నిరంతరం ప్రజలతోనే.. : వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy says YSRCP as Voice of the Voiceless | Sakshi
Sakshi News home page

నిరంతరం ప్రజలతోనే.. : వైఎస్‌ జగన్‌

Published Thu, Mar 13 2025 4:50 AM | Last Updated on Thu, Mar 13 2025 7:01 AM

YS Jagan Mohan Reddy says YSRCP as Voice of the Voiceless

వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడుతున్న పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

‘వాయిస్‌ ఆఫ్‌ వాయిస్‌లెస్‌’గా వైఎస్సార్‌సీపీ: వైఎస్‌ జగన్‌ 

పార్టీ ఎప్పుడూ ప్రజలకు అండగా నిలబడుతుంది

జనం గొంతుకై నిలుస్తుంది 

మళ్లీ వచ్చేది మనమే... మన పార్టీనే  

కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్సార్‌సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవం  

పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌  

వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ప్రజలకు తోడుగా, వారికి అండగా నిలబడుతుంది. ప్రజల తరపున వారి గొంతుకై నిలుస్తుంది. ‘‘యువత పోరు’’ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి నాయకుడు, కార్యకర్తకు అభినందనలు.  

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ సీపీ.. వాయిస్‌ ఆఫ్‌ వాయిస్‌ లెస్‌ (నోరు లేని ప్రజల గొంతుక)గా ఉంటుందని పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి (YS Jagan Mohan Reddy) వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.   

ప్రజల కష్టాల్లో నుంచి పుట్టింది.. 
వైఎస్సార్‌ సీపీని స్థాపించి 15 ఏళ్లు అవుతోంది. పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచి.. ఈ ప్రయాణంలో ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి వారి తరపున వాయిస్‌ ఆఫ్‌ వాయిస్‌లెస్‌గా ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూ వస్తోంది. మనం ప్రతిపక్షంలో కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల ప్రయాణంలో పదేళ్లు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. 

అధికార పక్షానికి ధీటైన సమాధానం ఇస్తూ వస్తున్నాం. కళ్లు మూసి తెరిచేసరికే ఇప్పటికే దాదాపు సంవత్సరం అయిపోయింది. మరో మూడు నాలుగు సంవత్సరాల్లో జరిగే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది వైఎస్సార్‌సీపీనే. ఈరోజు వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రతి కార్యకర్త గ్రామంలోని ఏ ఇంటికైనా ధైర్యంగా వెళ్లగలడు. 

ఏ పేద ఇంటికైనా మన కార్యకర్త సగర్వంగా, కాలర్‌ ఎగరేసుకుని వెళ్లగలిగే అవకాశం ఉంది. ఆ కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి సోదరుడు, ప్రతి అవ్వ, తాత, ప్రతి రైతు చిరునవ్వుతో పలకరిస్తారు. ఎందుకంటే.. వైఎస్సార్‌సీపీ ఎప్పుడైనా కూడా చెప్పిందంటే చేస్తుందన్న నమ్మకం ఈ రోజుకూ ప్రతి ఇంట్లో ఉంది కాబట్టే! 

వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న వైఎస్‌ జగన్‌   
  
పిల్లల ఫీజుల కష్టాలు... ‘యువత పోరు’ 
ఈరోజు విద్యాదీవెన, వసతి దీవెనకు సంబంధించి, పిల్లలకు జరుగుతున్న అన్యాయంపై నిరసన కార్యక్రమం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 10 నెలలు అవుతోంది. ఎన్నికల వేళ వాళ్లు చెప్పిన సూపర్‌సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీలన్నీ  గాలికెగిరిపోయాయి. చదువులు, వైద్యం, గవర్నెన్స్, వ్యవసాయం.. ఏది చూసినా వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. 



ఈరోజు పిల్లల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి, ఒక్కొక్క క్వార్టర్‌కు రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద ఏడాదికి నాలుగు క్వార్టర్లకు రూ.2,800 కోట్లు కేటాయించాలి. వసతి దీవెన కింద ప్రతి ఏడాది ఏప్రిల్‌లో మరో రూ.1,100 కోట్లు కేటాయించాలి. అంటే.. గత ఏడాది ఈ రెండింటికి సంబంధించి పిల్లల చదువుల కోసం మొత్తం రూ.3,900 కోట్లు కేటాయించాల్సిన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కేవలం రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే.. రూ.3,200 కోట్లు బకాయిలు పెండింగ్‌లో పెట్టారు.    
 
తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ జెండాను ఆవిష్కరిస్తున్న పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

అంతేకాకుండా ఈ ఏడాది 2025–26కి సంబంధించి విద్యాదీవెన కింద రూ.2,800 కోట్లు, వసతి దీవెన కింద మరో రూ.1,100 కోట్లు కలిపి మొత్తం మరో రూ.3,900 కోట్లు ఇవ్వాలి. అంటే గతేడాది పెట్టిన రూ.3,200 కోట్ల బకాయిలతో కలిపి మొత్తం దాదాపు రూ.7,100 కోట్లు కేటాయించి, పిల్లలను ఆదుకోవాల్సింది పోయి కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే నామమాత్రంగా కేటాయించి పిల్లల చదువులతో ఆడుకుంటున్నారు. పిల్లలు, వారి తల్లిదండ్రులతో కలసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా యాదృచ్ఛికంగా ఈరోజు జరుగుతోందని చెప్పడానికి సంతోషిస్తున్నా. 

⇒ శాసన మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ, పార్టీ స్టేట్‌ కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, పలువురు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, అనుబ«ంధ విభాగాల అ«ధ్యక్షులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement