
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. పండుగ సందర్భంగా పార్టీ నేతలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
ఉగాది వేడుకల సందర్భంగా ప్రముఖ అవధాని నారాయణ మూర్తి పంచాంగ శ్రవణం చెప్పారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మళ్ళీ విజయ దుందుభి మోగిస్తారు. ఓడితే చాలా మంది భయపడతారు. కానీ, వైఎస్ జగన్ అలా బయటపడలేదు. మిథున రాశి వారికి ఈ ఏడాది మంచి జరుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి. ఆవేశంలో ప్రజలు చేసిన తప్పులకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. శ్రీ కృష్ణదేవరాయలులాగా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి వైఎస్ జగన్. సాంఘికంగా ఔన్నత్యాన్ని పొందుతారు. ముఖ్యమంత్రి కుర్చీలో మళ్ళీ తిరిగి వైఎస్ జగన్ కూర్చుంటారు’ అని చెప్పుకొచ్చారు.
ఇక, ఉగాది వేడుకల్లో పార్టీ కార్యాలయ ఇన్‌ఛార్జ్ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
