ ఇటీవల కొంతమంది యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులపై కేసులు పెట్టింది. ప్రభుత్వ సలహాదారు.. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తిరుమల సందర్శించిన సందర్భంగా ఆయనకు తగిన గౌరవ మర్యాదలు ఇవ్వలేదని, అధికారులు ప్రోటోకాల్‌ను కూడా ఉల్లంఘించారని ఈ ఛానళ్లలో కొన్ని కథనాలు ప్రసారం కావడమే నిర్వాహకులు చేసిన ఘోర తప్పిదం. ఈ కథనాల కారణంగా టీటీడీ ప్రతిష్ట దెబ్బతిందని, వారి మనోభావాలు గాయపడ్డాయని ఆరోపణలు చేసి జర్నలిస్ట్ వైఎన్‌ఆర్ ఛానల్ నిర్వాహకుడు వైఎన్‌ఆర్‌తోపాటు ఇతరులపై కేసులు నమోదు చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా ఓ శాటిలైట్ ఛానెల్ యజమానే. ఆ ఛానెల్‌లో ఎన్ని అసత్య కథనాలు ప్రసారమయ్యాయో ప్రజలకు, విమర్శకులు అనేకులకు తెలిసిన విషయమే.
టీడీపీ భజంత్రీ ఛానెల్‌గా మాత్రమే ఉండాలని అనుకుంటున్న బీఆర్ నాయుడు వీటిని పట్టించుకోకపోవచ్చు. అది వారి ఇష్టం కానీ.. అందరూ తనలానే అధికార పార్టీకి అణిగిమణిగి ఉండాలని కోరుకోవడమే అభ్యంతరకరం. టీటీడీ ప్రతిష్ట దెబ్బతిందని అంటున్నారు. ఎవరివల్ల? దాని గురించి చెప్పగలిగే ధైర్యం టీటీడీకి ఉందా?. దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని దిక్కుమాలిన రాజకీయం చేసిందెవరు?. భక్తులు పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో జంతువు కొవ్వు కలిసిందని అసత్య ఆరోపణలు చేయడం వల్ల కదా టీటీడీ ప్రతిష్ట మసకబారలేదా?. సీఎం వంటి బాధ్యతాయుతమైన హోదాలో ఉంటూ బాధ్యతారాహిత్యంగా ఆయన చేసిన ఆరోపణలతో టీటీడీ పరువు ఏపీలోనే కాదు.. ప్రపంచం అంతటా పోయింది వాస్తవం కాదా?కోట్లాది హిందువులు ఏ దేశంలో ఉన్నా అంతా బాధపడ్డారా? లేదా? తీరా చూస్తే ఆయనే మళ్లీ మాటమార్చారు. సిట్ అని, సీబీఐ అని రకరకాలుగా విచారణలు చేయించారు. వాటి సంగతి ఏమైందో తెలియదు.
టీటీడీ ఈవో శ్యామలరావు లడ్డూలో కల్తీ జరగలేదని తొలుత చెప్పి, ఆ తర్వాత చంద్రబాబుకు వంత పాడేలా మాట్లాడినప్పుడు పరువు పోలేదా? వారిపై టీటీడీ కేసులు పెట్టిందా?. అధికారం అంతా వారి చేతిలోనే ఉంది కనుక ఎవరూ వారి జోలికి వెళ్లలేరు. ఎవరైనా తమ మనోభావాలు గాయపడ్డాయని కేసులు పెట్టే ప్రయత్నం చేసినా పోలీసులు పట్టించుకోరు. ఎప్పుడో మూడు, నాలుగేళ్ల క్రితం తమ నేత చంద్రబాబు, తదితరులను దూషించారని, దానివల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని టీడీపీ వారు ఎవరైనా కేసు పెడితే మాత్రం పోలీసులు ఆగమేఘాల మీద హైదరాబాద్ వెళ్లి మరి ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ వంటివారిని అరెస్టు చేసే ప్రయత్నం చేస్తారు. దీనినే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. పలుకుబడి లేనివారినైతే అరెస్టు చేసి వేధిస్తుంటారు.
ఇక పవన్ కళ్యాణ్ సంగతి చూద్దాం. చంద్రబాబు తిరుమల లడ్డూపై అసత్య ఆరోపణలు చేయడమే దారుణం అనుకుంటే పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి సనాతని వేషం కట్టి అయోధ్యకు పంపిన లడ్డూలలో సైతం కల్తీ నెయ్యి కలిపారని టీటీడీ పరువు మంట కలిపారు. తీరా చూస్తే అయోధ్యకు పంపిన లడ్డూలను బోర్డు సభ్యులు ఇద్దరు స్వచ్ఛమైన నెయ్యితో వ్యక్తిగతంగా తయారు చేయించారని వెల్లడైంది. అంటే పవన్ తప్పుడు ఆరోపణ చేసినట్లే కదా!. మరి టీటీడీ ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదు. బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేస్తే ఒకప్పుడు ఎంత హోదాలో ఉన్నా కేసులు నమోదు చేసేవారు. ఇప్పుడు ఏపీలో ఆ పరిస్థితి లేదు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం టిక్కెట్ల కోసం వెళ్లిన భక్తులు తొక్కిసలాటకు గురై ఆరుగురు మరణిస్తే టీటీడీకి మచ్చ రాలేదు. దీనికి సంబంధించిన అధికారులపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని ముఖ్యమైన అధికారుల జోలికి వెళ్లలేదు.
ఇదే సమయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పడానికి కూడా తొలుత మొరాయించారు. క్షమాపణతో సరి పెట్టుకున్నారే తప్ప.. తను చైర్మన్‌గా ఉన్నప్పుడు ఇది జరిగింది కనుక నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానని మాత్రం ప్రకటించలేదు. నిజంగా టీటీడీ ప్రతిష్ట దారుణంగా దెబ్బతీసిన వారిపై ఎలాంటి చర్యలు లేవు కానీ, యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులపై మాత్రం కేసులు పెట్టేశారట. వారు నిజంగానే పొరపాటు మాట్లాడి ఉంటే ఖండన ఇచ్చి అదే రకంగా వార్తలు ప్రసారం చేయాలని కోరి ఉంటే సరిపోయేది. అలా కాకుండా కేసులు పెట్టారంటే అది కక్ష కాక మరేమిటి?. టీటీడీలో రెడ్‌బుక్ పాలన ఇంకేమిటి? అందుకే వైఎస్సార్‌సీపీ నేతలు ఈ రెడ్‌బుక్‌ను పిచ్చి కుక్కలతో పోల్చి అవి ఎవరి మీద ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి ఏర్పడిందని విమర్శిస్తున్నారు.
టీటీడీలోనే కాదు.. వైఎస్సార్‌సీపీ నేతలు అనేక మందిపై రెడ్‌బుక్ పేరుతో కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలపై దారుణమైన రీతిలో కేసులు పెట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా చేయడమే వీరి లక్ష్యం. తాజాగా మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అటవీ భూముల ఆక్రమణ అంటూ ఓ కథ సృష్టించి ఏదోలా కేసు పెట్టాలని చూస్తున్నారు. రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డిలు ఇచ్చిన వివరణ చూస్తే అది ఎప్పుడో పాతికేళ్ల క్రితం కొన్న భూములు. వాస్తవం ఉన్నా, లేకపోయినా రెడ్‌బుక్ ప్రకారం కేసులు పెట్టడానికి ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి నిత్యం ప్రభుత్వాన్ని ఉసికొల్పుతున్నాయి. రెడ్‌బుక్ సృష్టికర్త లోకేష్ అయినా మర్చిపోతారేమో కానీ, ఈ ఎల్లో మీడియా మాత్రం తమ కక్షలు తీర్చుకోవాడానికి మాత్రం పూర్తిగా వాడుకునే పనిలో ఉంది. వీరి వ్యవహార శైలి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు వైఫల్యాల నుంచి డైవర్ట్ చేయడానికి చేసే ప్రయత్నంగా ఒక వైపు కనిపిస్తుంది.
మరోవైపు ప్రభుత్వాన్ని వీరే నడుతున్నట్లుగా ఇష్టారాజ్యంగా వైఎస్సార్‌సీపీ వారిపై, తమకు గిట్టనివారిపై కథనాలు ఇస్తున్నారు. దీనివల్ల కూటమికి కూడా భవిష్యత్తులో నష్టమే తప్ప మరొకటికాదు. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై రెడ్‌బుక్‌ను ప్రయోగించారు. పలువురికి పోస్టింగ్‌లు నెలల తరబడి ఇవ్వడం లేదు. కొందరిని అరెస్టు చేయడానికి యత్నిస్తున్నారు. తాజాగా కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా అభియోగంపై విచారణకు వేసిన సిట్ అధికారి వినీత్ బ్రిజ్ లాల్‌ను కూటమి పెద్దలు ఆదేశించినట్లుగా నివేదిక ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారట. ఆయన అలా కుదరదని, వాస్తవ పరిస్థితిని నివేదిస్తానని చెప్పారట. కాదు.. కూడదంటే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని అన్నారట. దాంతో డీజీపీ, మరో ఉన్నతాధికారి ఆయనను బదిలీ చేయాలని నిర్ణయించారట. ఇదంతా మీడియాలో వచ్చిన సమాచారమే.
ఇలా పోలీసు శాఖలోని వారు కూడా తమ పదవులు, పోస్టింగ్‌ల కోసం అధికారంలో ఉన్నవారికి వంతపాడే పనిలో ఉంటే అది వ్యవస్థకు ఎంతవరకు ప్రయోజనమో ఆలోచించాలి. ఇలా తప్పుడు కేసులు పెట్టించడం కొనసాగిస్తే, అదే రెడ్‌బుక్ కూటమి నేతల మెడలకు కూడా ఎప్పుడో ఒకప్పుడు చుట్టుకునే అవకాశం ఉంటుంది. పామును పెంచితే ఎంత ప్రమాదమో, రెడ్‌బుక్ అంటూ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తే కూడా అంతే ప్రమాదం అన్న సంగతిని నేతలు ఎప్పటికి గుర్తిస్తారో !.
- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment