
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఒక టీవీ ఛానల్ కార్యక్రమంలో చెప్పిన విషయాలు గమనించదగినవే. తన సీనియారిటీని కూడా పక్కనబెట్టి ఆయన ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తేశారు. ఇటీవలి ఎన్నికలకు ఎలాగోలా కష్టపడి మోదీని, అమిత్ షాలను ప్రసన్నం చేసుకుని పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం లభించింది. బీజేపీ వారి వద్ద భయం, భయంగా గడపాల్సిన పరిస్థితిలో బాబు ఉన్నారేమో అన్న అనుమానం రాజకీయ వర్గాలలో కలుగుతోంది.
.. బీజేపీ అభ్యర్ధిగా ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ సీటు కేటాయించక తప్పని పరిస్థితి ఏర్పడడం ఒక ఉదాహరణ. బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కూడా చంద్రబాబుకు షాక్ వంటిదేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధులను తానే నిర్ణయిస్తాననే దశ నుంచి.. తన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వారి ఎంపికను మౌనంగా ఆమోదించే దుస్థితిలో చంద్రబాబు పడ్డారని సొంత పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీ జుట్టు బీజేపీ చేతిలో ఉందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అందుకే సందర్భం అయినా కాకపోయినా మోదీని పొగడడం, బీజేపీ విధానాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారని పలువురు భావిస్తున్నారు.
తన రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు పలుమార్లు బీజేపీని తీవ్రంగా విమర్శించారు. మళ్లీ అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అందుకోసం ఆయన ఎన్ని పాట్లు పడింది తెలుసు. 1996, 1998 లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని తీవ్రంగా విమర్శించారు ఈయన. ఆ రోజుల్లో వామపక్షాలతో పొత్తులో ఉన్నారు. 1998 లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీకి సరిగ్గా 12 సీట్లు తక్కువ అవడం, బీజేపీ వారు ఈయన్ని సంప్రదించడం, వెంటనే కనీసం మిత్రపక్షాలతో కూడా చెప్పకుండా ఎగిరి గంతేసినట్లు మద్దతు ఇచ్చేశారు. దాంతో 1999లో లోక్‌సభ ఎన్నికలతోపాటు జరిగిన శాసనసభ ఎన్నికలలో టీడీపీ విజయం సాధించడానికి అవకాశం వచ్చింది. ఇక.. కార్గిల్ యుద్ద వాతావరణం, వాజ్‌పేయిపై ఏర్పడిన సానుభూతి చంద్రబాబుకు కలిసి వచ్చాయి.
👉తదుపరి ఒక దశలో బీజేపీకి మద్దతు ఉపసంహరించుకోవడానికి సిద్దమైనట్లు కనిపించారు. గుజరాత్ మారణకాండ, మత హింసకు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వమే కారణమని చంద్రబాబు భావించారు. బీజేపీ నాయకత్వం మోదీని తప్పిస్తోందన్న సమాచారాన్ని నమ్మి ఆయనపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. మోదీని హైదరాబాద్ లో అడుగుపెట్టనివ్వనని హెచ్చరించారు. కానీ బీజేపీ తన వైఖరి మార్చుకునేసరికి ఈయన ఇరకాటంలో పడ్డారు. బీజేపీని వదలుకోవడానికి సిద్ద పడలేదు. పార్లమెంటులో ఓటింగ్ సమయానికి టీడీపీ ఎంపీలు లేకుండా వెళ్లిపోయారు. 2004లో బీజేపీతో కలిసి పోటీచేసినా ఓటమి చెందారు. ఆ తర్వాత జీవితంలో బీజేపీతో కలిసే ప్రసక్తి లేదని ప్రకటించారు.
👉కట్ చేస్తే.. 2009లో వామపక్షాలతోపాటు బీీఆర్‌ఎస్(అప్పటి టీఆర్‌ఎస్)తో పొత్తు పెట్టుకున్నారు. అయినా విజయం సాధించలేకపోయారు. దాంతో పంథా మార్చుకుని 2014 నాటికి మోదీకి దగ్గరవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి మాట్లాడడానికి ప్రయత్నించారు. ఆరోజుల్లో వైఎస్సార్‌సీపీతో పొత్తుకు బీజేపీ యత్నించినా, జగన్ ఒప్పుకోకపోవడం కూడా చంద్రబాబుకు ఉపయోగపడింది. మొత్తం మీద కలిసి పోటీ చేయడం, జనసేనను స్థాపించిన పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా మద్దతుఇవ్వడం, అధికారంలోకి రావడం జరిగింది. 2018 నాటికి బీజేపీతో మళ్లీ విబేధించారు.
👉 2019 ఎన్నికలలో బీజేపీ గెలవకపోవచ్చని, మోదీ మళ్లీ ప్రధాని కారని నమ్మినట్లు చెబుతారు. దాంతో ఆయన బీజేపీపైన, మోడీపైన చాలా తీవ్రమైన విమర్శలు చేసేవారు. మోదీని టెర్రరిస్టులతో పోల్చారు. వ్యక్తిగతంగా కూడా దాడి చేస్తూ మోదీ భార్యను ఏలుకోలేని వాడని, ముస్లింలను బతకనివ్వడని ఇలా పలు ఆరోపణలు గుప్పించారు. తెలంగాణలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా ఫలితం దక్కలేదు. దాంతో ఏపీలో ఒంటరిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. మోదీ తిరిగి ప్రధాని అవడంతో వెంటనే ప్లేట్ తిరగేశారు. బీజేపీకి దగ్గరవడానికి అన్ని వ్యూహాలు అమలు చేశారు. ముందుగా పవన్ కల్యాణ్‌ను ప్రయోగించారని అంటారు.
👉పవన్ తొలుత బీజేపీకి దగ్గరై, తదుపరి టీడీపీని కలపడానికి సంధానకర్తగా వ్యవహరించారు. ఆ విషయాన్ని ఆయన దాచుకోలేదు. బీజేపీతో టీడీపీని కలపడానికి తాను బీజేపీ పెద్దలతో చివాట్లు తిన్నానని కూడా ప్రకటించారు.ఈసారి కూడా వైసీపీతో స్నేహం చేయడానికి బీజేపీ ముందుకు వచ్చినా, జగన్ సిద్దపడలేదు.అది చంద్రబాబుకు కలిసి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ అండ, ఎన్నికల కమిషన్ అనుకూల ధోరణి, సూపర్ సిక్స్ హామీలు తదితర కారణాలతో అధికారంలోకి రాగలిగారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని మోదీని పొగుడుతున్న తీరు కాస్త ఆశ్చర్యం అనిపించినా, గత చరిత్ర తెలిసిన వారెవ్వరూ ఇది మామూలే అని భావిస్తుంటారు.
👉ఒకప్పుడు తానే మోదీకన్నా సీనియర్ అని చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు ప్రధాని నుంచి పాఠం నేర్చుకున్నానని అంటున్నారు. దానికి కారణం ఏమిటంటే మోదీ వరసగా గెలుస్తూ వస్తూ అధికారం నిలబెట్టుకున్నారట. గతంలో సీబీఐ, ఈడి వంటి వాటిని మోదీ ప్రయోగిస్తున్నారని ఆరోపించే వారు. బహుశా దాని ద్వారానే మోదీ అధికారం నిలబెట్టుకున్నారన్న అభిప్రాయం కలిగిందేమో తెలియదు. దానిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ఏపీలో పోలీసులతో వైసీపీ వారిపై అడ్డగోలు కేసులు పెట్టించడం, వేధింపులకు పాల్పడుతున్నారన్న అనుమానం కలిగేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయి.
మనం మంచి పనులు చేయడంతో పాటు ప్రజలకు సరిగా చెప్పాలని ఆయన అంటున్నారు. 1995 నుంచి చంద్రబాబు వాడుకుంటున్న విధంగా మీడియాను మరెవరైనా వాడుకోగలిగారా? అయినా తను ఓడిపోయినప్పుడు ప్రచారం సరిగా లేదని అంటున్నారు. చంద్రబాబు ప్రజలకు విపరీతమైన హామీలు ఇవ్వడంతో పాటు పొత్తుల వ్యూహాలలో సఫలం అయినప్పుడు గెలిచారు. హామీలు నెరవేర్చక ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఏర్పడినప్పుడు ఓటమి చెందారు. కాకపోతే ఆ విషయం చెప్పరు. 2004, 2019లలో ఓటమికి ప్రచార లోపమే కారణం అంటున్న చంద్రబాబు 2009లో ఎందుకు అధికారంలోకి రాలేకపోయారో చెప్పలేదు.
👉2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం బాగా పనిచేయబట్టి,ఆయన ప్రజలకు బాగా చెప్పగలిగినందువల్లే గెలిచారని అనుకోవాలా? 2024లో జగన్ ఓటమికి కూడా అదే కారణం అని ఎందుకకు అనుకోరాదు? పైగా టీడీపీ జగన్ టైమ్ లో చెప్పినన్ని అబద్దాలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా చేసిన అసత్య ప్రచారాలు, వదంతులు అన్ని చూస్తే అది ఒక ప్రపంచ రికార్డు అవుతుందేమో! ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆకాశమే హద్దుగా హామీలు ఇవ్వడం, ఆ తర్వాత ఎగనామం పెట్టడం జరుగుతుంటున్నది సర్వత్రా ఉన్న భావన.
2014లో ఇచ్చిన రైతు రుణమాఫీ తదితర వాగ్దానాలు అమలు చేయకపోవడం వల్ల టీడీపీకి బాగా అప్రతిష్ట వచ్చిందన్న సంగతి జనం మర్చిపోవాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. మోడీ వల్ల దేశం బాగా అభివృద్ధి చెందుతోందని చంద్రబాబు తెలిపారు. మరి గతంలో అందుకు విరుద్ధంగా ఎందుకు మాట్లాడింది ఎప్పుడూ వివరణ కూడా ఇవ్వలేదన్నది వాస్తవం. జనాభా నియంత్రణ వద్దని చెబుతూ ఏకంగా యూపీ, బీహారు రాష్ట్రాలు జనాభాను పెంచి దేశాన్ని కాపాడుతున్నాయని అనడం మరీ విడ్డూరంగా ఉంది. గతంలో ఆ రెండు రాష్ట్రాలు సరిగా పనిచేయక దేశానికి నష్టం చేస్తున్నాయని, దక్షిణాది రాష్ట్రాల ఆదాయం కూడా ఆ రాష్ట్రాలకు పోతోందని వాదించిన చంద్రబాబు ఇప్పుడు అలా మాట్లాడుతున్నారు.
👉కొత్త డిలిమిటేషన్ వల్ల దక్షిణాదికి నష్టం జరుగుతున్నప్పటికి ఆయన ఆ మాట అనలేకపోతున్నారు. వైసీపీ సభ్యులొకరు కేంద్రంలో టీడీపీపైనే ప్రభుత్వం ఆధారపడినప్పటికీ అని ఆయా అంశాలు ప్రస్తావిస్తుండగా, లోకేష్ జోక్యం చేసుకుని అలా చెప్పవద్దని, తాము బేషరతుగా కేంద్రంలోని ఎన్డీయేకి మద్దతు ఇస్తున్నామని అన్నారు. లోకేష్ కూడా అలా మాట్లాడారంటే.. బీజేపీ అంటే వీరు భయపడుతున్నారని చెప్పడానికి ఇవన్ని సంకేతాలు అవుతాయి.
ఒకప్పుడు ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ తాకట్టు పెట్టిందనే విమర్శను పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు పెద్ద ఎత్తున చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం వైఖరి ఎలాంటి విమర్శలకు అవకాశం ఇస్తున్నదో ఊహించుకోవచ్చు. ఏది ఏమైనా అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన వాగ్దానాల అమలుకన్నా, ప్రత్యర్ధులను వేధించి, జైళ్లలో పెట్టి అధికారాన్ని కొనసాగించాలన్న లక్ష్యం వల్ల చంద్రబాబు, లోకేష్‌లు మరింత అప్రతిష్ట పాలవుతారు తప్ప ప్రయోజనం ఉండదు. అధికారం అనే పొర కళ్లను వాళ్లను కప్పేసి ఉంటుంది కనుక ఆ హితోక్తి వారి చెవికి ఎక్కకపోవచ్చు.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment